క్రీడలు, ఆర్ట్, లింగ వివక్ష నిర్మూలనకు భారీగా పెరిగిన సీఎస్‌ఆర్ నిధులు
ఆరోగ్యం, పర్యావరణంకు తగ్గిన నిధులు
2022–23లో రూ. 29,987 కోట్లు ఖర్చు చేసిన కార్పొరేట్స్
ఇందులో ఒక్క విద్యారంగానికే అత్యధికంగా రూ.10,085 కోట్లు కేటాయింపు
ముందంజలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్
సాక్షి, అమరావతి: దేశ ప్రగతిలో తమవంతు పాత్రను పోషిస్తూ సమాజ శ్రేయస్సు కోసం వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలు తమ సేవానిరతిని చాటుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో సామాజిక భద్రతను కల్పించేందుకు ఈ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ సామాజిక నిధుల (సీఎస్‌ఆర్) వ్యయాలను పరిశీలిస్తే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యంగా క్రీడలు, కళలు–సంప్రదాయాలు, మహిళా సాధికారిత, జంతువుల సంక్షేమం, లింగ వివక్ష రూపుమాపడం వంటి కార్యక్రమాలకు నిధులు క్రమేపీ పెరుగుతున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఐదు రంగాలకు కేటాయింపులు ఏకంగా 48 శాతం పెరిగాయి. ఈ ఐదు రంగాలకు 2021–22లో రూ.174 కోట్లు వ్యయం చేస్తే ఇపుడు రూ.1,800 కోట్లు వ్యయం చేశాయి.
ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే సీఎస్‌ఆర్ నిధులు క్రీడలకు 80 శాతంగా రూ.292 కోట్ల నుంచి రూ.526 కోట్లకు పెరిగాయి. అదే విధంగా దేశ సంస్కృతిని కళలను ప్రోత్సహిస్తూ ఈ రంగానికి నిధులను రూ.248 కోట్ల నుంచి రూ.441 కోట్లకు పెంచడం గమనార్హం.
అత్యధికంగా విద్యారంగానికే..
మొత్తం సీఎస్‌ఆర్ నిధుల వినియోగం చూస్తే విద్యారంగానికే కార్పొరేట్ సంస్థలు భారీగా కేటాయింపులు చేశాయి. 2021–22లో విద్యారంగానికి రూ.6,557 కోట్లు కేటాయిస్తే ఈ సారి ఈ మొత్తం రూ.10,085 కోట్లకు చేరింది. విద్యారంగం తర్వాత అత్యధికంగా వైద్య రంగానికి కేటాయించినా గతేడాదితో పోలిస్తే నిధుల కేటాయింపు తగ్గింది.
ఆరోగ్యరంగానికి సీఎస్‌ఆర్ నిధుల కేటాయింపు రూ.7,806 కోట్ల నుంచి రూ.,6830 కోట్లకు తగ్గింది. ఇదే బాటలో పర్యావరణం రంగానికి కూడా నిధుల కేటాయంపు రూ.2,432 కోట్ల నుంచి రూ.1,960 కోట్లకు తగ్గాయి. గ్రామీణాభివృద్ధికి, జీవన ప్రమాణాలు పెరుగుదల వంటి రంగాలకు కూడా కార్పొరేట్ సంస్థలు భారీగానే వ్యయం చేస్తున్నాయి.
సీఎస్‌ఆర్‌లో హెచ్‌డీఎఫ్‌సీదే పెద్ద పీట
కార్పొరేట్ సంస్థలు తమకు వచ్చిన లాభాల్లో కనీసం రెండు శాతం నిధులను సామాజిక బాధ్యతకు వినియోగించ్సా ఉంది. 2022–23 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు సీఎస్‌ఆర్ ఫండ్ ద్వారా రూ.29,987 కోట్లు వ్యయం చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.803 కోట్లు వ్యయం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) రూ. 774 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.743 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.477 కోట్లు, టాటాస్టీల్ రూ.454 కోట్లు వ్యయం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment