బళ్లారికి పాకిన స్పా మసాజ్ సెంటర్లు
సాక్షి, బళ్లారి : గతంలో స్పా మసాజ్ సెంటర్లు థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో ఉండేవి. తర్వాత మనదేశంలో ముంబయ్, బెంగళూరు, చెన్నై తదితర మహానగరాల్లో వెలిశాయి. ఇప్పుడు ఆ స్పా మసాజ్ సెంటర్లు బళ్లారి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడంతో పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్పా మసాజ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులే చెబుతున్నారు.
అప్పుడప్పుడు వనమూలికల తైలంతో మసాజ్ చేయించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. స్పా మసాజ్ అంటే ఆడవాళ్లు మగవారికి మసాజ్ చేయడమే. ఇందుకోసం ప్రత్యేక రేట్లు ఫిక్స్ చేశారు. గంట, అరగంటకో రేటు ఫిక్స్ చేసి ఆమేరకు మసాజ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమ్మాయిలతో అబ్బాయిలకు మసాజ్ చేస్తుండడంతో బళ్లారిలో సర్వత్రా చర్చనీయాంశమైంది.
బళ్లారితోపాటు ఈ సెంటర్లు హంపి పరిసరాల్లోని రిసార్ట్‌లు, హెరిటేజ్‌లతో పాటు హొస్పేటలోని పెద్ద పెద్ద హోటళ్లలో కూడా వెలిశాయి. బాగా పేరున్న స్టార్ హోటల్, లాడ్జిలలో మసాజ్ సెంటర్లు ఉన్నాయి. మసాజ్ అరోగ్యానికి మంచిదే అయినా, ఆడవాళ్లు మగవాళ్లకు మసాజ్ చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పా మసాజ్ సెంటర్లకు ఎలాంటి అనుమతి లేకున్నా నగరంలోని యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.