అత్యంత చౌక నగరం ముంబై
లండన్: జీవించడానికి ప్రపంచంలో అత్యంత చౌకైన నగరంగా ముంబై నిలిచింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) నిర్వహించిన ఈ ఏడాది అంతర్జాతీయ జీవన ప్రమాణ సర్వే ప్రకారం మరో భారత నగరం ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఆహారం, పానీయాలు, బట్టలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, ఇళ్ల అద్దెలు, రవాణా, వినోద వ్యయాలు వంటి వివిధ రకాల వస్తువులు, ఉత్పుత్తులు, సేవల ధరలను పరిగణనలోకి తీసుకొని ఈఐయూ ఈ సర్వే నిర్వహిస్తుంది.
వివరాలు..
అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచింది. గత ఏడాది ఈ స్థానాన్ని సాధించిన టోక్యోను తోసిరాజని సింగపూర్ మొదటి స్థానంలోకి దూసుకువచ్చింది. ఇక టోక్యో ఈ ఏడాది జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.
అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్ తర్వాతి స్థానాల్లో ప్యారిస్, ఓస్లో, జురిక్, సిడ్నిలు నిలిచాయి. లండన్ నగరం 15వ స్థానంలో నిలవగా, 49వ స్థానంలో మాంచెస్టర్ ఉంది.
అత్యంత ఖరీదైన నగరాలు యూరప్, ఆసియా ఖండాల్లో పెరుగుతున్నాయి. మరో వైపు ఆసియా ఖండంలో భారత ఉపఖండంలో అత్యంత చౌక నగరాలు అధికంగా ఉన్నాయి.
భారత్‌లో ధనికులు, పేదల మధ్య ఆర్థిక అసమానతలు అధికంగా ఉండడం, వేతనాలు, ధరలు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల చౌక నగరాలు మన దేశంలో అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే అధిక సబ్సిడీలు ధరలు తక్కువగా ఉండటానికి మరో కారణం.