ప్రపంచ వ్యాప్తంగా నానాటికీ నగర జనభా విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. పల్లెలు, చిన్నతరహా పట్టణాలనుంచి నగరాలకు వలసలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. జనాభా పెరుగుదలతో నగరాల్లో ఇబ్బందులకు తోడూ రక్షణ కూడా కరువవుతోంది. వ్యాపారం చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, పర్యటనలకు, ఉద్యోగరీత్యా స్థిరపడటానికి అనువైన నగరాల కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. రక్షణ విషయంలో నగరవాసులకు మెరుగైన వసతులను కల్పిస్తున్న టాప్ జాబితాను ఎకానమిస్ట్ ఇంటెలీజెన్స్ యూనిట్(ఈఐయూ) విడుదల చేసింది.
40 సూచీలను ప్రామాణికంగా తీసుకొని టాప్ 15 సురక్షిత నగరాల జాబితాను ఈఐయూ వెల్లడించింది. టాప్ నగరాల జాబితాను రూపొందించడానికి ముఖ్యంగా నాలుగు అంశాలను ప్రాతిపదికన తీసుకొని మార్కులు ఇచ్చారు. డిజిటల్ సెక్యూరిటీ, ఆరోగ్య భద్రత, మౌలిక భద్రత, వ్యక్తిగత భద్రతలు వంటి నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 50 నగరాల్లో సర్వే చేసి 15 ఉత్తమ నగరాల జాబితాను విడుదల చేయగా, వీటిలో ఆసియాకే చెందిన మూడు నగరాలు టాప్లో నిలవడం విశేషం.
టాప్ 15 సురక్షిత నగరాలు.. అవరోహణ క్రమంలో...
15) బార్సిలోనా(75): సబ్ వేలు, వీధుల్లో పోలీసుల గస్తీ ఎక్కువగా ఉండాలని మూడేళ్ల కిందట బార్సిలోనా నగర కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో క్రైం శాతం 32 శాతం దిగొచ్చింది.
14) మాంట్రియల్ (75): ఈఐయూ తెలిపిన వివరాల ప్రకారం...కెనడాలోని మాంట్రియల్ నగరం ప్రపంచంలోనే బిజినెస్ ఎన్విరాన్మెంట్లో నాలుగో స్థానం, ఆహార భద్రతలో 8వ ర్యాంకు పొందింది. దీంతో మాంట్రియల్ నగరానికి సురక్షిత మైన నగరాల జాబితాలో చోటు దక్కింది.
13) తైపీ(76.51): సురక్షిత నగరాల జాబితాలో13వ స్థానంలో ఉన్నా, వ్యక్తిగత భద్రత అంశంలో మాత్రం తైపీ 4వ స్థానంలో నిలిచింది.
12) శాన్ఫ్రాన్సిస్కో(76.63): వలసల నియంత్రణను అరికడుతూ వాతావరణ మార్పులను పరిశీలిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో జనసాంద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించేలా నగర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 2014లో ఛీఫ్ రెసిలెన్స్ అధికారిని నియమించారు.
11) హాంక్కాంగ్(77.24): సైబర్ సేఫ్టీలో ప్రపంచంలోనే టాప్ ఐదు స్థానాల్లో హాంకాంగ్కు చోటు దక్కింది. ఇది అన్ని అంశాల్లో టాప్ జాబితాలో హాంకాంగ్కు చోటుదక్కడానికి ముఖ్యకారణంగా నిలిచింది.
10) న్యూయార్క్(78.06): ఆరోగ్య రక్షణ విషయంలో అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ రెండో స్థానంలో నిలిచింది. వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన కార్యచరణతో రోగాలు ప్రబలకుండా చర్యలుకుంటూ మిగతా నగరాలకు ఆదర్శంగా నిలిచింది
9) మెల్బోర్న్(78.67): మౌలిక భద్రత విషయంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ రోడ్డు, రైలు ప్రమాదాలు అరికట్టడంలో ముందుంటోంది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం.
8) టోరొంటో(78.81): కాస్ట్ ఆఫ్ లివింగ్, బిజినెస్ ఎన్విరాన్ మెంట్ అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే నివాసించడానికి అత్యుత్తమ నగరాలో జాబితాలో టాప్లో నిలుస్తోంది.
7) జ్యురిచ్(78.81): మౌలిక భద్రత, ఆరోగ్య రక్షణ అంశాల్లో అత్యుత్తమ పద్దతులతో మేటినగరంగా దూసుకుపోతోంది ఈ స్విస్ నగరం. ఈ రెండు అంశాల్లో ముందంజలో ఉన్న జ్యరిచ్ అన్ని అంశాలను పరిగణలోకి తీసకుంటే ఏడో స్థానంలో నిలిచింది.
6) సిడ్నీ(78.91): మౌలిక రక్షణలో టాప్ స్థానంలో నిలిచి పటిష్టమైన రవాణా వ్యవస్థలో ప్రపంచంలోనే మూడో స్థానంలోనిలిచింది సిడ్నీ నగరం. ఆస్ట్రేలియాకే చెందిన మరో నగరం మెల్బోర్న్ కన్నా టాప్లో నిలిచింది.
5) ఆమ్స్టర్డ్యాం(79.19): తక్కువ జనాభా ఉండి, చిన్న నగరంగా ఉన్నా అత్యుత్తమ రక్షణ చర్యలతో టాప్ నగరాల జాబితాలో ఐదో స్థానంలో చోటు సాంపాదించింది.
4) స్టాక్ హోమ్(80.02): సైబర్ సేఫ్టీలో యూరోపియన్కు చెందిన నగరాల్లో టాప్ జాబితాలో చోటు దక్కిన ఏకైక నగరంగా స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ నిలిచింది.
3) ఒసాకా(82.36): వ్యక్తిగత భద్రత విషయంలో జపాన్కు చెందిన ఒసాకా నగరం రెండో స్థానంలో, సైబర్ సేఫ్టీ విషయంలో మాత్రం ఐదో స్తానంలో నిలిచింది.
2) సింగపూర్(84.61): వ్యక్తిగత భద్రత, బిజినెస్ ఎన్విరాన్మెంట్లో టాప్లో నిలిచిన సింగపూర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే అగ్రస్థానాన్ని మాత్రం తృటిలో చేజార్చుకుంది.
1) టోక్యో(85.63): ప్రపంచంలోనే అత్యధిక జనాభా నగరంగా ఉన్న టోక్యో ఈఐయూ జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. లివింగ్ కాస్ట్ మరీ అంత చౌక కాకపోయినా రక్షణ విషయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలు టాప్ జాబితాలో చోటు దక్కేలా చేశాయి.