ఎయిర్‌వాల్వ్‌ను ఢీకొట్టిన కారు
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దేవులతండా సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు కారులో పయనమైన ఐదుగురు స్నేహితులను అతివేగం బలిగొంది. వారు ప్రయాణిస్తున్న కారు ఓ మూలమలుపు వద్ద అదుపు తప్పి మెట్రో వాటర్ బోర్డు ఎయిర్ వాల్వ్‌ను ఢీకొట్టింది. దీంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు.
సాక్షి, చింతపల్లి (దేవరకొండ): ఉత్సాహంతో బయలుదేరిన ఆ ఐదుగురు కుర్రాళ్ల విహార యాత్ర విషాదాంతమైంది. సాగర్ అందాలను వీక్షించేందుకు మొదలు పెట్టిన వారి ప్రయాణం గమ్యం చేరకుండానే మృత్యుఒడికి చేరింది. మరో గంటన్నరలో గమ్యం చేరుకోవాల్సిన వారిని అతివేగం బలిగొంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి మెట్రో వాటర్ బోర్డు ఎయిర్‌వాల్వ్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరు గ్రామపంచాయతీ పరిధిలోని దేవులతండా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్న పసుపుల శివ భాస్కర్ (23), శ్రీనుయాదవ్ (24), సాకే నాగేంద్ర (25), ఎడ్ల శ్రీకాంత్‌రెడ్డి (25), వేముల భరత్ (23) స్నేహితులు.
వీరంతా నాగార్జునసాగర్ అందాలను వీక్షించి సరదాగా గడపాలని అనుకున్నారు. నాగేంద్రకు చెందిన కారులో వారి ప్రయాణం మొదలైంది. మొదట నాగేంద్ర తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కొక్క స్నేహితుడి వద్దకు వెళ్లి కారులో పికప్ చేసుకున్నాడు. ఐదుగురు స్నేహితులు కలసి హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు పయనమయ్యారు. మరో గంటన్నరలో గమ్యం చేరుకునేలోగా అతివేగం వీరి ఉసురు తీసింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఉదయం 6 గంటల సమయంలో చింతపల్లి మండలం వింజమూరు గ్రామపంచాయతీ పరిధిలోని దేవులతండా సమీపంలోకి రాగానే వేగాన్ని మూలమలుపు వద్ద నియంత్రించలేక అదుపు తప్పి హైదరాబాద్–నాగార్జునసాగర్ రహదారి పక్కనే ఉన్న మెట్రో వాటర్ బోర్డు ఎయిర్‌వాల్వ్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
రెండు గంటలు శ్రమించి మృతదేహాల వెలికితీత
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కున్నాయి. దీం తో మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. దీనికి తోడు గ్రామస్తులు కరోనా వల్ల సహాయక చర్యలకు వెనుకంజ వేశారు. దీంతో చింతపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది, సర్పంచ్ బాల్‌సింగ్‌తో కలసి మృతదేహాల వెలికితీతకు రెండుగంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఘటన స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, నాంపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆర్‌అండ్‌బీ డీఈ ఖాజన్‌గౌడ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
మూలమలుపు.. అతివేగమే కారణం
హైదరాబాద్–నాగార్జునసాగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి గల ప్రధాన కారణం మూలమలుపు, అతివేగమేనని పోలీసులు చెబుతున్నారు. దేవులతండా సమీపంలో ప్రమాదకరమైన మూలమలుపు ఉండటంతో అది గమనించని నాగేంద్ర మూలమలుపు వద్ద ఒక్కసారిగా వేగాన్ని నియంత్రించలేక వాహనాన్ని ఎడమ వైపునకు తిప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడి వాహనం పక్కనే ఉన్న ఎయిర్‌వాల్వ్‌ను బలంగా ఢీకొట్టింది.
ఐదుగురు పేద కుటుంబాలకు చెందిన వారే..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు యువకులు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలకు చెందినవారే. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన శివభాస్కర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అలాగే అదే జిల్లాకు చెందిన నాగేంద్ర కూడా హైదరాబాద్‌లోని శాలివాహన కాలనీలో నివాసం ఉంటున్నాడు. నాగేంద్ర మూడు మాసాల క్రితమే కారును కొనుగోలు చేసినట్లు తండ్రి పుల్లయ్య తెలిపాడు. నాగేంద్ర ఆరు మాసాల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. వేముల భరత్‌కు ఏడాదిన్నర క్రితం వివాహం అయ్యింది. ఎడ్ల శ్రీకాంత్‌రెడ్డి ఓ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శ్రీనుయాదవ్, శివ భాస్కర్ ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. కాగా భరత్, నాగేంద్ర తమ తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం. చేతికి అందివచ్చిన కుమారులు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment