civil rights
-
జనుల కోసం తపించాడతడు!
పుట్టిన ప్రతి జీవి జీవితం బాగుండాలని తపించారాయన. జీవించే హక్కు కోసం తన చివరి ఊపిరి వరకు ఆయన పోరాడారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరి రక్షణ కోసం ఉద్యమించారాయన. చట్టాల ఉల్లంఘనను నిలదీశారు. ఆయనే కె. బాల గోపాల్! హింస ఏదైనా, ఎవరు చేసినా ఈ హక్కుల నేత, ప్రజల న్యాయవాది వ్యతి రేకించే వారు. అది రాజ్యహింస అయినా, ప్రైవేట్ వ్యక్తుల హింస అయినా దేనినీ సహించే వారు కాదు. అభివృద్ధి పథకాల పేరిట ప్రజల జీవించే హక్కును ప్రభుత్వాలు హరిస్తు న్నాయనీ; నేల, నీరు, అడవులు వంటి ప్రకృతి ఇచ్చిన సంపదను కోట్లాదిమంది జీవనోపాధికి ఉపయోగించాలనీ సెజ్‌లను వ్యతి రేకిస్తూ పోరాటం చేశారు. భూ నిర్వాసితుల పక్షాన నిలబడ్డారు. బాలగోపాల్ సర్ 2009 అక్టోబర్ 8న ఆకస్మికంగా హైదరాబాద్‌లో మరణించారు. ప్రముఖ జర్నలిస్ట్, ఆయన సహచరి వసంత లక్ష్మి, వారి కొడుకు కళ్ళ ముందే ఆయన ఊపిరి వదిలారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల నిజమైన ఉద్యమ గొంతు మూగ వోయింది. సర్ ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోయి 14 ఏండ్లు దాటు తున్నా ఆయన ఎక్కడో ఇంకా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన చివరి సారిగా మంచిర్యాలలోని మా ఇంటికి భార్యాకుమారులతో కలిసి వచ్చి భోజనం చేసి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించి నిర్వాసితులతో మాట్లాడిన విషయాలూ, ఆయన నింపిన మనో ధైర్యం నేటికీ గుర్తుకు వస్తున్నాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణవార్త కలిచి వేసింది. హడావిడిగా మిత్రులతో హైదరాబాద్ వెళ్లి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నాను. ఎన్కౌంటర్లపై న్యాయ విచా రణ జరపాలనీ, పోలీసుల మీద హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలనీ, సంఘటనా స్థలానికి వెళ్లి నిజనిర్దారణ చేసి మరీ డిమాండ్ చేసే వారు బాలగోపాల్. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత చాలా కేసులను ఆయన తీసుకుని వాదించారు. రాజ్యానికి ఆయనంటే గుబులు, ఆందోళన. అందుకే ఆయన్ని భౌతిక దాడులతో భయపెట్టే ప్రయత్నం చేశారు. కొత్తగూడెంలో పోలీసులు బాల గోపాల్ మీద ప్రీ ప్లాన్డ్గా దాడి చేసి కొట్టి, గాయపరిచి చచ్చి పోయాడని భావించి కాలువలో పడేసి వెళ్లిపోయారు. అప్పుడు ఆయనను చూసిన కొందరు అభిమానులు కాపాడారు. కష్టపడే వారికి కనీస వేతనాల కోసం, ఆదివాసీల హక్కుల కోసం; బొగ్గు గని కార్మికుల, కాంట్రాక్టు కార్మికుల జీవితాల మెరుగు కోసం; కాలుష్య రహిత సమాజం కోసం... మొత్తంగా మానవ హక్కుల కోసం ఆయన పోరాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా బూటకపు ఎన్కౌంటర్లు జరిగినపుడు బాలగోపాల్ వెంట వచ్చిన టీమ్‌తో నేనూ వెళ్లే వాడిని. ఆయన, నేను కలిసి కాగజ్ నగర్ నుంచి ఒక సంఘటనలో ఒకే సైకిల్ మీద నిజ నిర్ధారణకు వెళ్లిన సందర్భం ఇంకా గుర్తుంది. ఓపెన్ కాస్ట్ గనులు సృష్టించే విధ్వంసం మీద పోరాట సందర్భం అది. ఆ గనులు వద్దని ప్రజలు చేసిన ఉద్యమంలో బాలగోపాల్ పాత్ర కీలకంగా ఉండేది. లాకప్ డెత్‌లకు వ్యతిరేకంగా కూడా ఆయన కేసులు వేశారు. రాజ్యంతో పోరాడారు. కార్మికుల న్యాయమైన సమ్మె పోరాటాలను కూడా సమర్థించి వాటిల్లో పాల్గొని మద్దతు ఇచ్చేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించే వారు. ఉద్యమానికి మద్దతు కూడా ఇచ్చారు. ఆయన లేని లోటు ఆయన మరణించి 14 ఏండ్లు దాటినా ఇంకా భర్తీ చేసేవారు రాలేదు. బాల గోపాల్ లాంటి మనుషుల కొరత ఈ సమాజానికి ఉంది. ప్రశ్నించే వారి మీద ఉపా లాంటి కేసులు పెరిగాయి. మానవ హక్కులు ఎక్కడికక్కడ హరించ బడుతున్నాయి. దేశంలో ఒక వర్గానికి చెందిన వారిని కులం, మతం పేరు ఎమీద తీవ్ర అణచివేతకు గురి చేస్తున్నారు. లాకప్ లలో పెట్టి, పబ్లిక్‌గా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు, పెరుగుతున్న అమానవీయ చర్యలు, తద్వారా అధి కారం నిలబెట్టుకునే ప్రయత్నం, దేశంలో పెరిగిన నిరుద్యోగం, అసమానతలు, ఆకలి, అధిక ధరలు, ఆర్థిక ఇబ్బందులు, దేశ ప్రజలను విడదీసి పాలించే విధానం... ఇన్నింటి మధ్య నలుగుతున్న జనం హక్కుల గురించి ప్రశ్నించేవారు కరవవుతున్నారు. బాల గోపాల్ మళ్ళీ రావడం కుదరదు. కాబట్టి బుద్ధిజీవులే అందుకు సిద్ధం కావాలి. అందుకు సమయం ఇదే, ఛలో ఛలో కాలం పిలుస్తోంది. బాల గోపాల్ పిలుపు ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్లుంది. ఛలో ఛలో కహీన్ దేర్ న హోజాయే! ఎం.డి. మునీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు ‘ 99518 65223 (నేడు హైదరాబాద్ ఎస్వీకేలో బాలగోపాల్ 14వ సంస్మరణ సభ) -
Andhra Pradesh: రోడ్ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలపై పరిమితులు విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం సహేతుకమైనదేనా? ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందా? ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనా? ఈ జీఓ బ్రిటిష్ కాలం నాటిదా? మరి కోర్టు తీర్పులు ఈ అంశాలపై ఎలా ఉన్నాయి? రోడ్ షోలు, ర్యాలీల పేరుతో ఎక్కడపడితే అక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, ప్రభుత్వాన్నీ, మంత్రులనూ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌లో తూలనాడుతూ, చెప్పు చూపుతూ హెచ్చరికలు చేయడం, బూతులు తిట్టడం, ‘వర్కవుట్’ కాకపోతే ఎవరు ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చనే రీతిలో మాట్లాడటం, మంత్రులను బూతులతో సంబోధించడం... ఇవన్నీ చట్టబద్ధత కిందికే వస్తాయా? భావప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)ఏ, ఆర్టికల్ 19(1)బీ కిందికి వస్తాయా? మరి న్యాయస్థానాల తీర్పులు ఏం చెబుతున్నాయి? ఒకసారి పరిశీలిద్దాం! ఈ దేశంలో ఏ శాసనాలు అయినా, వాటిని అనుసరించి జారీ చేసే ఏ ఉత్తర్వులు అయినా భారత రాజ్యాంగం ప్రకారమే ఉంటాయి తప్ప... ఇతర దేశాలకు చెంది ఉండవు అనేది సగటు మనిషికి కూడా తెలుసు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బ్రిటిష్, అమెరికా వంటి దేశాల రాజ్యాంగాల్లోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వంటి అంశాలు కొన్ని అవసరమైన మార్పులతో స్వీకరించారు. ఆ విధంగా ఈ దేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఎన్నో కొనసాగుతున్నాయి. ఇవి భారతదేశ చట్టాలు గానే పరిగణించాలి. అంతేకానీ వాటిని బ్రిటిష్ చట్టాలు అని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడం అవుతుంది. పౌరుల హక్కులను అతిక్రమించి రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పుడు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అనీ, మరీ ముఖ్యంగా పోలీసుల దేననీ న్యాయస్థానాలు వివిధ కేసుల్లో తీర్పులు ఇచ్చాయి. ఉదాహరణకు కేరళ హైకోర్టులో ‘పీపుల్స్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ కేసులో రోడ్షోలఫై దాఖలైన ‘రిట్ అఫ్ మాండమస్’పై జస్టిస్ కె. బాలకృష్ణన్, జస్టిస్ పి. సుబ్రమణియన్, జస్టిస్ జె. కోషితో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమగ్ర విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఈ విచారణలో కొన్ని ఇతర రాష్ట్రాల తీర్పులను కూడా ఉటంకించారు. కాగా కామేశ్వర ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో, ప్రదర్శనలు– నినాదాలు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకిందికి వస్తాయా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. డిమాన్స్ట్రేషన్కి సంబంధించి, భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానాలను కూడా పేర్కొంది. ఆ ప్రకారం చూస్తే, పవన్ కల్యాణ్ మంత్రులను గాడిదలని సంబోధించడం, చెప్పులు చూపుతూ హెచ్చరికలు చేయటం వంటివన్నీ ఆర్టికల్ 19(1)ఏ ఆర్టికల్ 19(1)బీకి విరుద్ధమైనవీ, శిక్షార్హమైనవీ. ఇక కేసు విషయానికి వస్తే... వాహనదారులు, పాదచారులు సంచరించే ప్రధాన రహదారులపై రోడ్ షోలు, ర్యాలీలు అంటే పౌరుల హక్కులను కాలరాయడమే అనీ, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, బస్సుస్టేషన్, రైల్వేస్టేషన్ వంటి ప్రదేశాలకు పౌరులు సంచరించకుండా చేయడం అంటే పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేననీ ధర్మాసనం పేర్కొంది. పౌరుల ఈ హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వం మరీ ముఖ్యంగా పోలీసులదేననీ, ట్రాఫిక్‌ను నియంత్రించే హక్కు ఎవరికీ లేదు అని కోర్టు అభిప్రాయ పడింది. సభను నిర్వహించుకునే హక్కు పార్టీలకు ఉన్నా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించటానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 49, పోలీస్ యాక్ట్ సెక్షన్ 29 కింద శిక్షార్హులు. వీధుల్లో కవాతులు, ప్రదర్శనలు నియంత్రించే అధికారం పోలీసులకు ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తుల రక్షణ చట్టం(ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ) 1984, సబ్ సెక్షన్ 3 ప్రకారం, ఊరేగింపులు ప్రదర్శనల పేరుతో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఐదేళ్ల పాటు జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. ఈ వివరాలన్నీ ఉటంకిస్తూ, రోడ్ షోలు, ఊరేగింపులు, ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలనీ, ఆ ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేయాలనీ, లేదంటే పోలీసులకు కష్టసాధ్యమనీ కోర్ట్ అభిప్రాయపడింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడినట్టే అని వ్యాఖ్యానించింది. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించదలచుకున్నవారు ముందుగా కనీసం ఆరు రోజుల ముందు పోలీసు అధికారుల అనుమతి పొందాలి. అనుమతి పొందినా రోడ్డు మొత్తం ఆక్రమించడానికి వీలు లేదు. ర్యాలీ ఏం జరుగుతున్నా ట్రాఫిక్‌కి అంతరాయం కలగకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం సర్క్యులర్లు జారీ చేయాలి. ర్యాలీలో పెద్ద పెద్ద బ్యానర్లు నిషిద్ధం. పోలీసులు బ్యానర్ సైజులు నియంత్రించాలి. ఇదీ రోడ్ షోలు, ర్యాలీలకు సంబంధించి గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో గౌరవ న్యాయస్థానం తీర్పునకు లోబడి ఉందా? అప్రజాస్వామికంగా ఉందా? ప్రజాస్వామ్యవాదులు ఒకపరి ఆలోచించండి!! - పి. విజయ బాబు కానిస్టిట్యూషన్ లా నిపుణులు -
పౌరహక్కులే దేశానికి అరిష్టమా?!
ఒక దేశ పౌరుడిగా నెరవేర్చవలసిన కొన్ని బాధ్యతలుంటాయి. అవి నెరవేరుస్తూనే తన హక్కుల కోసం కూడా అతడు నిలబడాల్సి ఉంటుంది. అది కూడా తన బాధ్యతలో భాగం చేసుకున్నవాడే సమాజ శ్రేయస్సు గురించీ, సాటి మానవుడి గురించీ ఆలోచించగలడు, వారి కోసం పాటుపడగలడు. బాధ్యతగా ఉండటమంటే కేవలం ‘బుద్ధిగా’ తన పని తాను చూసుకోవడం కాదు. కానీ పాలకులకు కావాల్సింది ఎందులోనూ తలదూర్చని, అంటే ఏ ఉద్యమాల్లోనూ తలదూర్చని, సమాజంలో తమ వాటా కోసం పోరాడని వాళ్లు మాత్రమే. అలా ఉండటం కంటే ‘బాధ్యత లేనివాళ్లు’గా ఉండటమే దేశానికి మంచిది. ఎందుకంటే, ఆలోచన కూడా ఆత్మ నిర్భరతలో భాగమే! ‘అసలైన’ ఆత్మ నిర్భరతే నిజమైన స్వాతంత్య్రం! ‘‘భారతదేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాత గత డెబ్భై అయిదేళ్లలో ఎంతసేపూ పౌర హక్కుల గురించి మాట్లాడుతూ, ఆ హక్కుల కోసమే కొట్లాడుతూ ఉండటం వల్ల దేశం బలహీనపడుతూ వచ్చింది. హక్కుల కోసం పోరాటం పేరిట ఇన్నేళ్లూ కాలం గడిపేశాం. మన పౌరులు తమ బాధ్యతల్ని మరచిపోయి భారతదేశాన్ని బలహీనపర్చడంలో పెద్ద పాత్ర వహించారు. 2047వ సంవత్సరం నాటికి, మనం 24 ఏళ్లలో కోల్పోయిన గత వైభవాన్ని తిరిగి పొందాలంటే దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చడానికి బాధ్యతలు శిరసావహించే మార్గంలో యువత నడవాలి.’’ – ప్రధాని మోదీ ఢిల్లీలో 20 జనవరి 2022న జారీ చేసిన ప్రకటన కానీ ఇంతకూ అసలు విశేషమేమంటే, ప్రధానమంత్రి ఒక దేశ బాధ్యతాయుత ప్రథమ పౌరునిగా తాను పేర్కొన్న ‘పౌర బాధ్యతల’ అధ్యాయంలో... దేశాన్ని వెనక్కి కాకుండా ముందుకు నడిపించడానికి అనుసరించాల్సిన శాస్త్రీయ దృక్పథం గురించిన ప్రస్తావన నామ మాత్రంగా కూడా లేకపోవడం! ప్రజలు తమకు తాముగా అంకితం చేసుకున్న (‘ఉయ్ ది పీపుల్’) రాజ్యాంగానికి ఏ రాజకీయ పక్షానికి చెందిన నాయకులైనా ఎలా తూట్లు పొడవగలరో డాక్టర్ అంబేడ్కర్ ఎంతో దూరదృష్టితో హెచ్చరించారు: ‘‘రాజ్యాంగ రూపాన్ని మార్చ కుండానే ఆచరణలో రాజ్యాంగం లక్ష్యాలకు పాలకులు తూట్లు పొడుస్తూ ముందుకు సాగిపోవచ్చు. ఎందుకంటే, రాజ్యాంగబద్ధమైన నైతికత అనేది స్వభావసిద్ధంగా అలవడే లక్షణం కాదు. అలాంటి ఉత్తమ లక్షణం పాలకులు అలవర్చుకుంటే తప్ప అబ్బేది కాదు’’ అంటూనే అంబేడ్కర్... ‘ప్రజాస్వామ్యం’ అనే మాట భారతదేశానికి సంబంధించినంతవరకూ ప్రధానంగా ‘ప్రజాస్వామ్య వ్యతిరేక’ లక్షణం కలిగివున్నదని వర్ణించారు. ‘‘అధికార స్థానాలు ఆక్రమించేవారు ఎవరైనా తమ ఇష్టం వచ్చిన రీతిలో పాలించడానికి స్వేచ్ఛ లేదు’’ అని అంబేడ్కర్ తెగేసి చెప్పారు. కానీ, భారత రాజ్యాంగానికి, అందులోని నిర్దేశిత బాధ్యతలకు పాల కులు అనుకూలంగా నడుచుకుంటున్నారా అన్నది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం నాడు మనం నిశితంగా పరిశీలించు కోవలసిన ఘడియ! దేశంలోని దళిత వర్గాలన్నీ పరాయి బ్రిటిష్ వలస సామ్రాజ్య పాలనా దాష్టీకాలను అనుభవించాయి. అయితే స్వాతంత్య్రానంతర పాలనలో నూతన రాజ్యాంగం రచనలో అంబే డ్కర్ ఆధ్వర్యంలో మెట్టువాటాను పంచుకున్న దళిత బహుజన వర్గాలకు ఆచరణలో సమాన హక్కులు పొంది, అను భవించే హక్కు ఉంది. అందువల్లనే దేశ పాలకులు ఏ వర్గం వారైనా, ఏ రంగు వారైనా ఇందుకు భిన్నంగా నడుచుకోవడానికి వీల్లేదన్నది ఏ పాలకుడి నిర్దేశమో కాదు, రాజ్యాంగ నిర్దేశమని మరచిపోరాదు. ‘కరోనా’ వైరస్ వ్యాప్తి పేరిట ఒక వైపున దిక్కూమొక్కూ లేని కోట్లాదిమంది ప్రజలు, అందులోనూ 16 కోట్లమందికి పైగా నిరు పేదలు... మందుల పేరిట యథేచ్ఛగా సాగుతున్న నిలువుదోపిడీకి బలైపోతున్నారు. మరోవైపున ఇదే అదనుగా ప్రపంచ అపర కుబేరుల సంపద రెట్టింపు అయింది. వారిలో భాగంగానే భారతదేశ కుబేరుల సంఖ్య 102 నుంచి 142కు డేకి, ‘చంపుడు కల్లం’గా (ఇనీక్వాలిటీ కిల్స్) మారిన పరిస్థితిని ‘ఆక్స్‌ఫామ్’ సంస్థ తాజా అంతర్జాతీయ వార్షిక నివేదిక (17 జనవరి 2022) వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ‘పౌర హక్కుల రక్షణ’ పేరిట దేశంలోని యువత నడుపుతున్న ఆందోళనోద్యమాల వల్లనే దేశం బలహీనపడిందని పాలకులు వాపోవడం దుస్సహం! సరిగ్గా ఈ దశలోనే సుప్రసిద్ధ హిందీ రచయిత సంపత్ సరళ్ – పాలకులు చేపట్టిన ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ నినాదం చాటున సాగుతున్న ‘పరాయి ఆర్థిక వ్యవస్థ పోషణ’ తతంగాన్ని ఎండగడుతూ గొప్ప వ్యంగ్య రచన చేశారు. (దీని తెలుగు అనువాదం: వేములపల్లి రాధిక). హిందీలో వాగాడంబరాన్నే ‘వాణీ విలాసం’ అంటారని చెబుతూ, ఆ ‘విలాసం’ ఎలాంటిదో, దాని పోకడ ఎలా ఉంటుందో వర్ణించారు. దేశ పాలకుల ‘ఆత్మ నిర్భరత’ (స్వయం పోషక స్థితి) ఎన్ని రూపాలలో, మరెన్ని రూపాంతరాలలో మన ముందు సాక్షాత్క రిస్తుందో చూపారు. ‘‘చర్ఖావాలే (గాంధీ) దేశాన్ని ఏ కంబంధ హస్తాల నుండి విడిపించారో చాయ్‌వాలే తిరిగి వాళ్ల చేతుల్లోనే పెట్టా’’రని మరెవరో కాదు, స్వయానా చాయ్‌వాలే పార్టీకి చెందిన ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ పెద్ద మనిషే ఫిర్యాదు చేస్తాడు. ఏమని? ‘మేం స్వదేశీ నినాదంతో సింహాసన మెక్కిస్తే ఏం చేశాడు? విదేశీ కంపెనీల కోసం దేశాన్ని ప్రైవేట్‌పరం చేయడంలో మునిగితేలు తున్నారంటాడు. కాగా, మల్టీ నేషనల్ ఇంటింటా తిష్ఠ వేసుకునుందని ఎవడైనా అంటే, వాడు ‘దేశ ద్రోహి’ అన్న ముద్ర వేస్తారు. అందుకే ఈ పరిణామాన్నే రచయిత సంపత్ సరళ్... కుంటి దయ్యం ముందు ఇంట్లోవాళ్లనే మింగిందన్న సామెతను నిజం చేసేట్టుగా చిత్రిస్తాడు. ‘ఆత్మనిర్భరత’ (స్వయం పోషకం) నినాదం అనేది ‘పరాయి పోషకమే స్వయం పోషక నినాదం’ అన్నట్టుగా కరోనా వైరస్ లాగా రూపాంతరాలు తొడుగుతోంది! ఈ దుఃస్థితి క్రమంగా ఎలా పాకి పోతోందో సంపత్ సరళ్ ఇంకా ఇలా వివరించాడు: ‘‘మా దేశాన్ని స్వావలంబిత దేశంగా మార్చిపెట్టమని విదేశస్థులకు మొర పెట్టుకునే దేశ నాయకుడు ‘లోకల్ నుండి ఓకల్’కు మారి మనకు హోంవర్క్ ఇస్తే... ఆయన భక్త సమూహంలో ఒక కుహనా జాతీయవాది ఎన్ని రూపాల్లో ఎలా సందేశాలు పంపుతాడో చూడండి: ‘తన చైనీస్ మొబైల్ నుండి / నా కొరియన్ మొబైల్‌కు ఇంగ్లండ్ రాజభాషలో / అమెరికన్ వాట్సాప్ ద్వారా నాకొక సందేశం పంపాడు – భారతదేశాన్ని స్వావలంబన దేశంగా మారుద్దామని! సరిగ్గా – ఆ సమయంలో ‘సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ చైనాలో తయారైన విగ్రహమని చాలామందికి గుర్తులేదు! ఎందు కంటే ‘విగ్రహాలు సందేశాలు చదవలేవు’ గనుక, పటేల్ విగ్రహం తయారైంది చైనాలోనే అన్నది చాలామందికి తెలియదు, తెలిసినా మర్చిపోయి ఉంటారు. అంతేగాదు, మనకు పెట్టుబడులు గుప్పించే ప్రపంచ కుబేరుల పెద్ద బిల్ గేట్స్ మరిన్ని పెట్టుబడులు గుప్పించా లంటే ‘భారతదేశానిది స్వయంపోషక ఆర్థిక విధానమే’నని చెబు తూనే ఉండటం మన చెవులకూ ఎంతో ‘ఇంపు’గానే ఉంటుందని చెబుతూ ‘మన ఆర్థిక శాఖ వారు తమ కార్యాలయం ముందు కొలంబస్ విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకుంటున్నారని శరద్ జోషీ చెప్పకనే చెప్పాడు! ఎందుకనంటే– ఒకవేళ కొలంబసే అమెరికాని కనుక్కొని ఉండకపోతే మనం అప్పెక్కడ నుంచి తెచ్చుకోగలం అన్నది శరద్ జోషీ పీకులాట. అందుకే మన ‘ఆత్మనిర్భరతా’ (స్వయంపోషక వ్యవస్థ) నినా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సమర్థించాలంటే– ముందు ‘చర్ఖావాలే (గాంధీజీ) దేశాన్ని ఏ కబంధ హస్తాల నుండి విడిపించారో చాయ్‌వాలే తిరిగి వాళ్ల చేతుల్లోనే పెడుతున్నారన్న స్వదేశీ జాగరణ్ మంచ్’ పెద్దమనిషొకడు చేసిన తీవ్రమైన ఫిర్యాదునూ, విదేశీ కంపెనీల కోసం దేశాన్ని ప్రైవేట్‌పరం చేయడంలో మునిగి తేలు తున్నారన్న అభియోగాన్నీ పాలకులు ఎలా సమర్థించుకుంటారో ఆచరణలో చూసి తీరాల్సిందే! ఎందుకంటే, ‘కుంటి దయ్యం ఇంట్లో వాళ్లనే ముందు మింగేయకముందే’ జాగ్రత్త పడటం జరూరుగా జరగాల్సిన పని గనుక! దీన్నిబట్టి, స్వయంపోషక ఆర్థిక వ్యవస్థకు ఏకైక రక్షణ... పరాయి పెట్టుబడిని పోషించుకుంటూ పోవడమేనని అర్థం చేసుకోవాలా?! -ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
హక్కులే కాదు... బాధ్యతలూ గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేవలం హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత సంఘ సేవకుడు చమన్‌లాల్ శతజయంతి సందర్భంగా భారతీయ పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అందుకే హక్కులు, బాధ్యతల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో సర్వస్వాన్ని కోల్పోయిన భారతీయ కుటుంబాలను పరామర్శిస్తూ వారికి చమన్‌లాల్ అండగా నిలిచారన్నారు. చమన్ లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని తపాలా బిళ్లను విడుదల చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ తపాలా శాఖను ఉపరాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రులు దేవ్‌సింగ్ చౌహాన్, రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో 22.60% సమయం సద్వినియోగం పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో మూడోవారం 8 బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో ఎగువ సభలో సద్వినియోగమైన సమయం(ప్రొడక్టివిటీ) 24.2 శాతానికి పెరిగింది. ఇది మొదటి వారంలో 32.20 శాతం, రెండో వారంలో కేవలం 13.70 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు రాజ్యసభ పరిశోధక విభాగం గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా మొత్తం మూడు వారాల్లో సద్వినియోగమైన సమయం 22.60 శాతంగా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూలై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెగసస్ స్పైవేర్‌తోపాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు మొదటిరోజు నుంచే ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రవేశపెడుతూనే ఉంది. గతవారం 17 పార్టీలకు చెందిన 68 మంది సభ్యులు వివిధ బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో బిల్లులపై మొత్తం 3.25 గంటలపాటు చర్చలు జరిగాయి. -
ప్రజాస్వామ్య సూచీలో భారత్ @ 51
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో భారత్ 51వ స్థానంలో నిలిచింది. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2018తో పోలిస్తే 2019లో భారత్ పది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది. 2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు మాత్రమే కేటాయించింది. దేశంలో పౌరహక్కులు హరించుకుపోతుండటంతో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉండటమే దీనికి ప్రాథమిక కారణమని వ్యాఖ్యానించింది. ఈ ర్యాంకింగ్‌లో నార్వే, ఐస్‌ల్యాండ్, స్వీడన్ మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఉత్తరకొరియా అట్టడుగున 167వ స్థానంలో ఉంది. ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు.. అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ఈఐయూ రూపొందించింది. ఈ అంశాల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు), బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ.. 8 లేదా అంతకంటే తక్కువ), మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ), నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు). ఇందులో 8 కంటే తక్కువ 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది. కాగా, ఈ సూచీలో చైనా 2.26 పాయింట్లతో 153వ ర్యాంకుతో దాదాపు అట్టడుగున ఉంది. 2019లో చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతిబంధకాలు, పౌరులపై పెరిగిన నిఘాతోపాటు జిన్జియాంగ్ ప్రావిన్సులో మైనారిటీలపై తీవ్ర వివక్ష ఇందుకు కారణాలని పేర్కొంది. ఇంకా బ్రెజిల్ 52(6.86 పాయింట్లు), రష్యా 134(3.11), పొరుగుదేశాలైన పాక్ 108(4.25), శ్రీలంక 69 (6.27), బంగ్లాదేశ్ 80(5.88)వ ర్యాంకుల్లో ఉన్నాయి. -
ప్రతినెలా 30న సివిల్ రైట్స్ డే
సాక్షి, హైదరాబాద్: ప్రతినెలా 30న జిల్లా కేంద్రాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీల ఆధ్వర్యంలోనే సివిల్ రైట్స్ డే నిర్వహించాలని పేర్కొంది. సివిల్ రైట్స్ డేని మండల, గ్రామ స్థాయిలో నిర్వహిస్తే ప్రజల సమస్యలపై యంత్రాంగానికి స్పష్టత వస్తుందని, పథకాల అమలులో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన స్వయం ఉపాధి, బ్యాంకు లింకు పథకాలపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయితీ పథకాల లబ్ధిదారులకు సకాలంలో నిధులు మంజూరు చేయాలని, కాలయాపన చేస్తే గ్రౌండింగ్ కష్టమవుతుందన్నారు. పథకాల అమలుపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
హక్కులను కాలరాస్తున్నారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారంలోకి వచ్చాక పౌర హక్కులను కాలరాస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిర్బంధంపై ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కంటే పౌరహక్కుల సంఘం అధ్యక్షునిగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పిన కేసీఆర్ అధికారంలో వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇంత నిర్బంధం అవసరం లేదన్నారు. గతంలో ఎన్టీఆర్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు నిర్బంధాన్ని విధించి ప్రజల నుంచి తిరస్కారం పొందిన వారేనని గుర్తు చేశారు. సరిహద్దులు దాటి మరీ ఎన్కౌంటర్లు గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులు దాటి మరీ ఎన్కౌంటర్లు చేస్తుందని హరగోపాల్ విమర్శించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారులపై 302 కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర నాయకుడు చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక భూమిక పోషించిందని, అలాంటి మిలియన్ మార్చ్ ఉత్సవాలను కూడా జరుపుకోకుండా నిర్బంధం విధించటం దేనికని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామిక పద్ధతిలో నడవకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పివోడబ్ల్యూ అధ్యక్షురాలు పి.సంధ్యా, సీసీఐ నేత సుధాకర్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కె.గోవర్ధన్, సీపీఎం నేత డీజీ నర్సింహారావు, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, అరుణోదయ సమాఖ్య నాయకురాలు విమలక్క తదితరులు పాల్గొన్నారు. -
జీవించే హక్కును హరిస్తున్న ప్రభుత్వాలు
- పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్ ఎస్.శేషన్న కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జీవించే హక్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్ ఎస్.శేషన్న ఆరోపించారు. ఆదివారం స్థాణఙఖ సీఆర్ భవన్లో రాజ్యాంగాన్ని గౌరవిద్దాం..ప్రజాస్వామిక హక్కులను కాపాడుకుందాం అన్న అంశంపై సదస్సును నిర్వహించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సుకు పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ శేషయ్య, హైదరాబాద్‌కు చందిన సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షుడు లతీఫ్ అహ్మద్‌ఖాన్, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకుడు అమర్నాథ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సదర్భంగా శేషయ్య మాట్లాడుతూ...ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులో రెండు రాష్ట్రాల పోలీసులు 30 మంది అమాయక గిరిజనులు, మహిళలను కాల్చి చంపారని, అయినా ఆత్మరక్షణ కోసమే ఎన్కౌంటర్ చేయాల్సి వస్తోందని చెప్పడం విరుద్ధమన్నారు. ఏఓబీ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారుల పేర్లను బయట పెట్టాలన్నారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ కావడంతోపై వారిపై ఐపీసీ 302 ప్రకారం హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లతీఫ్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ..రాజాధాని పేరిట మూడు పంటలు పండే భూములను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకోవడం దారుణమన్నారు. కమ్యూనిస్టు యోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫీడెల్ క్యాస్ట్రో, ఏపీయూడబ్ల్యూజే కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు మైకేల్‌బాబుకు ఘన నివాళి అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాస్, పౌరహక్కుల నేత శివనాగిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు. -
పోలీసులను నియంత్రించండి
పౌర హక్కుల్ని కాలరాస్తున్నారని హైకోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా, కిర్లంపూడిలో కాపునేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష సందర్భంగా పోలీసులు రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారని, వారిని నియంత్రించాలంటూ సుప్రీం కోర్టు న్యాయవాది, అఖిల భారత కాపు జాగృతి కన్వీనర్ గల్లా సతీశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శనివారం న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారించారు. దీక్ష సమయంలో ముద్రగడకు సంఘీభావం తెలి పేందుకు వెళ్లే కాపు నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారని పిటిషనర్ వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది వివరణ కోరారు. దీక్ష చేస్తున్న ముద్రగడ దంపతులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, ఇప్పుడు కిర్లంపూడిలో ఎవ్వరినీ పోలీసులు అడ్డుకోవడం లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలి
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను ఆపితేనే తెలంగాణ రాష్ట్రం శాంతి యుతంగా ఉంటుందని, లేదంటే రాష్ట్రం హింస, ప్రతిహింసల వలయంలో కొట్టుకుపోతుందని ప్రొఫెసర్ హరగోపాల్ గురువారం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఈ 18 నెలల కాలంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోయినా ఎన్కౌంటర్ల వంటి ఘటనలకు పాల్పడడం దుర్మార్గమైందన్నారు. ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌పై నిరసన తెలిపేందుకు ట్యాంక్‌బండ్‌పై నున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చిన ప్రజా సంఘాల నేతలను పోలీసులు గురువారం అక్కడికక్కడే అరెస్టు చేశారు. హరగోపాల్‌తో కలసి తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్, ప్రజా కళా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర నాయకులు నర్సన్న, పద్మ, తదితరులతో పాటు పలువురు ప్రజాసంఘాల నేతలు ఛత్తీస్‌ఘడ్ సంఘటనపై నిరసన తెలిపేందుకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో పౌరహక్కుల మహాసభలలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ వస్తే ఎన్కౌంటర్లు ఉండవని చెప్పారని గుర్తు చేశారు. పౌర హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తానన్నారనీ, కానీ ఆయన అధికారం చేపట్టగానే రాష్ట్రంలో పౌర హక్కులను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అవతరించిన ఈ 18 నెలల కాలంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి చర్యలు జరగలేదని తెలిపారు. తెలంగాణలో ఎన్కౌంటర్లు ఆపితేనే శాంతియుతంగా ఉంటుందని, లేదంటే హింస, ప్రతిహింసల నడుమ నలిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్ర పోలీసులు ఛత్తీస్‌ఘడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, అసలు ఏం జరిగిందని ఎన్కౌంటర్లు చేశారని ప్రశ్నించారు. -
‘అసహనం’పై భయం వద్దు
ప్రజలకు సీజేఐ ఠాకూర్ అభయం ♦ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నంత వరకు ఏమీ కాదు ♦ అన్ని వర్గాల ప్రజల హక్కులను కాపాడగలం న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెల్లుబుకుతోందంటూ రాజుకున్న వివాదంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసహనం వివాదాన్ని రాజకీయ అంశంగా అభివర్ణించిన ఆయన...ఇది ఆలోచనా విధానానికి సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో విలేకరులతో సీజేఐ వివిధ అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఉగ్రవాదులకూ కొన్ని హక్కులున్నాయి... ‘‘దేశంలో చట్ట పాలన కొనసాగుతున్నంత కాలం స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నంత కాలం, పౌరుల హక్కులు, బాధ్యతలను కోర్టులు కాపాడుతున్నంత కాలం ఎవరూ దేనికీ భయపడాల్సిన అవసరంలేదని భావిస్తున్నా. అన్ని వర్గాల ప్రజల హక్కులను మేము కాపాడగలం’’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు సహా పౌరులుకాని వారికీ కొన్ని హక్కులు ఉన్నాయని...చట్టప్రకారమే వారిని విచారించాల్సి ఉంటుందని, సరైన చట్ట ప్రక్రియలను పాటించకుండా ఉరిశిక్ష విధించడం కుదరదన్నారు. పౌరుల హక్కులను తాము కాపాడగలమని ఇటీవలి పరిణామాలు, అసహనం అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీజేఐ బదులిచ్చారు. అయితే ప్రత్యేకించి తాను ఏ ఘటనను ప్రస్తావించట్లేదని స్పష్టం చేశారు. జడ్జీల అవినీతిపై ఉక్కుపాదం కొందరు జడ్జీల అవినీతి, దుష్ర్పవర్తన విషయంలో న్యాయ వ్యవస్థ చూసీచూడనట్లు వ్యవహరిస్తుందనే అపోహ నెలకొందని...దీన్ని పటాపంచలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జడ్జీల అవినీతి, దుష్ర్పవర్తనను ఉపేక్షించబోమన్నారు. కొలీజియం వ్యవస్థపై మాట్లాడుతూ.. ‘వారు (బెంచ్) కొలీజియం వ్యవస్థ కొనసాగొచ్చని పేర్కొన్నారు తప్ప కొలీజియం వ్యవస్థ కొనసాగాల్సిందేనని చెప్పలేదు’ గుర్తుచేశారు. పిల్లపై అప్రమత్తత అవసరం... ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దుర్వినియోగం కాకుండా జడ్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ‘‘పిల్ అనేది కత్తిలాంటిది. వైద్యుడి చేతిలో పెడితే రోగుల ప్రాణాలు కాపాడతాడు. అదే మాంసం కొట్టే వాడి చేతిలో పెడితే...!’’ అని అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా సరి, బేసి సంఖ్య నంబర్లుగల ప్రైవేటు వాహనాలు జనవరి 1 నుంచి రోజువిడిచి రోజు రోడ్డెక్కేలా ఆప్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి సీజేఐ ఠాకూర్ మద్దతు పలికారు. రూ. 20 వేల కోట్లతో చేపడుతున్న గంగా నది ప్రక్షాళన పథకంలో తమ జోక్యం అడ్డంకి కాదన్నారు. -
పౌరహక్కుల కోసం ఉద్యమించండి
అంబేడ్కర్ మనవడు ప్రొఫెసర్ ఆనంద్‌తేల్ తుంబ్డే షాద్‌నగర్ రూరల్: పౌర హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని అంబేడ్కర్ మనవడు ప్రొఫెసర్ ఆనంద్ తేల్ తుంబ్డే పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా రాజ్యహింస, మతోన్మాదుల అరాచకాలు, దళితులు, ప్రజాస్వామిక వాదులపై జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఆదివారం జరిగిన పౌరహక్కుల సంఘం జిల్లా 12వ మహాసభలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పౌర, ప్రజాస్వామిక హక్కులకు రక్షణ ఉంటుందని, ఎన్కౌంటర్లు, నిర్బంధాలు ఉండవని ఆశించామని, టీఆర్ఎస్ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లతో విరుచుకుపడుతుందని ధ్వజమెత్తారు. పంటలు పండక, గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహాసభల్లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, సహాయకార్యదర్శి రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
హక్కులు జిందాబాద్
-
సామాన్యుడి హక్కులకు భరోసా ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: సమాజంలోని సామాన్యుల హక్కులకు ప్రభుత్వాలు భరోసా కల్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సూచించారు. మెరుగైన మానవతా విలువలకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని వివిధ కేసుల బహిరంగ విచారణ నిమిత్తం ఎన్హెచ్ఆర్సీ బుధవారం నుంచి మూడురోజుల పాటు హైదరాబాద్‌లో విడిది చేయనుంది. మొదటిరోజు విచారణ ప్రారంభం సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు సంబంధించి తమకు లెక్కకు మించి ఫిర్యాదులు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా 98 వేల పైచిలుకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫిర్యాదుల విచారణలో సంబంధిత అధికారులకు, ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసే అధికారం తమకు లేదన్నారు. అయితే, మానవ హక్కుల ఉల్లంఘనలను ఎత్తిచూపడం ద్వారా అధికారులు, ప్రభుత్వాలు తగిన దృష్టి పెట్టేలా కమిషన్ కృషి చేస్తుందని జస్టిస్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. అన్యాయాలను ఎదిరించేందుకు గొంతులేనివారికి గొంతుకగా తమ కమిషన్ పనిచేస్తుందని ఎన్హెచ్ఆర్సీ రిజిస్ట్రార్ (లా) ఏకే గార్గ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు జస్టిస్ సి.జోసెఫ్, జస్టిస్ మురుగేశన్, ఎస్.సి.సిన్హాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్య కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహిలు పాల్గొన్నారు. తొలిరోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన 61 ఫిర్యాదులను కమిషన్ సభ్యులు విచారించారు. విచారణ కమిటీలే లేవా! పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే వేధింపులను విచారించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడంపై జస్టిస్ మురుగేశన్ విస్మయం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చేసిన ఫిర్యాదును జస్టిస్ మురుగేశన్ విచారించారు. ఈ సందర్భంగా ఏ జిల్లాలోనూ సదరు కమిటీలు లేవని తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. వెంటనే అన్ని జిల్లాల్లో విచారణ కమిటీలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. మరో కేసు విచారణ సందర్భంగా దళితులపై దాడులు జరిగినప్పుడు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడమే కాకుండా.. ఈ చట్టం కింద బాధితులకు పరిహారం అందేలా చూడాలని జస్టిస్ మురుగేశన్ సూచించారు.