Economist Intelligence Unit
-
చవక నగరాల్లో అహ్మదాబాద్, చెన్నై
ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది. ప్రఖ్యాత ‘ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లోని పెద్ద నగరాలను ఎంపిక చేసి, సర్వే నిర్వహించి ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆయా నగరాల్లో నిత్యావసరాల నుంచి ఇంటి అద్దెల దాకా వివిధ ధరలను పరిశీలించి.. జీవించడానికి అయ్యే ఖర్చును తేల్చామని పేర్కొంది. ఇందులో సింగపూర్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరాలు అత్యధిక జీవన వ్యయంలో టాప్‌లో నిలిచాయి. నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం గణనీయంగా ఉండటంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని నగరాల్లో జీవన వ్యయం పెరుగుతోందని తెలిపింది. ఇక తక్కువ వ్యయం ఉండే నగరాల్లో ఆసియా ఖండానికి చెందినవే ఎక్కువగా ఉన్నా యని నివేదిక వెల్లడించింది. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఇవే! భారత్ నుంచి మాత్రం..
లండన్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్ అగ్రభాగంలో నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయం ఆధారంగా చేసుకొని లండన్‌కు చెందిన ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 172 నగరాల జాబితాను రూపొందించింది.ఈ నగరాల్లో గత ఏడాదితో పోల్చి చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ సగటున 8.1% పెరిగినట్టు తాను విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరం గత ఏడాది మొదటి స్థానంలో ఉంటే ఈ సారి మూడో స్థానానికి తగ్గింది. ఆసియా దేశాల్లో ఏడాదిలో జీవన వ్యయం సగటున 4.5% పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. న్యూయార్క్, సింగపూర్ మొదటి స్థానాన్ని పంచుకుంటే నాలుగో స్థానంలో హాంకాంగ్, లాస్ఏంజెలెస్ నిలిచాయి. సర్వే ఎలా చేశారంటే.! ప్రపంచవ్యాప్తంగా 172 నగరాల్లోని 200కిపైగా నిత్యావసర వస్తువుల ధరలు, 400 వరకు రవాణా, వైద్య చికిత్స వంటి సేవల ధరల్ని పోల్చి చూస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ఈ సర్వే నిర్వహించినట్టుగా ఈఐయూ సంస్థ చీఫ్ ఉపాసన దత్ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, చైనాలో జీరో కోవిడ్ విధానం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తు సామాగ్రి రవాణాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగిపోయాయని , గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని ఆమె తెలిపారు. అమెరికాలో ధరాభారం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దేశంలోని మూడు నగరాల్లో మొదటి పది స్థానాల్లో నిలిచాయని ఉపాసన వివరించారు. మన నగరాలు చౌక ఇక భారత్‌లోని నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువని ఈ సర్వేలో తేలింది. మొత్తం 172 దేశాలకు గాను మన దేశంలో బెంగుళూరు 161 స్థానంలోనూ చెన్నై 164, అహ్మదాబాద్ 165 స్థానంలోనూ నిలిచాయి. అత్యంత చౌక నగరాలుగా సిరియా రాజధాని డమాస్కస్, లిబియాలోని ట్రిపోలీ అట్టడుగున వరసగా 172, 171 స్థానాల్లో నిలిచాయి. టాప్–10 ఖరీదైన నగరాలు ఇవే 1. న్యూయార్క్ (అమెరికా) 1. సింగపూర్ 3. టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) 4. హాంకాంగ్ 4. లాస్ ఏంజెలెస్ (అమెరికా) 6. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) 7. జెనీవా ( స్విట్జర్లాండ్) 8. శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా) 9. పారిస్ (ఫ్రాన్స్) 10. కోపెన్హగెన్ (డెన్మార్క్) 10. సిడ్నీ (ఆస్ట్రేలియా) -
చలో వియన్నా
పారిస్: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది. జీవన ప్రమాణాల్లో సుస్థిరత, మౌలిక సదుపాయాలు, మంచి ఆరోగ్య వ్యవస్థ, విస్తృతమైన ఉపాధి అవకాశాలు, వినోదం–విజ్ఞానం–సంస్కృతి తదితర ప్రామాణికాల ఆధారంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈయూఐ) ఏటా ఈ ర్యాంకులిస్తుంది. గతేడాది టాప్‌లో ఉన్న అక్లండ్ (న్యూజిలాండ్)ను తోసిరాజని వియన్నా తొలి స్థానంలోకి వచ్చినట్టు ఎకనామిస్ట్ పత్రిక ప్రచురించింద కరోనా దెబ్బకు ఆక్లండ్ 34వ స్థానానికి పడిపోయింది. వియన్నా 2018, 2019 ల్లో నూ తొలి స్థా నంలో నిలిచింది. కరో నా వచ్చిన కొత్తల్లో రెస్టారెంట్లు, మ్యూజియంలు తదితరాలన్నీ మూతబడటంతో 2020లో 12వ స్థానానికి పడిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ రెండో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, కెనడాలోని కేల్గరీ నగరాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. పారిస్ 19 స్థానంలో, లండన్ 33, మిలన్ (ఇటలీ) 49, న్యూయార్క్ 51వ స్థానంలో నిలిచాయి. టాప్ 10 నగరాలు 1. వియన్నా (ఆస్ట్రియా) 2. కోపెన్హగెన్ (డెన్మార్క్) 3. జ్యురిచ్ (స్విట్జర్లాండ్) 4. కాల్గరీ (కెనడా) 5. వాంకోవర్ (కెనడా) 6. జెనీవా (స్విట్జర్లాండ్) 7. ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) 8. టొరంటో (కెనడా) 9. ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) 10. ఒసాకా (జపాన్) మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) -
ఎకానమీకి వైరస్!!
న్యూఢిల్లీ: చైనాలో బైటపడిన కోవిడ్–19(కరోనా) వైరస్ ధాటికి ఈ ఏడాది ప్రపంచ ఎకానమీ వృద్ధి కుంటుపడనుంది. 2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో వెల్లడించింది. ‘ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్ ముప్పుగా పరిణమించింది. ఇది మరింతగా ప్రబలకుండా నివారించేందుకు చైనా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రిస్కులు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వృద్ధి అంచనాలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది‘ అని ఈఐయూ పేర్కొంది. వాణిజ్య యుద్ధ భయాల మూలంగా 2019లో ప్రపంచ వృద్ధి మందగించిన సంగతి తెలిసిందే. యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితి, అమెరికా.. చైనాలతో పాటు భారత్‌లోనూ స్థూల దేశీయోత్పత్తి మందగించింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గి, కొత్త ఏడాదిలో పరిస్థితులు చక్కబడవచ్చని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా కరోనా వైరస్ తెరపైకి రావడం గమనార్హం. చైనా హుబెయ్ ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో బైటపడిన ఈ వైరస్ ఆ దేశంతో పాటు ఇతరత్రా పలు దేశాలకు కూడా విస్తరించడం ప్రస్తుతం అందర్నీ కలవరపెడుతోంది. వైరస్ ప్రతికూల ప్రభావాల కారణంగా చైనా వృద్ధి రేటు అంచనాలను కూడా ఈఐయూ తగ్గించింది. ‘మార్చి ఆఖరు నాటికల్లా వైరస్ వ్యాప్తి.. అదుపులోకి రాగలదని భావిస్తున్నాం. దీనికి అనుగుణంగా 2020లో చైనా వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలను ముందుగా పేర్కొన్న 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నాం‘ అని ఈఐయూ తెలిపింది. భారత్‌పై బుల్లిష్..: ప్రపంచ ఎకానమీ, చైనా విషయంలో నిరుత్సాహపర్చే అంచనాలు ప్రకటించిన ఈఐయూ.. భారత్‌పై మాత్రం బులిష్ ధోరణి కనపర్చింది. కరోనా వైరస్ తాకిడి భారత్‌లో గణనీయంగా విస్తరించని పక్షంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు చాలా మెరుగ్గా ఉండగలదని పేర్కొంది. -
ప్రజాస్వామ్య సూచీలో భారత్ @ 51
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో భారత్ 51వ స్థానంలో నిలిచింది. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2018తో పోలిస్తే 2019లో భారత్ పది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది. 2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు మాత్రమే కేటాయించింది. దేశంలో పౌరహక్కులు హరించుకుపోతుండటంతో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉండటమే దీనికి ప్రాథమిక కారణమని వ్యాఖ్యానించింది. ఈ ర్యాంకింగ్‌లో నార్వే, ఐస్‌ల్యాండ్, స్వీడన్ మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఉత్తరకొరియా అట్టడుగున 167వ స్థానంలో ఉంది. ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు.. అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ఈఐయూ రూపొందించింది. ఈ అంశాల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు), బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ.. 8 లేదా అంతకంటే తక్కువ), మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ), నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు). ఇందులో 8 కంటే తక్కువ 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది. కాగా, ఈ సూచీలో చైనా 2.26 పాయింట్లతో 153వ ర్యాంకుతో దాదాపు అట్టడుగున ఉంది. 2019లో చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతిబంధకాలు, పౌరులపై పెరిగిన నిఘాతోపాటు జిన్జియాంగ్ ప్రావిన్సులో మైనారిటీలపై తీవ్ర వివక్ష ఇందుకు కారణాలని పేర్కొంది. ఇంకా బ్రెజిల్ 52(6.86 పాయింట్లు), రష్యా 134(3.11), పొరుగుదేశాలైన పాక్ 108(4.25), శ్రీలంక 69 (6.27), బంగ్లాదేశ్ 80(5.88)వ ర్యాంకుల్లో ఉన్నాయి. -
భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం
న్యూఢిల్లీ: భారత్ యువతలో ఆర్థిక అభద్రతాభావం నెలకొందనీ, దేశ రాజకీయాలపై దీని ప్రభావం పెరుగుతోందని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. దేశాభివృద్ధిలో మందగమన ధోరణులు, నిరుద్యోగ సమస్యలను నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్ నిరుద్యోగ సమస్య దేశ రాజకీయాలతో విడదీయరాని అంశంగా రూపొందుతోందని నివేదిక పేర్కొంది, ఆర్థిక వృద్ధి మందగమనం నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేసిందని వివరించింది. ‘‘పటిష్ట నాయకత్వం, సామాజిక, భద్రతా అంశాల ప్రాతిపదికన ఈ ఏడాది రెండవసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ విజయం సాధించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ఉన్న యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు రూపునిస్తున్న పరిస్థితి పెరుగుతోంది’’ అని ఈఐయూ పేర్కొంది. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటాను ఈఐయూ నివేదిక ప్రస్తావిస్తూ, ‘‘2019 సెప్టెంబర్‌లో 7.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మరుసటి నెల అక్టోబర్‌లోనే మూడేళ్ల గరిష్ట స్థాయి 8.5%కి పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న యువతను చక్కటి మానవ వనరుగా వినియోగించుకుంటూ, రానున్న కొద్ది దశాబ్దాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందాలని దేశం భావిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో మాత్రం వెనుకబడుతున్నట్లు విశ్లేషించింది. -
ఉత్తమ ‘జీవన’ నగరం.. వియన్నా
న్యూఢిల్లీ: ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాలో ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారి 118వ స్థానంలో నిలచింది. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన వియన్నా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అత్యుత్తమ నగరాన్ని ఎంపిక చేసేందుకు ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను బుధవారం వెల్లడించింది. నేరాలు పెరగడం, ప్రాణవాయువు నాణ్యత తగ్గడం వంటి కారణాల రీత్యా ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారింది. సాంస్కృతిక విభాగంలో తక్కువ పాయింట్లు రావడంతో ముంబై రెండు స్థానాలు దిగజారి 119వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవించదగ్గ ఉత్తమ నగరంగా ఎంపికై మొదటి స్థానంలో నిలిచింది. కెనాడాలోని సిడ్నీ, జపాన్‌లోని ఒసాకాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ వియన్నా.. లాస్ట్ డమాస్కస్ నివాసానికి ఆమోదయోగ్య నగరాల జాబితాలో 99.1 పాయింట్లతో వియన్నా తొలిస్థానంలో నిలిచింది. ఇందులో న్యూఢిల్లీకి 56.3 పాయింట్లు రాగా, ముంబైకి 56.2 పాయింట్లు వచ్చాయి. చివరి స్థానంలో నిలిచిన సిరియాలోని డమాస్కస్ పట్టణానికి 30.7 పాయింట్లు లభించాయి. పాకిస్తాన్‌లోని కరాచీ 136వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 138వ స్థానంలో నిలిచింది. చైనా రాజధాని బీజింగ్ 76వ స్థానంలో నిలవగా, లండన్ 48, న్యూయార్క్ 58వ స్థానాల్లో నిలిచాయి. మీడియా స్వేచ్ఛ విషయంలో కూడా భారత్ మరింత దిగజారిందని నివేదిక తెలిపింది. -
సేఫ్‌లో టోక్యో టాప్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని సురక్షితమైన నగరాలు–2019 జాబితాలో ఆసియా–పసిఫిక్ ప్రాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాప్–10లో ఆరు ర్యాంకులను ఈ ప్రాంతంలోని నగరాలే చేజిక్కించుకున్నాయి. జపాన్ రాజధాని టోక్యో తన మొదటి స్థానాన్ని మూడోసారీ పదిలం చేసుకోగా.. సింగపూర్, ఒసాకాలు సైతం తమ పూర్వపు ర్యాంకులను దక్కించుకున్నాయి. అయితే ఈసారి అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ.. తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చింది. 2017లో 23 స్థానంతో సరిపెట్టుకున్న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఈసారి 7వ ర్యాంకును సాధించుకుంది. ముంబై 45వ స్థానంలో.. ఢిల్లీ 52వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితా–2019కి సంబంధించిన నివేదికను ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాలకు చెందిన నగరాల్లోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని టాప్–60 సిటీలతో ఈ నివేదికను ప్రచురించింది. దీనిలో భాగంగా ఆయా నగరాల్లోని సైబర్ భద్రత, వైద్య సదుపాయాలు, వ్యక్తిగత భద్రత, మౌలిక వసతులు వంటి అంశాల మేరకు ర్యాంకులను ప్రకటించింది. దీని ప్రకారం.. నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికిపోతున్న హంకాంగ్ 2017లోని తన 9వ ర్యాంకుని కోల్పోయి.. 20వ స్థానానికి పడిపోయింది. ఇక ఆసియా–పసిఫిక్ ప్రాంతం డిజిటల్ సెక్యూరిటీలో చాలా మెరుగవ్వాల్సి ఉందని చెప్పారు. ఆసియా నుంచి ఢాకా(బంగ్లాదేశ్), కరాచీ(పాకిస్తాన్), యంగూన్(మయన్మార్)లు వరుసగా 56, 57, 58 ర్యాంకుల్లో ఉన్నాయి. -
భారత్@42
న్యూఢిల్లీ: పెచ్చుమీరుతున్న హిందూ అతివాదం, మైనా రిటీలపై దాడుల నేపథ్యంలో ప్రజాస్వామ్య సూచీలో భారత్ స్థానం మరింత పడిపోయింది. 2016లో భారత్‌కు 32వ స్థానం దక్కగా 2017లో 42వ స్థానానికి దిగజారి ‘దోషపూరిత ప్రజాస్వామ్య’ దేశాల జాబితాలోనే కొనసా గుతోంది. కాగా, ఈ లిస్ట్‌లో అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ, చైనాకు 139వ స్థానం దక్కాయి. మొత్తం పది మార్కులకు గాను భారత్ 7.23 పాయింట్లు స్కోరు చేయగలిగింది. నార్వేకు అగ్రస్థానం (9.87 పాయింట్లు) దక్కగా ఐస్లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి. 165 దేశాలు, రెండు ప్రత్యేక ప్రాంతాలతో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) జాబితా రూపొందించింది. మొదటి 19 స్థానాల్లో నిలిచిన దేశాల్లోనే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఎకనమిస్ట్ గ్రూప్’లోని పరిశోధన, విశ్లేషణ విభాగమే ఈఐయూ. ఇది 1946 నుంచి ఏటా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంపై సూచీలను విడుదల చేస్తోంది. ఆయా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వం పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సంస్కృతి, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. సంపూర్ణ ప్రజాస్వామ్యం, దోషపూరిత ప్రజాస్వామ్యం, మిశ్రమ పాలన, నిరంకుశ పాలన ఉన్న దేశాలుగా విభజిస్తుంది. భారత్‌లో దోషపూరిత ప్రజాస్వామ్యం! దేశంలో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం అంశాల్లో మొత్తమ్మీద పది పాయింట్లకు గాను 9.17 దక్కగా పౌరస్వేచ్ఛ, రాజకీయ సంస్కృతి, ప్రభుత్వ పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం అంశాల్లో వెనుకబడినట్లు ఈఐయూ పేర్కొంది. లౌకిక దేశంలో అతివాద హిందూ ధోరణులు, మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలపై హింస పెరగటమే భారత్ స్థానం పడిపోవటానికి కారణమంది. భారత్‌లో మీడియా స్వేచ్ఛ కూడా పాక్షికంగానే ఉందని, ఛత్తీస్‌గఢ్, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో పాత్రికేయులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపింది. అట్టడుగున ఉత్తరకొరియా: దోషపూరిత ప్రజాస్వా మ్య దేశాల్లో.. భారత్‌తోపాటు అమెరికా(21), జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సింగపూర్, హాంగ్‌కాంగ్ కూడా ఉన్నాయి. మిశ్రమపాలన ఉన్న పొరుగుదేశాలు.. బంగ్లాదేశ్ 92, నేపాల్ 94, భూటాన్ 99, పాకిస్తాన్ 110వ స్థానాల్లో ఉన్నాయి. నిరంకుశపాలిత దేశాల జాబితాలో మయన్మార్ 120, రష్యా 135, చైనా 139, వియత్నాం 140, సిరియా 166వ స్థానంలో ఉండగా, ఉత్తర కొరియాకు అట్టడుగు 167 స్థానం దక్కింది. ప్రపంచ జనాభాలో కేవలం 4.5% మంది సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలన కింద జీవిస్తున్నారు. దాదాపు సగం (49.3%) మందికి ఏదో ఒకరకమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నట్లు ఈఐయూ గుర్తించింది. -
టాప్–10 చవక నగరాల్లో 4 మనవే
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే నివాసయోగ్యమైన అత్యంత చవకైన నగరాల జాబితాలో భారత్ నుంచి నాలుగింటికి చోటు దక్కింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రపంచవ్యాప్తంగా చేసిన ఈ చవక నగరాల సర్వేలో బెంగళూరుకు 3వ స్థానం, చెన్నైకి 6, ముంబైకి 7, ఢిల్లీకి 10వ స్థానాలు దక్కాయి. కజకిస్తాన్‌లోని అల్మటీ నగరం ఈ జాబితాలో మొదటి స్థానం సాధించి ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో నైజీరియాలోని లాగోస్ (2వ స్థానం), పాకిస్తాన్‌లోని కరాచీ (4), అల్జీరియా రాజధాని అల్జీర్స్ (5), ఉక్రెయిన్ రాజధాని కీవ్ (8), రుమేనియా రాజధాని బుకారెస్ట్ (9) ఉన్నాయి. అలాగే అత్యంత ఖరీదైన తొలి పది నగరాలుగా వరుసగా సింగపూర్, హాంకాంగ్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్, జపాన్ రాజధాని టోక్యో, జపాన్‌కే చెందిన ఒసాక, దక్షిణ కొరియా రాజధాని సియోల్, స్విట్జర్లాండ్‌లోని జెనీవా, ఫ్రాన్స్ రాజధాని పారిస్, అమెరికా నగరం న్యూయార్క్, డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లు నిలిచాయి. ‘సాధారణంగా భారత ఉపఖండంలో నివసించడం తక్కువ ఖర్చుతో కూడినదేనైనా, అస్థిరత్వం దానిని మరింత చవకగా మారుస్తోంది’అని నివేదిక పేర్కొంది. చవక నగరాల్లో నివసించడంలో కొంత ప్రమాదం కూడా దాగి ఉందంది. -
టాప్ సురక్షిత నగరాలు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా నానాటికీ నగర జనభా విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. పల్లెలు, చిన్నతరహా పట్టణాలనుంచి నగరాలకు వలసలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. జనాభా పెరుగుదలతో నగరాల్లో ఇబ్బందులకు తోడూ రక్షణ కూడా కరువవుతోంది. వ్యాపారం చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, పర్యటనలకు, ఉద్యోగరీత్యా స్థిరపడటానికి అనువైన నగరాల కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. రక్షణ విషయంలో నగరవాసులకు మెరుగైన వసతులను కల్పిస్తున్న టాప్ జాబితాను ఎకానమిస్ట్ ఇంటెలీజెన్స్ యూనిట్(ఈఐయూ) విడుదల చేసింది. 40 సూచీలను ప్రామాణికంగా తీసుకొని టాప్ 15 సురక్షిత నగరాల జాబితాను ఈఐయూ వెల్లడించింది. టాప్ నగరాల జాబితాను రూపొందించడానికి ముఖ్యంగా నాలుగు అంశాలను ప్రాతిపదికన తీసుకొని మార్కులు ఇచ్చారు. డిజిటల్ సెక్యూరిటీ, ఆరోగ్య భద్రత, మౌలిక భద్రత, వ్యక్తిగత భద్రతలు వంటి నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 50 నగరాల్లో సర్వే చేసి 15 ఉత్తమ నగరాల జాబితాను విడుదల చేయగా, వీటిలో ఆసియాకే చెందిన మూడు నగరాలు టాప్‌లో నిలవడం విశేషం. టాప్ 15 సురక్షిత నగరాలు.. అవరోహణ క్రమంలో... 15) బార్సిలోనా(75): సబ్ వేలు, వీధుల్లో పోలీసుల గస్తీ ఎక్కువగా ఉండాలని మూడేళ్ల కిందట బార్సిలోనా నగర కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో క్రైం శాతం 32 శాతం దిగొచ్చింది. 14) మాంట్రియల్ (75): ఈఐయూ తెలిపిన వివరాల ప్రకారం...కెనడాలోని మాంట్రియల్ నగరం ప్రపంచంలోనే బిజినెస్ ఎన్విరాన్మెంట్లో నాలుగో స్థానం, ఆహార భద్రతలో 8వ ర్యాంకు పొందింది. దీంతో మాంట్రియల్ నగరానికి సురక్షిత మైన నగరాల జాబితాలో చోటు దక్కింది. 13) తైపీ(76.51): సురక్షిత నగరాల జాబితాలో13వ స్థానంలో ఉన్నా, వ్యక్తిగత భద్రత అంశంలో మాత్రం తైపీ 4వ స్థానంలో నిలిచింది. 12) శాన్ఫ్రాన్సిస్కో(76.63): వలసల నియంత్రణను అరికడుతూ వాతావరణ మార్పులను పరిశీలిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో జనసాంద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించేలా నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 2014లో ఛీఫ్ రెసిలెన్స్ అధికారిని నియమించారు. 11) హాంక్‌కాంగ్(77.24): సైబర్ సేఫ్టీలో ప్రపంచంలోనే టాప్ ఐదు స్థానాల్లో హాంకాంగ్‌కు చోటు దక్కింది. ఇది అన్ని అంశాల్లో టాప్ జాబితాలో హాంకాంగ్‌కు చోటుదక్కడానికి ముఖ్యకారణంగా నిలిచింది. 10) న్యూయార్క్(78.06): ఆరోగ్య రక్షణ విషయంలో అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ రెండో స్థానంలో నిలిచింది. వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన కార్యచరణతో రోగాలు ప్రబలకుండా చర్యలుకుంటూ మిగతా నగరాలకు ఆదర్శంగా నిలిచింది 9) మెల్బోర్న్(78.67): మౌలిక భద్రత విషయంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ రోడ్డు, రైలు ప్రమాదాలు అరికట్టడంలో ముందుంటోంది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం. 8) టోరొంటో(78.81): కాస్ట్ ఆఫ్ లివింగ్, బిజినెస్ ఎన్విరాన్ మెంట్ అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే నివాసించడానికి అత్యుత్తమ నగరాలో జాబితాలో టాప్‌లో నిలుస్తోంది. 7) జ్యురిచ్(78.81): మౌలిక భద్రత, ఆరోగ్య రక్షణ అంశాల్లో అత్యుత్తమ పద్దతులతో మేటినగరంగా దూసుకుపోతోంది ఈ స్విస్ నగరం. ఈ రెండు అంశాల్లో ముందంజలో ఉన్న జ్యరిచ్ అన్ని అంశాలను పరిగణలోకి తీసకుంటే ఏడో స్థానంలో నిలిచింది. 6) సిడ్నీ(78.91): మౌలిక రక్షణలో టాప్ స్థానంలో నిలిచి పటిష్టమైన రవాణా వ్యవస్థలో ప్రపంచంలోనే మూడో స్థానంలోనిలిచింది సిడ్నీ నగరం. ఆస్ట్రేలియాకే చెందిన మరో నగరం మెల్బోర్న్ కన్నా టాప్‌లో నిలిచింది. 5) ఆమ్‌స్టర్‌డ్యాం(79.19): తక్కువ జనాభా ఉండి, చిన్న నగరంగా ఉన్నా అత్యుత్తమ రక్షణ చర్యలతో టాప్ నగరాల జాబితాలో ఐదో స్థానంలో చోటు సాంపాదించింది. 4) స్టాక్ హోమ్(80.02): సైబర్ సేఫ్టీలో యూరోపియన్‌కు చెందిన నగరాల్లో టాప్ జాబితాలో చోటు దక్కిన ఏకైక నగరంగా స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ నిలిచింది. 3) ఒసాకా(82.36): వ్యక్తిగత భద్రత విషయంలో జపాన్‌కు చెందిన ఒసాకా నగరం రెండో స్థానంలో, సైబర్ సేఫ్టీ విషయంలో మాత్రం ఐదో స్తానంలో నిలిచింది. 2) సింగపూర్(84.61): వ్యక్తిగత భద్రత, బిజినెస్ ఎన్విరాన్మెంట్లో టాప్‌లో నిలిచిన సింగపూర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే అగ్రస్థానాన్ని మాత్రం తృటిలో చేజార్చుకుంది. 1) టోక్యో(85.63): ప్రపంచంలోనే అత్యధిక జనాభా నగరంగా ఉన్న టోక్యో ఈఐయూ జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. లివింగ్ కాస్ట్ మరీ అంత చౌక కాకపోయినా రక్షణ విషయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలు టాప్ జాబితాలో చోటు దక్కేలా చేశాయి. -
అతిపెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఆసియా: సర్వే
బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ మార్కెట్‌గా ఈ ఏడాది ఆసియా అవతరిస్తుందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) సర్వేలో వెల్లడైంది. ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఉత్తర అమెరికాను తోసిరాజని ఆసియా ప్రాంతం మొదటి స్థానంలోకి దూసుకువస్తుందని ఈఐయూ సర్వే పేర్కొంది. ఎకనామిస్ట్ మ్యాగజైన్ గ్రూప్ అడ్వైజరీ కంపెనీగా వ్యవహరిస్తున్న ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, మకావూ, భారత్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల్లో మొత్తం 5,500 మంది మహిళలపై ఈఐయూ ఈ సర్వేను నిర్వహించింది. వివరాలు... - ఈ కామర్స్‌లో రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది ఆసియాలో 5 శాతం వృద్ధితో 7.6 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతాయి. ఇది ఉత్తర అమెరికాలో 2.5 శాతం, యూరప్‌లో 0.8 శాతం చొప్పున వృద్ధి ఉండొచ్చు. - ఆసియా మహిళలకు స్వేచ్ఛ, ఆర్థిక శక్తి పెరగడం, ఆన్లైన్ షాపింగ్‌పై మక్కువ పెరుగుతుండడం వంటి కారణాల వల్ల అసియాలో ఈ కామర్స్ హవా పెరుగుతోంది. - షాప్‌కు వెళ్లడం కంటే ఆన్లైన్లోనే షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని సగానికి పైగా మహిళలు చెప్పారు. - వస్తువులు, సేవలకోసం రోజులో ఒక్కసారైనా నెట్‌ను వాడతామని 63% మంది చెప్పారు. -
అత్యంత చౌక నగరం ముంబై
లండన్: జీవించడానికి ప్రపంచంలో అత్యంత చౌకైన నగరంగా ముంబై నిలిచింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) నిర్వహించిన ఈ ఏడాది అంతర్జాతీయ జీవన ప్రమాణ సర్వే ప్రకారం మరో భారత నగరం ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఆహారం, పానీయాలు, బట్టలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, ఇళ్ల అద్దెలు, రవాణా, వినోద వ్యయాలు వంటి వివిధ రకాల వస్తువులు, ఉత్పుత్తులు, సేవల ధరలను పరిగణనలోకి తీసుకొని ఈఐయూ ఈ సర్వే నిర్వహిస్తుంది. వివరాలు.. అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచింది. గత ఏడాది ఈ స్థానాన్ని సాధించిన టోక్యోను తోసిరాజని సింగపూర్ మొదటి స్థానంలోకి దూసుకువచ్చింది. ఇక టోక్యో ఈ ఏడాది జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్ తర్వాతి స్థానాల్లో ప్యారిస్, ఓస్లో, జురిక్, సిడ్నిలు నిలిచాయి. లండన్ నగరం 15వ స్థానంలో నిలవగా, 49వ స్థానంలో మాంచెస్టర్ ఉంది. అత్యంత ఖరీదైన నగరాలు యూరప్, ఆసియా ఖండాల్లో పెరుగుతున్నాయి. మరో వైపు ఆసియా ఖండంలో భారత ఉపఖండంలో అత్యంత చౌక నగరాలు అధికంగా ఉన్నాయి. భారత్‌లో ధనికులు, పేదల మధ్య ఆర్థిక అసమానతలు అధికంగా ఉండడం, వేతనాలు, ధరలు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల చౌక నగరాలు మన దేశంలో అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే అధిక సబ్సిడీలు ధరలు తక్కువగా ఉండటానికి మరో కారణం.