ముంబైలో ఆర్బిట్రేషన్ సెంటర్
ముంబై: సింగపూర్ ఇంటర్నేషన్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ) త్వరలో తీవ్ర పోటీ ఎదుర్కోనుంది. వ్యాపార సంఘాల కోసం ఎస్‌ఐఏసీ తరహాలో ముంబైలో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ లా కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మేరకు వెల్లడించారు. ‘ముంబైలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం వివాదాల పరిష్కారం కోసం ఎక్కువ మంది సింగపూర్‌కు తరలి వెళ్తున్నారు.
ప్రపంచ దిగ్గజ సంస్థలకు చెందిన సీఈవోలకు ముంబై నెలవు కాబట్టి ఈ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అని సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీసెస్ సెంటర్‌ను ముంబైలో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ ఆర్బిట్రేషన్ సెం టర్ ఎంతో అవసరమని సీఎం అన్నారు. పెట్టుబడులకు న్యాయవ్యవస్థ కీలకమని చెప్పారు. ముంబైలో ఏర్పాటు చేస్తున్న ఆర్బిట్రేషన్ సెంటర్ దేశంలోనే మొదటిది.
లాభాపేక్ష లేకుండా..
1991 నుంచి ఎస్‌ఐఏసీ కొనసాగుతోంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పని చేస్తోంది. ముంబైలోని ఇండియా బుల్స్ సెంటర్ వద్ద 2013లో ఎస్‌ఐఏసీ అనుసంధాన సంస్థను ఏర్పాటు చేశారు. దేశానికి చెందిన వ్యాపారవేత్తలు ఎక్కువగా ఎస్‌ఐఏసీని ఆశ్రయిస్తున్నారని, 2014 లో విదేశీ వినియోగదారుల్లో దేశానిది మూడో స్థానమని ఎస్‌ఐఏసీ వెబ్‌సైట్ వెల్లడించింది. కోర్టు వ్యాజ్యాల కన్నా తక్కువ దీని పరిధి, అధికారం తక్కువే అయినప్పటికీ కోర్టు వ్యాజ్యాల కన్నా తొందరగా, ఖర్చు లేకుండా వివాదాలు పరిష్కారమవుతాయి.
నిర్మాణ, వాణిజ్య, ఇంజినీరింగ్, కార్పొరేట్, రవాణా, సముద్ర రవాణా, బీమా సంబంధ వివాదాలను ఎస్‌ఐఏసీ ఎక్కువగా పరిష్కరిస్తుంది. 9-12 నెలల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. సింగపూర్‌తో సంబంధం లేని సంస్థలు కూడా ఎస్‌ఐఏసీలో వివాదాలు పరిష్కరించుకోవచ్చు. చర్చలు కూడా సంబంధిత సంస్థల దేశాల్లోనే జరుగుతాయి.
దిగువ న్యాయస్థానాలు అవసరం: సీఎం
కోర్టుల్లో న్యాయం పొందడానికి ఎక్కువ మొత్తంలో ధనం వెచ్చిస్తుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సత్వర అభివృద్ధికి దిగువ న్యాయస్థానాల ఆవశ్యకత ఉందని అన్నారు. తద్వారా సుప్రీం, హైకోర్టుపై భారం కూడా తగ్గుతుందని చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారుల అవసరార్థం మానవ వనరులను పెంచాలని ఎన్‌ఎల్‌యూని కోరారు. ఆస్తి హక్కులు, ఐటీపై మరింత పట్టు సాధించాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.