
రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
పోటీలో 70 మంది అభ్యర్థులు
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
ఎన్నికల విధుల్లో 6,287 మంది పోలింగ్ సిబ్బంది
8,515 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు
అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ
మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
పోలింగ్ కోసం 6,287 మంది పోలింగ్ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్‌వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపునకు తూర్పు–పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానానికి ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్ కౌంటింగ్ గుంటూరు ఏసీ కాలేజీలో జరగనుంది. శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల స్థానానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ స్థానానికి 35 మంది పోటీ
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు.
ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవరా>్గనికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment