పల్లెబాట పట్టండి
వైద్యులకు మంత్రి యు.టి.ఖాదర్ సూచన
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం
సామాజిక బాధ్యతగా గుర్తించాలని హితవు
బెంగళూరు : వైద్య విద్యను పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవచేయడాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ సూచించారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రావాలని పేర్కొన్నారు. మడికేరిలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైద్యులు, కుటుంబ సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో ఉచితంగా విద్యతో పాటు వసతి, భోజనాన్ని పొందిన వారు సైతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప గొప్ప చదువులు చదివిన తాము పల్లెలకు వెళ్లడమా అన్న భావన చాలా మందిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. తాము గొప్ప చదువులు చదివామన్న భేషజాన్ని వైద్యులు వదిలి, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని అన్నారు. హెచ్1ఎన్1తో పాటు డెంగీ, మలేరియా, పాముకాటు, కుక్కకాటు తదితర అన్ని చికిత్సలకు అవసరమైన మందులు ఆస్పత్రుల్లో ఉండేలా చూసుకోవాలని సూచించారు.