
ఢిల్లీ, ముంబై
న్యూఢిల్లీ: ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాలో ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారి 118వ స్థానంలో నిలచింది. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన వియన్నా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అత్యుత్తమ నగరాన్ని ఎంపిక చేసేందుకు ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను బుధవారం వెల్లడించింది. నేరాలు పెరగడం, ప్రాణవాయువు నాణ్యత తగ్గడం వంటి కారణాల రీత్యా ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారింది. సాంస్కృతిక విభాగంలో తక్కువ పాయింట్లు రావడంతో ముంబై రెండు స్థానాలు దిగజారి 119వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవించదగ్గ ఉత్తమ నగరంగా ఎంపికై మొదటి స్థానంలో నిలిచింది. కెనాడాలోని సిడ్నీ, జపాన్‌లోని ఒసాకాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఫస్ట్ వియన్నా.. లాస్ట్ డమాస్కస్
నివాసానికి ఆమోదయోగ్య నగరాల జాబితాలో 99.1 పాయింట్లతో వియన్నా తొలిస్థానంలో నిలిచింది. ఇందులో న్యూఢిల్లీకి 56.3 పాయింట్లు రాగా, ముంబైకి 56.2 పాయింట్లు వచ్చాయి. చివరి స్థానంలో నిలిచిన సిరియాలోని డమాస్కస్ పట్టణానికి 30.7 పాయింట్లు లభించాయి. పాకిస్తాన్‌లోని కరాచీ 136వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 138వ స్థానంలో నిలిచింది. చైనా రాజధాని బీజింగ్ 76వ స్థానంలో నిలవగా, లండన్ 48, న్యూయార్క్ 58వ స్థానాల్లో నిలిచాయి. మీడియా స్వేచ్ఛ విషయంలో కూడా భారత్ మరింత దిగజారిందని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment