న్యూఢిల్లీ: ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో భారత్ 51వ స్థానంలో నిలిచింది. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2018తో పోలిస్తే 2019లో భారత్ పది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది.
2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు మాత్రమే కేటాయించింది. దేశంలో పౌరహక్కులు హరించుకుపోతుండటంతో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉండటమే దీనికి ప్రాథమిక కారణమని వ్యాఖ్యానించింది. ఈ ర్యాంకింగ్‌లో నార్వే, ఐస్‌ల్యాండ్, స్వీడన్ మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఉత్తరకొరియా అట్టడుగున 167వ స్థానంలో ఉంది. ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు.. అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ఈఐయూ రూపొందించింది.
ఈ అంశాల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు), బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ.. 8 లేదా అంతకంటే తక్కువ), మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ), నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు). ఇందులో 8 కంటే తక్కువ 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది. కాగా, ఈ సూచీలో చైనా 2.26 పాయింట్లతో 153వ ర్యాంకుతో దాదాపు అట్టడుగున ఉంది. 2019లో చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతిబంధకాలు, పౌరులపై పెరిగిన నిఘాతోపాటు జిన్‌జియాంగ్ ప్రావిన్సులో మైనారిటీలపై తీవ్ర వివక్ష ఇందుకు కారణాలని పేర్కొంది. ఇంకా బ్రెజిల్ 52(6.86 పాయింట్లు), రష్యా 134(3.11), పొరుగుదేశాలైన పాక్ 108(4.25), శ్రీలంక 69 (6.27), బంగ్లాదేశ్ 80(5.88)వ ర్యాంకుల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment