గడచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు
దేశంలో ఇప్పటివరకూ లోక్‌సభకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం వెల్లువెత్తింది. 2019లో జరిగిన నాలుగు దశల ఎన్నికలతో పోలిస్తే ఈ సారి(పోస్టల్ బ్యాలెట్లు మినహాయించి) 1.9 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్టు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది.
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2019 నాలుగు దశల్లో 42.6 కోట్ల మంది ఓటేస్తే ఈసారి నాలుగు దశల్లో 45.1 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 2.5 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్లు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. 4 దశల్లో పెరిగిన ఓటర్లలో మహిళా ఓటర్లే 93.6 లక్షల మంది ఉండగా పురుష ఓటర్లు 84.7 లక్షల మంది ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. 2019 కంటే 2024లో అత్యధికంగా ఓట్లు వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 19.5 లక్షల ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది.
కర్నాటకలో అత్యధికంగా 35.5 లక్షల ఓటర్లతో తొలి స్థానంలో, తెలంగాణలో 31.9 లక్షల ఓటర్లతో రెండో స్థానంలోనూ, మహారాష్ట్ర 20 లక్షల ఓటర్లతో మూడో స్థానంలో ఉన్నట్లు నివేదికలో వివరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసిన వారి కన్నా 2024లో కేరళలో 5.3 లక్షల ఓటర్లు తగ్గారని, మణిపూర్‌లో 3.4 లక్షల ఓటర్లు తగ్గినట్టు ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలే మహిళా ఓటింగ్ పెరగడానికి దోహదపడిందని వివరించింది. ఏపీలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఎన్నికల్లో 8.4 లక్షల మహిళా ఓటర్లు అధికంగా ఓటు వేసినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment