కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు కొత్త పంథాలో వినియోగం
ఐఐటీ బాంబే, ఐఐఎస్సీ బెంగళూరు, ఇతర సంస్థలకు సహకారం
ఏపీలో తొలిసారిగా ఐఐపీఈతో భాగస్వామ్యం
చమురు పరిశోధనలకు సహకారం
రూ.2.50 కోట్లకు ప్రతిపాదనలిచ్చినా.. రూ.4 కోట్లు సాయం
ఎస్‌బీఐ లాభాల్లో 1 శాతం సీఎస్సార్ కింద ఎస్‌బీఐ ఫౌండేషన్‌కు
‘సాక్షి’తో ఎస్‌బీఐ ఫౌండేషన్ ఎండీ సంజయ్ ప్రకాష్
సాక్షి, విశాఖపట్నం : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పంథాలో వినియోగిస్తోందని, కేవలం విద్య, వైద్యంపైనే కాకుండా.. ఆవిష్కరణలు, పరిశోధనలకు చేయూతనిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ (ఎస్‌బీఐఎఫ్) ఎండీ సంజయ్ ప్రకాష్ తెలిపారు.
ఇక్కడి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)లో ఎస్‌బీఐఎఫ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎక్స్‌ఆర్‌డీ ఎనలైటికల్ ల్యాబ్‌ని ఆయన ఐఐపీఈ డైరెక్టర్ ప్రొ.శాలివాహన్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ ప్రకాష్ ‘సాక్షి’తో స్టేట్ బ్యాంక్ ఫౌండేషన్ గురించి పలు విషయాలు వెల్లడించారు.
పరిశోధనలకు ప్రాధాన్యం
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎస్‌బీఐ దశాబ్దాలుగా సేవలందిస్తోంది. లాభాల్లో ఒక శాతం సామాజిక సేవకు కేటాయిస్తున్నాం. గతేడాది రూ.61 వేల కోట్ల లాభాలొచ్చాయి. ఏటా లాభాలు పెరుగుతున్నకొద్దీ సీఎస్‌ఆర్ కార్యక్రమాలు పెంచుతున్నాం. ఇప్పటివరకు విద్య, వైద్యం, పర్యావరణం, నీటి నిర్వహణ, గ్రామీణాభివృద్ధి తదితర విభాగాల్లో సీఎస్సార్ నిధులు వెచ్చించాం.
కానీ.. దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన పరిశోధనలకూ చేయూతనందించాలని నిర్ణయించాం. అదేవిధంగా యువత ఆవిష్కరణలకు ఆర్థికంగా దన్నుగా నిలబడుతున్నాం. ఐదేళ్లుగా ఈ తరహా కార్యక్రమాలు విస్తృతం చేశాం. ఇప్పటికే ఐఐటీ బాంబే, ఐఐఎస్సీ బెంగళూరు, సీ–క్యాంప్ బెంగళూరు, ఇక్రిశాట్ మొదలైన సంస్థలకు సహకారం అందిస్తున్నాం. ఎస్‌బీఐఎఫ్ ద్వారా అనేక ఆవిష్కరణలు, పరిశోధనలు జరగడం మాకూ గర్వకారణంగానే ఉంది.
ఏపీలో తొలిసారిగా..
అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్‌బీఐఎఫ్ సేవలు ప్రముఖ సంస్థలకు అందాయి. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ ఐఐపీఈతో భాగస్వామ్యమయ్యాం. చమురు పరిశోధనలకు ఐఐపీఈకి సహకారం అందించేందుకు ఎక్స్‌ఆర్డీ ల్యాబ్ ఏర్పాటు చేశాం. వాస్తవానికి ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన ప్రతిపాదనలకు ఎవరైనా కొంత తగ్గించి నిధులు కేటాయిస్తారు.
ఎస్‌బీఐఎఫ్ మాత్రం ఇందుకు భిన్నం. ఈ ల్యాబ్ ఏర్పాటుకు రూ. రూ.2.50 కోట్లకు ప్రతిపాదనలిస్తే.. ఎస్‌బీఐఎఫ్ మాత్రం రూ.4 కోట్లు అందించింది. ఈ ల్యాబ్ మూడేళ్ల పాటు పరిశోధనలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టేందుకు అవసరమైన చేయూతనందిస్తున్నాం.
యువతకూ ప్రోత్సాహం
దేశంలో సామాజిక సేవపై ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్స్, యంగ్ ప్రొఫెషనల్స్‌కు సాయమందించేందుకు ఎస్‌బీఐఎఫ్ ద్వారా ఏటా ఫెలోషిప్ ప్రొగ్రామ్ అందిస్తున్నాం. స్టేట్ బ్యాంక్ గ్రూప్‌లోని ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రొగ్రామ్ పేరుతో దేశంలో సామాజికంగా మార్పులు తీసుకురావడం లక్ష్యంగా ఎస్‌బీఐఎఫ్ 2011లో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
దేశంలోని గ్రామాల స్థితిగతులు, అక్కడ ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎన్జీవోలతో కలిసి యువతతో అధ్యయనం చేయిస్తూ చేయూతనందిస్తున్నాం. ఇప్పటివరకు 27 బ్యాచ్‌లలో 20 రాష్ట్రాలకు చెందిన 250కి పైగా గ్రామాల్లో 580 మంది ఫెలోషిప్ చేశారు. ఇలా.. భిన్నమైన ఆలోచనలతో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ఎస్‌బీఐఎఫ్ ప్రోత్సాహమందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment