మహిళా ఓటర్లే ఎక్కువ
పురుష ఓటర్లు 2.03 కోట్లు, మహిళా ఓటర్లు 2.10 కోట్లు
దివ్యాంగ ఓటర్లు 5,18,383 మంది
తుది జాబితా ప్రకటించిన సీఈవో వివేక్ యాదవ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,40,447 అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాకు సవరణ అనంతరం తుది జాబితాను ఆయన సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలో పురుషులకన్నామహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. సర్విసు ఓటర్లతో కలిపి పురుష ఓటర్లు 2,03,52,816 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,10,84,231 మంది ఉన్నారు.
3,400 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్ల సంఖ్య 4,86,226 కాగా, తుది జాబితాలో 5,14,646కు పెరిగింది. దివ్యాంగ ఓటర్లు 5,18,383 మంది ఉన్నారు. ఓటర్లు, జనాభా నిష్పత్తి 719గా ఉంది. లింగ నిష్పత్తి 1039గా ఉంది.
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,64,184 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,73,388 మంది ఓటర్లు ఉన్నారు. సర్విసు ఓటర్లు ముసాయిదా జాబితాలో 67,143 ఉండగా తుది జాబితాలో 66,690 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,397.
Comments
Please login to add a commentAdd a comment