అమరరాజా బ్యాటరీస్ మాజీ సీఎఫ్‌వో సి. మురళీకృష్ణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు (సీఎస్‌ఆర్) ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉండాలని అమరరాజా బ్యాటరీస్ మాజీ సీఎఫ్‌వో సి. మురళీకృష్ణ చెప్పారు. సీఎస్‌ఆర్, కార్పొరేట్ గవర్నెన్స్ ఒక దాని వెంట మరొకటి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాపార, పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ, బోంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ సంయుక్తంగా కంపెనీల చట్టం 2013పై నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మురళీకృష్ణ ఈ విషయాలు చెప్పారు.
మరోవైపు, కంపెనీల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఉద్దేశించిన కొత్త కంపెనీల చట్టం.. దేశీయంగా కార్పొరేట్ రంగం వృద్ధికి తోడ్పడగలదని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ కుమార్ రుంగ్టా తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంలో తోడ్పడేందుకు ఫ్యాప్సీ అంతర్గతంగా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.