సాక్షి, న్యూఢిల్లీ: పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేవలం హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత సంఘ సేవకుడు చమన్‌లాల్ శతజయంతి సందర్భంగా భారతీయ పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు.
అందుకే హక్కులు, బాధ్యతల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో సర్వస్వాన్ని కోల్పోయిన భారతీయ కుటుంబాలను పరామర్శిస్తూ వారికి చమన్‌లాల్ అండగా నిలిచారన్నారు. చమన్ లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని తపాలా బిళ్లను విడుదల చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ తపాలా శాఖను ఉపరాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రులు దేవ్‌సింగ్ చౌహాన్, రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభలో 22.60% సమయం సద్వినియోగం
పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో మూడోవారం 8 బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో ఎగువ సభలో సద్వినియోగమైన సమయం(ప్రొడక్టివిటీ) 24.2 శాతానికి పెరిగింది. ఇది మొదటి వారంలో 32.20 శాతం, రెండో వారంలో కేవలం 13.70 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు రాజ్యసభ పరిశోధక విభాగం గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా మొత్తం మూడు వారాల్లో సద్వినియోగమైన సమయం 22.60 శాతంగా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూలై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెగసస్ స్పైవేర్‌తోపాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు మొదటిరోజు నుంచే ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రవేశపెడుతూనే ఉంది. గతవారం 17 పార్టీలకు చెందిన 68 మంది సభ్యులు వివిధ బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో బిల్లులపై మొత్తం 3.25 గంటలపాటు చర్చలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment