టాప్–10 చవక నగరాల్లో 4 మనవే
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే నివాసయోగ్యమైన అత్యంత చవకైన నగరాల జాబితాలో భారత్ నుంచి నాలుగింటికి చోటు దక్కింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రపంచవ్యాప్తంగా చేసిన ఈ చవక నగరాల సర్వేలో బెంగళూరుకు 3వ స్థానం, చెన్నైకి 6, ముంబైకి 7, ఢిల్లీకి 10వ స్థానాలు దక్కాయి. కజకిస్తాన్‌లోని అల్మటీ నగరం ఈ జాబితాలో మొదటి స్థానం సాధించి ప్రపంచంలోనే అత్యంత చవకైన నగరంగా నిలిచింది.
తర్వాతి స్థానాల్లో నైజీరియాలోని లాగోస్ (2వ స్థానం), పాకిస్తాన్‌లోని కరాచీ (4), అల్జీరియా రాజధాని అల్జీర్స్ (5), ఉక్రెయిన్ రాజధాని కీవ్ (8), రుమేనియా రాజధాని బుకారెస్ట్ (9) ఉన్నాయి. అలాగే అత్యంత ఖరీదైన తొలి పది నగరాలుగా వరుసగా సింగపూర్, హాంకాంగ్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్, జపాన్ రాజధాని టోక్యో, జపాన్‌కే చెందిన ఒసాక, దక్షిణ కొరియా రాజధాని సియోల్, స్విట్జర్లాండ్‌లోని జెనీవా, ఫ్రాన్స్ రాజధాని పారిస్, అమెరికా నగరం న్యూయార్క్, డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లు నిలిచాయి. ‘సాధారణంగా భారత ఉపఖండంలో నివసించడం తక్కువ ఖర్చుతో కూడినదేనైనా, అస్థిరత్వం దానిని మరింత చవకగా మారుస్తోంది’అని నివేదిక పేర్కొంది. చవక నగరాల్లో నివసించడంలో కొంత ప్రమాదం కూడా దాగి ఉందంది.