♦ 14 ఏళ్లు ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న సెంటర్లకు తాజాగా ‘సి’ గ్రేడ్
♦ ఖర్చు నుంచి తప్పించు కునేందుకు సర్కార్ కుట్ర
♦ ఎన్‌యూహెచ్‌ఎంతో పుష్కలంగా నిధులు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆధీనంలోని అర్బన్ హెల్త్ సెంటర్లను (యూహెచ్‌సీ) కార్పొరేట్లకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నుతోంది. ఇందులో భాగంగా హెల్త్ సెంటర్ల పనితీరుపై ఇటీవలే సర్వే నిర్వహించి ‘సి’ గ్రేడ్ ఇచ్చింది. పధ్నాలుగేళ్లపాటు ‘ఎ’ గ్రేడ్‌లో పనిచేసిన సెంటర్లు ఒక్కసారిగా ‘సి’ గ్రేడ్‌కు పడిపోవడం వెనుక సర్కార్ గూడుపుఠాణీ దాగుం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలో 22 యూహెచ్‌సీలు పనిచేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితమే ఐదు సెంటర్లను నేషనల్ రూరల్ హెల్త్‌కేర్ మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం)కు అప్పగించారు.
ఈ సెంటర్లకు మందులు, వైద్యులు, ఉద్యోగులకు జీతాలు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ద్వారా మంజూరవుతున్నాయి. మిగిలిన 17 సెంటర్లను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్‌యుహెచ్‌ఎం)కు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం చొప్పున నిధులు సమకూర్చాలనేది ఒప్పందం. ఈ నెల నుంచే ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ జాప్యం చోటుచేసుకుంది.
తప్పించుకునేందుకే..
అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా తాను భరించాల్సిన 25 శాతం వాటా నుంచి తప్పించుకోవాలన్నది సర్కార్ ఎత్తుగడ. ఈ మేరకు కొన్ని కార్పొరేట్ సంస్థలతో చర్చలు సాగించినట్లు సమాచారం. స్వచ్ఛంద సేవ ముసుగులో కార్పొరేట్లకు పెత్త నం అప్పగిస్తే పేదలకు ఏ మేరకు వైద్యసేవలు అందుతాయన్న ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. గడిచిన పదిహేనేళ్లుగా ఎన్జీవోల భాగస్వామ్యంతో నడుస్తున్న అర్బన్ హెల్త్‌సెంటర్లు పేద వర్గాలకు వైద్యసేవల్ని అందిస్తున్నాయి. విద్య, వైద్య రంగాల్లో హవా కొనసాగిస్తున్న కార్పొరేట్ సంస్థలు అర్బన్ హెల్త్ సెంటర్లలో బడుగు వర్గాలకు ఏ మేరకు వైద్య సేవలు అందిస్తాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అలంకారప్రాయమేనా?
ఎన్‌యూహెచ్‌ఎంలో భాగంగా సిటీ అర్బన్ హెల్త్ సొసైటీని ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా మేయర్, కన్వీనర్‌గా కమిషనర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. డిప్యూటీ డెరైక్టర్ స్థాయి అధికారిని ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా నియమించారు. వైద్యులు, ఏఎన్‌ఎంల నియామకాలను ఈ కమిటీయే పర్యవేక్షించాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పదవులు అలంకారప్రాయమయ్యే ప్రమాదం లేకపోలేదు.
నిధులుండీ లాభం లేదు..
నగరంలో ప్రతి 6 వేల మందికి ఒక ఏఎన్‌ఎం ఉండాల్సి ఉండగా 20 వేల మందికి ఒకరు సేవలందిస్తున్నారు. కేదారేశ్వరపేట, మధురానగర్, పటమట, కండ్రిక, వాంబేకాలనీ, రాణీగారి తోట, లంబాడీపేట, వించ్‌పేట హెల్త్‌సెంటర్లలో ఆయుర్వేదిక్, లబ్బీపేట సెంటర్లో హోమియో వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.11 వేల జీతానికి ఎంబీబీఎస్‌లు ముందుకు రాకపోవడంతో వీరితోనే నెట్టుకొస్తున్నారు.
ఎన్‌యుహెచ్‌ఎం ఆధీనంలోకి వెళితే ఏఎన్‌ఎంలకు చెల్లిస్తున్న రూ.5 వేల జీతం రూ. 12 వేలకు చేరుతోంది. అలాగే వైద్యులకు రూ.30 వేల పైబడి జీతం అందే అవకాశం ఉంది. టెక్నీషియన్స్, హెల్త్ విజిటర్స్, రెండు సెంటర్లకు ఒక స్టాఫ్‌నర్సు, నెలకు మందుల కొనుగోళ్లకు లక్ష రూపాయలు చొప్పున మంజూరవుతాయని నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ లెక్కన అర్బన్ హెల్త్ సెంటర్ల పూర్తి స్వరూపమే మారుతుంది.
యూహెచ్‌సీల పగ్గాలు కార్పొరేట్లకు
Published Wed, Apr 15 2015 5:14 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement