భారత్‌@42 | India slips to 42nd place on EIU Democracy Index; US at 21 | Sakshi
Sakshi News home page

భారత్‌@42

Published Thu, Feb 1 2018 2:36 AM | Last Updated on Thu, Feb 1 2018 4:38 AM

India slips to 42nd place on EIU Democracy Index; US at 21 - Sakshi

న్యూఢిల్లీ: పెచ్చుమీరుతున్న హిందూ అతివాదం, మైనా రిటీలపై దాడుల నేపథ్యంలో ప్రజాస్వామ్య సూచీలో భారత్‌ స్థానం మరింత పడిపోయింది. 2016లో భారత్‌కు 32వ స్థానం దక్కగా 2017లో 42వ స్థానానికి దిగజారి ‘దోషపూరిత ప్రజాస్వామ్య’ దేశాల జాబితాలోనే కొనసా గుతోంది. కాగా, ఈ లిస్ట్‌లో అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ, చైనాకు 139వ స్థానం దక్కాయి. మొత్తం పది మార్కులకు గాను భారత్‌ 7.23 పాయింట్లు స్కోరు చేయగలిగింది. నార్వేకు అగ్రస్థానం (9.87 పాయింట్లు) దక్కగా ఐస్‌లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్‌ వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి.

165 దేశాలు, రెండు ప్రత్యేక ప్రాంతాలతో ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) జాబితా రూపొందించింది. మొదటి 19 స్థానాల్లో నిలిచిన దేశాల్లోనే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఎకనమిస్ట్‌ గ్రూప్‌’లోని పరిశోధన, విశ్లేషణ విభాగమే ఈఐయూ. ఇది 1946 నుంచి ఏటా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంపై సూచీలను విడుదల చేస్తోంది. ఆయా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వం పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సంస్కృతి, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. సంపూర్ణ ప్రజాస్వామ్యం, దోషపూరిత ప్రజాస్వామ్యం, మిశ్రమ పాలన, నిరంకుశ పాలన ఉన్న దేశాలుగా విభజిస్తుంది.

భారత్‌లో దోషపూరిత ప్రజాస్వామ్యం!
దేశంలో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం అంశాల్లో మొత్తమ్మీద పది పాయింట్లకు గాను 9.17 దక్కగా పౌరస్వేచ్ఛ, రాజకీయ సంస్కృతి, ప్రభుత్వ పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం అంశాల్లో వెనుకబడినట్లు ఈఐయూ పేర్కొంది. లౌకిక దేశంలో అతివాద హిందూ ధోరణులు, మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలపై హింస పెరగటమే భారత్‌ స్థానం పడిపోవటానికి కారణమంది. భారత్‌లో మీడియా స్వేచ్ఛ కూడా పాక్షికంగానే ఉందని, ఛత్తీస్‌గఢ్, కశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో పాత్రికేయులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని తెలిపింది.

అట్టడుగున ఉత్తరకొరియా:
దోషపూరిత ప్రజాస్వా మ్య దేశాల్లో.. భారత్‌తోపాటు అమెరికా(21), జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సింగపూర్, హాంగ్‌కాంగ్‌ కూడా ఉన్నాయి. మిశ్రమపాలన ఉన్న పొరుగుదేశాలు.. బంగ్లాదేశ్‌ 92, నేపాల్‌ 94, భూటాన్‌ 99, పాకిస్తాన్‌ 110వ స్థానాల్లో ఉన్నాయి. నిరంకుశపాలిత దేశాల జాబితాలో మయన్మార్‌ 120, రష్యా 135, చైనా 139, వియత్నాం 140, సిరియా 166వ స్థానంలో ఉండగా, ఉత్తర కొరియాకు అట్టడుగు 167 స్థానం దక్కింది. ప్రపంచ జనాభాలో కేవలం 4.5% మంది సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాలన కింద జీవిస్తున్నారు. దాదాపు సగం (49.3%) మందికి ఏదో ఒకరకమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నట్లు ఈఐయూ గుర్తించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement