Bellary
-
త్వరలో బళ్లారి జైలుకు దర్శన్ !
బొమ్మనహళ్లి : అభిమాని రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి పరప్పన అగ్రహార జైలులో న్యాయ నిర్బంధంలో ఉన్న నటుడు దర్శన్‌కు అక్కడ రాచ మర్యాదలు లభించడం పెను సంచలనమైన విషయం తెలిసిందే. రాచమర్యాదులు అందుతున్న ఫొటోలు వెలుగులోకి రావడంతో జైళ్లశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దర్శన్‌ను పరప్పన ఆగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈమేరకు బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించేందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో దర్శన్‌ను బళ్లారికి తరించనున్నట్లు సమాచారం. భవిష్యత్‌లో విచారణ నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బళ్లారి జైలు నుంచే కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు సమాచారం. రాచమర్యాదల కేసుపై దర్యాప్తు దొడ్డబళ్లాపురం: దర్శన్‌కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్‌స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు.దర్శన్ ఉదంతంపై సీఎం సమీక్ష దర్శన్, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలకు జైలులో రాచ మర్యాదలు దక్కుతున్న అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులతో సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం హోంమంత్రి పరమేశ్వర్ ముఖ్యమంత్రిని కలిసి జైల్లో జరుగుతున్న అక్రమాలు, లోపాల గురించి వివరించారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో కలిపి మొత్తం 9 మందిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందని చెప్పారు. ఆలోపు కోర్టు అనుమతి తీసుకుని దర్శన్‌ను వేరే జైలుకి తరలించే ఏర్పాటు చేస్తామన్నారు. కోర్టు అనుమతిస్తే దర్శన్‌ను బళ్లారి లేదా హిండలగా జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి.తనిఖీకి ఐపీఎస్ అధికారులతో కమిటీ దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైల్లో దర్శన్, ప్రజ్వల్ రేవణ్ణ, రౌడీ షీటర్లకు రాచ మర్యాదలు ఇస్తున్న విషయానికి సంబంధించి తనిఖీ చేయడానికి ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జైల్లో దర్శన్, ఇతర ఖైదీలు ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్‌లోకి తిరగడానికి అవకాశం కలి్పంచినట్టు సీసీటీవీలో స్పష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న పలు జైళ్లలో ఇదే పరిస్థితి ఉందన్నారు. జైలును సందర్శించిన పోలీస్ కమిషనర్ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ పరప్పన అగ్రహార జైలును సందర్శించారు. జైలులో గంజాయి, మద్యం, సిగరెట్లు, మొబైళ్లు అన్నీ ఇస్తున్నారని ఇటీవల పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలై వచ్చిన ఒక ఖైదీ మీడియా ముందు వెల్లడించాడు. దీంతో కమిషనర్ దయానంద్ జైలుని సందర్శించారు. ఫొటోలు, వీడియోలపై జైలు అధికారులను ప్రశ్నించారు. -
శ్రీరాములు ఆస్తి రూ.72 కోట్లు.. సతీమణి భాగ్యలక్ష్మి ఆస్తి రూ.22కోట్లు
సాక్షి బళ్లారి: బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు తన స్థిర, చర ఆస్తి వివరాలను ప్రకటించారు. ఆయన లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈసందర్భంగా నామినేషన్ పత్రాల్లో ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద రూ.72.45 కోట్ల చర, స్థిర ఆస్తులు ఉన్నట్లు, తన భార్య భాగ్యలక్ష్మి నామినేషన్ సమర్పించిన నేపథ్యంలో ఆమె తన పేరుమీద రూ.22.57 కోట్ల చర, స్థిర ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. శ్రీరాములు అఫిడవిట్లో పేర్కొన్న విధంగా మొత్తం తన ఆస్తుల్లో రూ.32.88 కోట్లు చర, రూ.39.65 కోట్ల స్థిరాస్తి ఉందని, దీంతో పాటు రూ.6.70 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే తన భార్య భాగ్యలక్ష్మి పేరు మీద రూ.2.57 కోట్ల చరాస్తి, రూ.20 కోట్ల స్థిరాస్తి ఉందని వివరించారు. మొత్తం మీద గత ఏడాది దాదాపు రూ.50 లక్షలు వివిధ రూపాల్లో ఆదాయం వచ్చిందని, భార్య పేరుతో రూ.9లక్షలు, కుమారుడి పేరుతో దాదాపు రూ.2 లక్షలు ఆదాయం లభించిందని తెలిపారు. -
Karnataka : బళ్లారి విజేత ఎవరు?
ఒక నియోజకవర్గం దేశవ్యాప్తంగా న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఉంటుంది. అదే కర్ణాటకలోని బళ్లారి. భౌగోళిక, రాజకీయ, చారిత్రక ప్రాధాన్యం ఉన్న బళ్లారి గురించి గ్రౌండ్ రిపోర్ట్ మీరే చదవండి సాక్షి, బళ్లారి: రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని 545 లోక్‌సభ స్థానాల్లో ప్రముఖమైన, దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలకు, ప్రముఖులకు గుర్తుండే లోక్‌సభ స్థానాల్లో బళ్లారి లోక్‌సభ కూడా ఒకటి అంటే అతిశయోక్తి కాదు. బళ్లారి లోక్‌సభ పరిధిలో చారిత్రాత్మక కట్టడాలైన ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ, అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు, తుంగభద్ర డ్యాం తదితరాలు ఉండటం ఒక ఎత్తయితే, 1999లో ఈ లోక్‌సభ స్థానం నుంచి అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ తరపున దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ పోటీ చేయడంతో అందరి దృష్టి బళ్లారిపై పడింది. ఈనేపథ్యంలో సహజంగానే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన నియోజకవర్గంలో అగ్రనేతలు ఢిల్లీ నుంచి వచ్చి బళ్లారిలో పోటీ చేయడంతో అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికలే కాదు, అసెంబ్లీ ఎన్నికలను కూడా దేశ వ్యాప్తంగా అందరూ గమనిస్తుంటారు. కాగా స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి అంటే 1951 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలను గమనిస్తే ప్రతి ఎన్నిక హోరాహోరీగానే జరిగాయి. అత్యధిక సార్లు గెలిచింది ఎవరంటే? 1951లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన టేకూరు సుబ్రమణ్యం తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి వై.మహాబళేశ్వరప్పపై 30 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొంది అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు అంటే 1957, 1962లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొంది హ్యాట్రిక్ లోక్‌సభ సభ్యుడుగా రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వీ.కే.ఆర్.వీ.రావ్ స్వతంత్ర అభ్యర్థి వై.మహాబళేశ్వరప్పపై విజయం సాధించారు. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ వీ.కే.ఆర్.వీ.రావ్ రెండోసారి కూడా విజయం సాధించారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కే.ఎస్.వీరభద్రప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ భారతీయ లోక్‌దళ్ పార్టీ తరపున పోటీ చేసిన తిప్పణ్ణపై గెలుపొందారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ నుంచి ఆర్.వై.ఘోర్పడే విజయం సాధించారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బసవరాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ తరపున ఎం.పీ.ప్రకాష్‌పై పోటీ చేసి గెలుపొందారు. 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి, 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బసవరాజేశ్వరి మూడో సారి పోటీ చేసి గెలుపొంది హ్యాట్రిక్ లోక్‌సభ సభ్యురాలుగా ఈమె కూడా రికార్డు సృష్టించారు. అప్పటి వరకు జరిగిన బళ్లారి లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలుపొంది హాట్రిక్ లోక్‌సభ మెంబర్లుగా వీరిద్దరు మాత్రమే నిలిచారు. ఐదేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కే.సీ.కొండయ్య తన సమీప ప్రత్యర్థి ఎన్.తిప్పణ్ణపై విజయం సాధించారు. 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ కే.సీ.కొండయ్య విజయం సాధించి, రెండుసార్లు లోక్‌సభ మెంబరుగా గెలుపొందారు. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించాయి. అప్పట్లో బళ్లారి నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, బీజేపీ తరపున సుష్మాస్వరాజ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ గెలుపొంది రికార్డు సృష్టించారు. అప్పట్లో బీజేపీ ఓడిపోయినా సుష్మాస్వరాజ్ పోటీ చేయడంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బళ్లారిపై క్రమేణా బీజేపీ పట్టు సాధించేందుకు వీలైంది. 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోళూరు బసవనగౌడ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కేఎస్ వీరభద్రప్పపై విజయం సాధించారు. 2004 నుంచి బీజేపీకి కంచుకోట 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కరుణాకరరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కే.సీ.కొండయ్యపై విజయం సాధించారు. తొలిసారి బీజేపీ లోక్‌సభ సభ్యుడుగా గాలి సోదరుల్లో అగ్రజుడు కరుణాకరరెడ్డి విజయం సాధించడంతో బళ్లారిలో గాలి సోదరుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన జే.శాంత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.వై హనుమంతప్పపై విజయం సాధించారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన బీ.శ్రీరాములు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి గెలుపొందారు. 2018లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఉగ్రప్ప తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జే.శాంతపై ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వై.దేవేంద్రప్ప తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్పపై ఘన విజయం సాధించారు. ఇలా ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలను గమనిస్తే ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపొందారు. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ అయితే 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలను గమనిస్తే 2018లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలు మినహా మిగిలిన ఎన్నికల్లో బీజేపీనే ఘన విజయం సాధిస్తూ ఇక్కడ పట్టు పెంచుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. బీజేపీ తరపున మాజీ మంత్రి బీ.శ్రీరాములు, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి, సండూరు ఎమ్మెల్యే తుకారాం పోటీ పడుతున్న నేపథ్యంలో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. బళ్లారి లోక్‌సభ పరిధిలో బళ్లారిసిటీ, బళ్లారి రూరల్, హగరిబొమ్మనహళ్లి, హడగలి, సండూరు, కూడ్లిగి, కంప్లి, విజయనగరతో సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా, మిగతా రెండు నియోజకవర్గాల్లో ఒక చోట బీజేపీ, మరొక చోట జేడీఎస్ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం 18,65,341 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 9,20,022 మంది, మహిళా ఓటర్లు 9,45,319 మంది ఉన్నారు. పురుష ఓటర్లు కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. -
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో రాజమౌళి దంపతులు!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు ఆలయంలో పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరా ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB29గా తెరకెక్కించనున్న ఈ మూవీ కోసం మహేశ్ బాబు జిమ్‌లో కసరత్తులు ప్రారంభించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలో రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ చిత్రం కోసం హాలీవుడ్ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌తో పాటు థోర్ సినిమాతో పాపులర్ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్ SSMB29 ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని టాక్ వినిపించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త అప్పట్లో తెగ వైరలైంది. Legendary Director @ssrajamouli garu at #SreeAmrutheswaraTemple in Bellary for the Prana Prathishta ceremony.@SriAmruteshwara @VaaraahiCC @SaiKorrapati_ pic.twitter.com/IH2wEYI6IM — Vaaraahi Chalana Chitram (@VaaraahiCC) February 29, 2024 -
సీఎం జగన్ కు అండగా ఉందాం: మాజీ ఎంపీ శాంత
-
గూడ్స్ నుంచి విడిపోయిన వ్యాగన్లు
కర్ణాటక: బెంగళూరు నుంచి బళ్లారి వైపు బొగ్గులోడు తో వెళుతున్న గూడ్సు రైలు సోమవారం అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలో డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామం వద్ద ఇంజిన్ నుంచి 46 వ్యాగన్లు విడిపోయాయి. ఇంజిన్ ఐదు వ్యాగన్లతో వెళ్లిపోయింది. బొగ్గులోడుతో ఉన్న 46 వ్యాగన్లు కంట్రోల్ కాక పట్టాలు తప్పేలా కనిపించాయి. కిలోమీటర్ దూరం వెళ్లి నిలిచిపోయాయి. గార్డు వాకీటాకీ ద్వారా ఇంజిన్ డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో రైలు మళ్లీ వెనక్కు వచ్చి వ్యాగన్లను తగిలించుకుని వెళ్లిపోయింది. ఎలాంటి ప్రమాదం సంభవించక పోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
నాగేంద్రకు మంత్రి పదవి?
బళ్లారి అర్బన్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారీటీని సాధించిన నేపధ్యంలో బళ్లారి గ్రామీణ నియోజక వర్గం నుంచి గెలుపొందిన బీ.నాగేంద్రకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముందు నుంచి సిద్దరామయ్యతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఐదు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఐదు మందిలో తుకారాం కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొదారు. అయితే గతంలో తుకారాం మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తొలిసారిగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని నాగేంద్ర కోరినట్లు సమాచారం. -
బళ్లారి కోటపై విజయకేతనం ఎవరిదో?
సాక్షి,బళ్లారి: రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనం చోటు చేసుకున్నా దాని మూలాలు బళ్లారిలోనే ఉంటాయనేది రాజకీయ పరిశీలకుల అంచనా. అందుకే ఎప్పుడు ఎన్నిక జరిగినా రాష్ట్ర ప్రజలందరూ బళ్లారిపైనే దృష్టి పెడుతుంటారు. ఈసారి బళ్లారి నగర అసెంబ్లీ ఎన్నికల పోరులో చతుర్ముఖపోటీ నెలకొంది. అయితే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, కేఆర్‌పీపీల మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బళ్లారి కోటపై ఏ పార్టీ జెండా ఎగురుతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, కాంగ్రెస్ తరఫున నారాభరత్‌రెడ్డి, కేఆర్పీపీ తరఫున గాలి లక్ష్మీ అరుణ బరిలో ఉన్నారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడి భంగపడిన అనిల్‌లాడ్ జేడీఎస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. మహిళా ఓటర్లే ఎక్కువ బళ్లారి సిటీ నియోజకవర్గంలో 2,58,588 ఓటర్లు ఉండగా 1,32,780 మంది మహిళలు, 1,25,779 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో విజేతలు ఎవరనేది మహిళలే నిర్ణయించనున్నారు. బళ్లారి సిటీలో 39 వార్డులు ఉండగా, సిటీ నియోజకవర్గం పరిధిలోకి 26 వార్డులు వస్తాయి. తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువ బళ్లారిలో తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువ. ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు ఇక్కడే స్థిరపడి వ్యవసాయం, సివిల్ కాంట్రాక్టు పనులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. బళ్లారి అసెంబ్లీ పోరులో తలపడుతున్న అభ్యర్థులు బళ్లారిలోనే పుట్టి పెరిగిన వారు అయినప్పటికీ వీరి పూర్వికులు ఏపీవారే. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, కేఆర్పీపీ తరఫున బరిలో ఉన్నది ఒకే సామాజికవర్గానికి చెందినవారే. వీరంతా ఆర్థికంగా స్థితిమంతులు. పైగా బీజేపీ తరఫున బరిలో ఉన్న గాలి సోమశేఖరరెడ్డి, కేఆర్పీపీ తరఫున పోటీలో ఉన్న గాలి లక్ష్మీ అరుణలు స్వయానా బావ,మరదులు కావడం విశేషం. దీంతో ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎవరి ధీమా వారిదే కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌రెడ్డి, గాలి జనార్దనరెడ్డి సతీమణీ గాలి లక్ష్మీ అరుణ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టి బళ్లారి ప్రజల వాణి వినిపించేందుకు హోరా–హోరీగా తలపడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఇప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖరరెడ్డి మూడో పర్యాయం విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బళ్లారి నగరంలో తాను చేసిన అభివృద్ధి పనులే తన విజయానికి కారణమవుతాయని గాలిసోమశేఖరరెడ్డి ధీమాతో ఉన్నారు. ఈమేరకు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందువల్ల ప్రజలు బీజేపీని వీడి తమను గెలిపిస్తారని, కాంగ్రెస్, కేఆర్పీపీ అభ్యర్థులు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. జేడీఎస్ అభ్యర్థి అనిల్ లాడ్ విషయానికొస్తే 2008లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గాలి సోమశేఖరరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం యత్నించి విఫలమై జేడీఎస్ తీర్థం పుచ్చుకుని ఎన్నికల బరిలో తలపడుతున్నారు. -
కాంగ్రెస్ గెలుపు సంకేతాలు చాలా ఉన్నాయి : భరత్ రెడ్డి
-
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. భార్యపై అనుమానంతో...
సాక్షి, బళ్లారి: పెళ్లై సంవత్సరం కూడా పూర్తి కాలేదు. కట్టుకున్న భార్య శీలంపై అనుమానం పెంచుకున్న ఓ భర్త భార్య ఆరు నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పోలీసు విచారణలో ఆలస్యంగా వెలుగు చూసింది. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా గంగొండనహళ్లికి చెందిన మోహన్ కుమార్(24) అనే వ్యక్తి తన భార్య రేష్మా(20)ను దారుణంగా హత్య చేసి, శవాన్ని ఆడవిలో పారవేసి పరారయ్యాడు. ఈ ఘటనపై రేష్మ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కావాలని డిమాండ్ చేసేవాడని, తన కూతురిని హత్య చేసినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి మోహన్ కుమార్‌ను పట్టుకుని విచారణ చేయగా నేరాన్ని ఒప్పుకున్నాడు. భార్యను దారణంగా హత్య చేసి, బంధువులకు, గ్రామస్తులకు అనుమానం రాకుండా చిక్కమగుళూరు జిల్లా అజ్జంపుర పోలీసు స్టేషన్ పరిధిలోని ఆడవిలో పాతిపెట్టి భార్య కనిపించడం లేదని నమ్మించేందుకు ప్రయత్నించిన మోహన్ కుమార్ చివరకు కటకటాల పాలయ్యాడు. చదవండి: (ప్రియుడితో కుమార్తె పరార్.. తల్లిదండ్రుల ఆత్మహత్య) -
బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర
సాక్షి, బళ్లారి: నీట మునిగి మరణించిన బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర వేస్తే మళ్లీ బతుకుతాడన్న నమ్మకంతో తల్లిదండ్రులు ఉప్పు పాతర వేశారు. ఈ ఘటన కర్ణాటకలో బళ్లారి తాలూకాలోని సిరివార గ్రామంలో జరిగింది. శేఖర్, గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు భాస్కర్(10) సోమవారం ఈతకు వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు. అయితే నీటిలో పడి మరణించిన వారిని రెండు గంటల్లోగా ఉప్పులో కప్పి పెడితే బతుకుతారనే మూఢ నమ్మకంతో తల్లిదండ్రులు సుమారు 4–5 బస్తాల ఉప్పును తెచ్చి మృతదేహంపై కుప్పగా పోశారు. బాలు డు బతికి వస్తాడని దాదాపు 8 గంటల పాటు ఎదురు చూశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: (పెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం) -
పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం.. చివరకు..
సాక్షి, బళ్లారి: పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం తీరని విషాదాంతమైంది. పెద్దల మందలిపుతో విరక్తి చెంది ఇద్దరూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. బెంగళూరులో నివాసం ఉంటున్న చరణ్ (23), అక్కడే వివాహిత అయిన నాగరత్నతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. ఈ విషయం నాగరత్న భర్త ప్రసన్నకుమార్‌కు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. అయినా వారు తమ గాఢప్రేమను కొనసాగించారు. ఇద్దరూ కలిసి చనిపోదామనుకుని నిర్ణయించుకుని నాలుగు రోజుల క్రితం పల్సర్ బైక్ తీసుకుని ఇళ్లు వదిలి పారిపోయి వచ్చారు. చరణ్ తన స్నేహితునికి ఫోన్ చేసి తాము దావణగెరె జిల్లా బెంకికెరె గ్రామ సమీపంలోని చెరువులో దూకి చనిపోతున్నామని చెప్పాడు. ఈ ఘటనపై చెన్నగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చెరువులో నుంచి మృతదేహాలను వెలికి తీశారు. చదవండి: (బతుకుపై బెంగనా?.. కుటుంబ సభ్యులు బెదిరించారా..?) -
బ్లూవేల్ తరహా గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: దావణగెరెలో గతనెల 23న ఇంటిపైనుంచి పడి మృతి చెందిన పీయూసీ విద్యార్థి మిథున్‌కు సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూశాయి. అతను ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందలేదని, బ్లూవేల్ తరహాలో యానిమేషన్ గేమ్స్‌కు ప్రభావితమై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ రిష్యంత్ బుధవారం మీడియాకు తెలిపారు. తన చావుకు తానే కారణమంటూ గణితం పుస్తకంలో స్వయంగా రాసి అనంతరం చేతికి గాయం చేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసి అనంతరం ఇంటిపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఆ విద్యార్థి చేతిరాతను తల్లిదండ్రులు నిర్ధారించారన్నారు. అయితే ఆ విద్యార్థి రాసిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి అధికారికంగా నిర్ధారణ చేస్తామన్నారు. చదవండి: ('ఆమెకు 11 లక్షలు ఇస్తే.. రూ.5 కోట్లుగా మారుస్తుంది') -
సంతానం కలగలేదని.. భర్త ఎంత ఘోరం చేశాడు
బళ్లారిఅర్బన్(బెంగళూరు): సంతానం కలగలేదని ఓ కిరాతకుడు భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. ఇక్కడి శాస్త్రినగర రెండో క్రాస్‌లో బీజాపుర జిల్లా ఇండి తాలూకా కేరవార గ్రామానికి చెందిన వీరేశ్, భార్య సునంద నివాసం ఉంటున్నారు. ఇతను ఆర్టీసీ డ్రైవర్. 15 ఏళ్లుగా సంతానం కలగలేదని దంపతుల మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయంపై గొడవపడ్డారు. క్షణికావేశంలో వీరేశ్, భార్య గొంతు నులిమి హత్య చేశాడు. శనివారం ఉదయం సునంద బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కౌల్‌బజార్ సీఐ సుభాష్, మహిళ పోలీస్ స్టేషస్ సీఐ వాసు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చదవండి: ఆన్లైన్ పరిచయం.. అసభ్యకర వీడియోలను అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో.. -
81 ఏళ్ల వయసులో పీజీ పట్టా !
సాక్షి, బళ్లారి: చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విజయపుర జిల్లా జేఎస్ఎస్ మహా విద్యాలయంలో 81 ఏళ్ల వయసులో నింగయ్య బసయ్య ఎంఏ ఇంగ్లిషులో పట్టా పొందారు. అదే విధంగా విశ్రాంత ఉపాధ్యాయుడు పరసప్ప ఇప్పటికే పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సాధించాడు. తాజాగా ఎంఏ ఇంగ్లిషు పరీక్షలు రాయడం విశేషం. -
ఒకే వేదికపై నారా, గాలి!
సాక్షి, బళ్లారి (కర్ణాటక): రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. శుక్రవారం బళ్లారిలో జరిగిన ఓ క్రికెట్ టోర్నీ వేడుకకు హాజరైన బీజేపీ ఎమ్మె ల్యే గాలి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డిలు ఒకే వేదికపై కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీల పరంగా వైరం ఉన్నా వాటిని పక్కనపెట్టి కొద్దిసేపు ఈ ఇద్దరు నేతలు ముచ్చటించుకోవడం గమనార్హం. చదవండి: (పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్) -
త్వరలో పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకొంటాం: గురురాజ్, గంగా
బెంగళూరు: కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధిని బుధవారం నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు దర్శించుకొంటున్నారు. బళ్లారికి చెందిన గురురాజ్, గంగా అనే జంట పునీత్‌కు వీరాభిమానులు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరు శనివారం పునీత్ సమాధిని దర్శించుకున్నారు. త్వరలో ఇక్కడే పెళ్లి చేసుకొంటామని తెలిపారు. ఇందుకు శివరాజ్‌కుమార్ కూడా సమ్మతించారని చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పునీత్‌కు అభిమానులు ప్రేమను చాటుకుంటున్నారు. చామరాజనగర వద్ద జరిగిన గోరె హబ్బలో రాజ్, పునీత్‌ల చిత్రాన్ని ప్రదర్శించారు. చదవండి: (పునీత్‌కు అప్పటికే చెమటలు పట్టాయి.. అందుకే అక్కడకు వెళ్లాలని సూచించా..) -
Puneeth Rajkumar: పునీత్ అభిమాని ఆత్మహత్య
సాక్షి, బళ్లారి: పవర్ స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక దావణగెరె నగరంలోని విజయనగర కాలనీకి చెందిన సీ.కుమార్ (25) అనే యువకుడు బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పునీత్ రాజకుమార్ అంటే ఇష్టపడేవాడని, పునీత్ నటించిన ప్రతి సినిమాను వీక్షించేవాడని, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దావణగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పునీత్‌కు నివాళి రాయచూరురూరల్: కర్ణాటక విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రముఖులు, నాయకులు కేపీటీసీఎల్ భవనంలో బుధవారం పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అధ్యక్షుడు గోపి తదితరులు పాల్గొన్నారు. చదవండి: (కంఠీరవకు.. అభిమాన సంద్రం) -
రైతు కుటుంబం ఆత్మహత్య
సాక్షి బళ్లారి: కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోరం జరిగింది. శహపుర తాలూకా ధోరణహళ్లిలో దంపతులు, నలుగురు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకొన్నారు. గ్రామానికి చెందిన భీమరాయ సురపుర (45), భార్య శాంతమ్మ (36), కుమార్తెలు సుమిత్ర (12), శ్రీదేవి (10), లక్ష్మి (8), శివరాజ్ (6) అనే ఆరుగురు సోమవారం తమ పొలంలోని ఫారం పాండ్‌లో దూకి తనువు చాలించారు. భీమరాయ మూడెకరాల పొలం కొనుగోలు చేసి, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. మిరప, పత్తి తదితరాల సాగుకు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.20 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా కరువు, అతివృష్టితో పంటలు పండక తీవ్ర నష్టాల పాలయ్యాడు. అప్పుల భారం పెరిగి కుటుంబ పోషణ కూడా కష్టమైంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భీమరాయ సొంత పొలానికి భార్య బిడ్డలను తీసుకెళ్లి మొదట పిల్లలను ఫారంపాండ్‌లోకి తోసేసి, తరువాత దంపతులు దూకినట్లు పోలీసులు తెలిపారు. -
వర్క్ ఫ్రమ్ హోంతో ఇంటికి రాగా ముగ్గురు కరోనాకు బలి
సాక్షి బళ్లారి: కరోనా రక్కసి మృత్యుతాండవం చేసింది. ఒక కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన బళ్లారి జిల్లాలో కురుగోడు తాలూకా పరిధిలోని మదిరే గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రుద్రప్ప కుమారుడు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. లాక్డౌన్ ప్రకటనతో పాటు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వడంతో నెల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అప్పుడే కుమారుడికి కరోనా సోకింది. ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటూ కోలుకున్నాడు. అయితే కుమారుడి ద్వారా తల్లి సునీతమ్మ (45), చెల్లి నందిని (18)కి, తండ్రి రుద్రప్ప (56)కు కరోనా సోకింది. సునీతమ్మ, నందిని కంప్లిలో చికిత్స పొందుతూ 15 రోజుల కిందట మృతి చెందారు. తాజాగా బళ్లారిలో చికిత్స పొందుతున్న రుద్రప్ప మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
వింత: శిశువు కాలికి తొమ్మిది వేళ్లు
సాక్షి, బళ్లారి: కాలికి తొమ్మిది వేళ్లతో శిశువు జన్మించిన అరుదైన ఘటన హొసపేటెలో చోటు చేసుకుంది. హొసపేటె తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి కాన్పు కోసం నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. బుధవారం ఆమె మగబిడ్డకు జన్మ ఇచ్చింది. అయితే శిశువు ఎడమ కాలికి తొమ్మిది వేళ్లు ఉండటం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఇలా తొమ్మిది వేళ్లతో జన్మించిన బాలురు ప్రపంచంలో 20 మంది ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
బళ్లారి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
బెంగళూరు: కర్నాటక బళ్లారి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది . ఐదంతస్తుల కోల్డ్ స్టోరేజ్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి . దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు . సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు . కానీ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేదు . ఈ ప్రమాదంలో మూడంతస్తుల్లో ఉన్న మిరప నిల్వలు పూర్తిగా దగ్ధం అయ్యాయి . (చదవండి: వైరల్: క్వారంటైన్లో ఎమ్మెల్యే చిందులు) -
మళ్లీ కరోనా భయం: సౌతాఫ్రికా స్ట్రెయిన్ కలకలం
సాక్షి బళ్లారి: రాష్ట్రంలోకి సౌతాఫ్రికా స్ట్రెయిన్ వైరస్ అడుగు పెట్టడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లూ విలయతాండవం చేసిన కరోనా తగ్గుముఖం పట్టిందని ఊరట చెందుతున్న నేపథ్యంలో కొత్త రకం వైరస్ ప్రబలడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. వివరాలు...గత నెల 17న దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న అన్నాచెల్లెలికి ఎయిర్‌పోర్ట్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. బళ్లారికి చేరుకున్న ఇద్దరికీ గతనెల 20న జ్వర లక్షణాలు కనిపించడంతో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తనమూనాలను బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలోని ప్రయోగశాలకు పంపించగా సౌతాఫ్రికా స్ట్రెయిన్ కరోనా సోకినట్లు ధ్రువపడినట్లు జిల్లా అధికారులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కాన్నారు. బాధితులను బళ్లారిలోని ట్రామాకేర్ సెంటర్లో చికిత్స అందించి హోం క్వారంటైన్లో ఉంచారు. శివమొగ్గలో సౌతాఫ్రికా స్ట్రెయిన్ కేసులు లేవు శివమొగ్గ: దుబాయ్‌కు వెళ్లి వచ్చిన శివమొగ్గకు చెందిన 53 సంవత్సరాల వయసున్న వ్యక్తికి సౌతాఫ్రికా స్ట్రెయిన్ లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి. కే.ఎస్. ఈశ్వరప్ప తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెగ్గాన్ అస్పత్రికి వెళ్లి విచారించగా దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలాంటి కరోనా లేదని, వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారన్నారు. అతన్ని కలిసిన 39 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా నెగిటివ్ వచ్చిందన్నారు. కాగా శివమొగ్గ జిల్లా అరోగ్య,శాఖ ఆధికారి డాక్టర్ రాజేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చదవండి: పుణేలో కోవిడ్ ఆంక్షలు కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్! -
రక్షిత పెళ్లికూతురాయనే !
సాక్షి, బళ్లారి : కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు ఇంట పెళ్లి సందడి మొదలైంది. శ్రీరాములు పెద్ద కుమార్తె రక్షిత వివాహం ఈ నెల 5న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో హైదరాబాద్‌కు చెందిన లలిత్ సంజీవ్‌రెడ్డితో జరగనుంది. సోమవారం బళ్లారి హవంబావిలో శ్రీరాములు స్వగృహంలో పెళ్లి వేడుకలను సంప్రదాయబద్ధంగా ప్రారంభించి రక్షితను పెళ్లి కుమార్తెను చేశారు. శ్రీరాములు దంపతులు కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ నుంచి బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరు ప్యాలెస్‌లోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా కళా దర్శకులు వివాహ మంటపాన్ని తీర్చిదిద్దారు. (రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం) -
రక్షిత వివాహానికి ప్రధానికి ఆహ్వానం
సాక్షి, బళ్లారి: రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీరాములు తన కుమార్తె పెళ్లికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. దీంతో స్వయాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వధూవరులకు ఆశీస్సులు, అభినందన లేఖను పంపారు. మార్చి 5న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శ్రీరాములు కుమార్తె రక్షితకు హైదరాబాద్‌కు చెందిన సంజీవ్‌రెడ్డితో జరగనున్న పెళ్లికి ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని లేఖలో కొత్త జీవితంలో అన్ని రకాలుగా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ నూతన వధూవరులతో పాటు మంత్రి శ్రీరాములుకు అభినందనలు తెలిపారు. వధూవరులకు ప్రధాని ఆశీస్సులు, అభినందన లేఖ నిశ్చితార్థ వేడుకకు హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి (ఫైల్ ఫోటో) -
పెళ్లి సందడిలో పెను విషాదం.. ఆరుగురు మృతి
బంధువుల వివాహానికి హాజరై సొంతూరికి తిరిగి వెళ్తుండగా ఘోర విషాదం వెంటాడింది. ఎదురుగా వస్తున్న కారు అదుపు తప్పి ఢీకొనడంతో మరో కారులోని ఆరుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు వదిలారు. మరికొద్ది గంటల్లో స్వగ్రామానికి వెళ్లేలోపునే ఘోరం దాపురించింది. సాక్షి, బళ్లారి: పెళ్లి సంబరాలు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి చేరుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. గదగ్ జిల్లా ముండ్రిగి రింగ్‌రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధార్వాడ జిల్లా హుబ్లి సమీపంలోని అగసి గ్రామానికి చెందిన ఆనంద్ బట్టగేరి, సిద్ధు కోరిశెట్టి, మనోజ్‌కుమార్, అమృత్, చన్నువాడద్, వినయ్‌కౌడి అనే యువకులు మృతి చెందారు. అతివేగంతో అదుపు తప్పి.. ఒక ఐ–టెన్ కారు.. గదగ్ సమీపంలో ముండ్రిగి రింగ్ రోడ్డులో వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతే వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న పెళ్లివారితో కూడిన ఐ– 20 కారును ఢీకొట్టింది. ఆ తాకిడికి ఐ–20 కారు నుజ్జునుజ్జయింది, అందులో ప్రయాణిస్తున్న 6 మంది ఘటనాస్థలంలోనే మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలు తగిలాయి. ఒకరు చేసిన తప్పునకు మరో కారులో ప్రయాణిస్తున్నవారు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై గదగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి సంబరాలు ముగించుకుని స్వగృహానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి వేడుకలో విషాదం అలముకుంది. మృతదేహాలను, క్షతగాత్రులను గదగ్ ఆస్పత్రికి తరలించారు. -
‘కుమారస్వామి పాము లాంటోడు.. అందుకే’
సాక్షి, బెంగళూరు : ‘కుమారస్వామి పాము లాంటోడు. అందుకే నన్ను జైలుకు పంపించి తన పాత పగను తీర్చుకున్నాడు’ అంటూ కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డి సీఎం కుమారస్వామిపై విమర్శలు గుప్పించారు. ‘యాంబిడంట్’ ముడుపుల కేసులో గత ఆదివారం అరెస్టైన జనార్దనరెడ్డికి బుధవారం బెయిలు మంజూరైన సంగతి తెలిసిందే. దీంతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన.. మీడియాతో సుమారు 45 నిమిషాల పాటు సంభాషణ సాగించడం విశేషం. మేం కూడా బాధితులమే.. ‘యాంబిడెంట్ కంపెనీ నా సెక్రటరీ అలీఖాన్ కుటుంబాన్ని మోసం చేసింది. ఈ కారణంగా యాంబిడెంట్‌కు చెందిన ఫరీద్‌పై ఫిర్యాదు చేసేందుకు మేం సిద్ధమయ్యాం. దీంతో భయపడిపోయిన ఫరీద్ నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. పోలీసులకు ఈ విషయం గురించి చెప్పొద్దని, పెట్టుబడిదారులందరికీ వారి డబ్బులు తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. మానవత్వంతో నేను కూడా సరేనన్నాను. ఆ సమయంలో తీసిన ఫొటోను ఆధారంగా చేసుకుని నన్ను ఈ కేసులో ఇరికించారు. జరిగింది ఇదే. నిజం చెప్పాలంటే ఈ కేసులో మేం బాధితులమే గానీ నేరస్తులం కాదు’ అని జనార్ధన రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బంగారు కడ్డీలు కొనడానికి యాంబిడెంట్ ప్రజల సొమ్మును ఉపయోగించిన విషయం తన సెక్రటరీ అలీఖాన్‌కు తెలియదని పేర్కొన్నారు. అతడిది పాము పగ.. సీఎం కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న జనార్ధన రెడ్డి... పాత పగను దృష్టిలో పెట్టుకునే తనను అరెస్టు చేయించారని ఆరోపించారు. 2006లో బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం గాలి జనార్దన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారస్వామి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మైనింగ్ లాబీ నుంచి ఆయన 150 కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని గాలి జనార్దన్ ఆరోపణలు చేశారు. తాజాగా మీడియాతో ఈ విషయాలను ప్రస్తావించిన జనార్ధన్ రెడ్డి... ఆనాటి విషయాలు మనసులో పెట్టుకునే సీఎం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన పాములాంటోడని.. గతంలో తనను అరెస్టు చేయించలేక పోయినందుల్లే ప్రస్తుతం ఇలా పగ సాధిస్తున్నారని వ్యాఖ్యానించారు. నీకు ఉన్నది 37 ఎమ్మెల్యేలే గుర్తుపెట్టుకో.. అక్రమ మైనింగ్ కేసులో శిక్ష అనుభవించి విడుదలైన నాటి నుంచి లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నానని గాలి జనార్ధన్ అన్నారు. అప్పటి నుంచి ఎటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన పని తాను చేసుకుంటున్నానని పేర్కొన్నారు. కానీ కుమారస్వామి తనను అలా ఉండనివ్వదలచుకోవడం లేదన్నట్లుగా అన్పిస్తోందని అందుకే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే తనను అంతం చేసేందుకు కుట్ర పన్నారని, అయితే జడ్జి నిష్పక్షపాతంగా వ్యవహరించడం వల్ల తనకు బెయిలు లభించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా కుమారస్వామికి ఉంది కేవలం 37 మంది ఎమ్మెల్యేలేనని.. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. పనిలో పనిగా తనను దూరంగా పెడుతున్న బీజేపీకి కూడా చురకలు అంటించారు. కాగా 600 కోట్ల రూపాయల విలువైన పోంజీ స్కామ్ నుంచి నిందితులను తప్పించేందుకు 18 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను స్వీకరించారన్న ఆరోపణలతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ గత ఆదివారం గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
‘గాలి’ అరెస్ట్ వెనక కుమారస్వామి?
సాక్షి, న్యూఢిల్లీ : కొందరు పోంజి స్కీమ్‌గా అభివర్ణించే పాన్సీ స్కీమ్ స్కామ్‌లో బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లడం వెనక కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రతీకారం ఉందా? 1600 కోట్ల రూపాయల మైనికంగ్ కుంభకోణం కేసులో 2011లో అరెస్టైన గాలి జనార్ధన్ రెడ్డి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన విషయం తెల్సిందే. 600 కోట్ల రూపాయల పాన్సీ స్కీమ్ నుంచి నిందితులను తప్పించేందుకు 18 కోట్ల రూపాయల విలువైన బంగారు కడ్డీలను స్వీకరించారన్నది గాలి జనార్దన్ రెడ్డిపై తాజా ఆరోపణ. ముఖ్యమంత్రి కుమార స్వామికి, గాలి జనార్దన్ రెడ్డి మధ్య కొనసాగుతున్న గొడవ 2006 నాటిది. ఆ నాడు అసెంబ్లీ శాసన సభ్యుడైన కుమార స్వామి ముఖ్యమంత్రి అవడం కోసం ఇద్దరు బీజేపీ నాయకులు, తన జేడీఎస్ పార్టీకి చెందిన ఓ యువజన నాయకుడి కోటరీతో కుట్ర పన్ని అప్పటి ధరమ్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే బీజేపీకి నిధులు సమకూర్చే నాయకుడిగా ముద్రపడిన గాలి జనార్దన్ రెడ్డిని ఆయన తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కుమార స్వామి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కూడా కాకముందే మైనింగ్ లాబీ నుంచి ఆయన 150 కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించారంటూ గాలి జనార్దన్ ఆరోపించారు. ఆ తర్వాత కొంతకాలానికే బీజేపీతో చేసుకున్న అధికార మార్పిడి ఒప్పందం ప్రకారం సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పట్టుమని ఐదు నెలలు కూడా కాలేదు. నా సంకీర్ణ భాగస్వామ్య పక్షం నాయకుడే నాపై అవినీతి ఆరోపణలు చేశారు. నేనా విషయాన్ని నా జీవిత కాలంలో ఎన్నడూ మరవను’ అని ఈ ఏడాది కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని రోజుల ముందు విలేకరులతో వ్యాఖ్యానించారు. గాలిపైనున్న ప్రతీకార జ్వాలల కారణంగానే కుమార స్వామి బీజేపీతోని కాకుండా కాంగ్రెస్ పార్టీతోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు నేటికీ భావిస్తున్నారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి లాబీకి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేశారు. దాంతో బీజేపీ నాయకులు శ్రీరాములు తరఫున గాలి జనార్దన్ రెడ్డి చేసిన ప్రచారానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆమోద ముద్ర వేయలేక పోయారు. పార్టీ కార్యకర్తగా కాకుండా వ్యక్తిగత హోదాలో శ్రీరాములుకి గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని అమిత్ షా చెప్పాల్సి వచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలంగా ఉన్న బళ్లారి ప్రాంతంలో బీజేపీ బలపడడానికి శ్రీరాములుతో కలిసి గాలి జనార్దన్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఒకప్పుడు అంటే 1999లో బీజేపీ తరఫున విస్తృత ప్రచారం సాగించిన సుష్మా స్వరాజ్‌పై సోనియా గాంధీ బళ్లారి నుంచి విజయం సాధించారంటే కాంగ్రెస్ బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ స్థితి నుంచి బళ్లారి నుంచి అన్ని సీట్లు బీజేపీ గెలుచుకునే స్థాయికి బీజేపీ బలపడింది. గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో బళ్లారి ప్రాంతంలోని 9 అసెంబ్లీ సీట్లకు గాను ఆరు సీట్లను కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలుచుకుంది. మొన్న బళ్లారి లోక్‌సభకు జరిగి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన ఉగ్రప్ప చేతిలో శ్రీరాములు సోదరి శాంత ఓడిపోయారంటే మళ్లీ కాంగ్రెస్ ఎంత పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. గాలిపై దాఖలైన అవినీతి కేసుల్లో ముఖ్యమంత్రి కుమార స్వామి పంతం పట్టి ముందుకు తీసుకెళుతుండడం, ప్రస్తుతం గాలిని దగ్గర తీయడం నష్టమే ఎక్కువని, ఆయన్ని బీజేపీ దూరంగా ఉంచడం వల్ల అవినీతి కేసులో గాలి అరెస్టైయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
దారుణం : నాయక్ సినిమా తరహా ఘటన
సాక్షి, బళ్లారి : కొన్నేళ్ల క్రితం రామ్‌చరణ్ నటించిన నాయక్ సినిమా చూశారా? అందులో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి, వికలాంగులుగా మార్చి బిక్షాటన చేయిస్తూ ఉంటారు. సరిగ్గా అదే తరహా ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. అభం శుఖం తెలియని చిన్నారులను, అపహరించిన చిన్నారుల నాలుకలు కత్తరించి మాటలు రాకుండా చేసి భిక్షాటన చేసేందుకు ఉపయోగిస్తున్న ముగ్గురు మానవ అక్రమ రవాణాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కలబురిగిలో శుక్రవారం వెలుగు చూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన చిన్నారులను కలబురిగికి తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈనెల 8న అధికారులు పోలీసులు తనిఖీలు చేపట్టారు. భిక్షాటన చేస్తున్న ఐదు మంది చిన్నారులను గుర్తించి స్థానిక ఆస్పత్రికి తరలించగా చిన్నారుల నాలుకలను కత్తరించినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. పగలంతా భిక్షాటన చేయగా వచ్చిన సొమ్మును రవాణాదారులకు అందజేసినా కడుపునిండా అన్నం కూడా పెట్టడం లేదని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు చిన్నారులను అపహరించి తీసుకొచ్చి భిక్షాటన చేయిస్తున్న రూబీ, రైయిసా బేగం, ఫరీదాలను కలబుర్గిలోని అరెస్ట్ చేశారు. -
కోర్టు తీర్పు వల్లే ఓటు వేయలేకపోయారు
-
కోర్టు ఆంక్షలు.. ఓటు వేయని గాలి
బళ్లారి: బీజేపీ కీలక నేత, వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నా ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. గాలి తన స్వస్థలం బళ్లారికి వెళ్లకూడదంటూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఓటు వేసేందుకు గాలి ప్రత్యేకంగా అనుమతి కోరారా, లేదా అన్నది తెలియాల్సిఉంది. నాన్నతో కలిసి ఓటేద్దామనుకున్నా: మరోవైపు గాలి కుటుంబీకులంతా ఓట్లు వేశారు. తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న జనార్ధన్‌రెడ్డి కూతురు బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. ‘‘ఫస్ట్‌టైమ్ ఓటేస్తున్నాను. నిజానికి మా నాన్నతో కలిసి తొలిసారిగా ఓటు వేయాలని అనుకున్నా. కానీ కుదరలేదు. కోర్టు తీర్పును ఆయన అనుసరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని బ్రాహ్మణి అన్నారు. -
కాంగ్రెస్ హయాంలో బళ్లారిలో అభివృద్ధే లేదు
-
బీజేపీ,కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు
-
బళ్లారిలో అన్నిసీట్ల గెలుపుపై గాలి వర్గం ధీమా
-
మోదీ ఏదైతే చెప్తారో.. అది చేయరు
సాక్షి, బళ్లారి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీరుపై కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ ఏదైతే చెప్తారో.. అది చేయనేచేయరని విమర్శించారు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘అబద్ధపు హామీలు ఇచ్చి.. వాస్తవ దూరమైన కలలు చూపి మభ్యపెట్టేవారిని నమ్మడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేసి తీరుతుంది. కానీ నరేంద్రమోదీ మాత్రం ఏదైతే చెప్తారో.. అది చేయనేచేయరు’ అని రాహుల్ విమర్శించారు. ‘భవిష్యత్ కార్యాచరణ గురించి కానీ, యువతకు ఉద్యోగాల కల్పన గురించి కానీ, రైతులకు సాయం చేయడం గురించి కానీ పార్లమెంటులో ప్రధాని మోదీ మాట్లాడలేదు. గతం గురించి, కాంగ్రెస్ గురించి ఆయన గంటసేపు ప్రసంగించారు. ప్రధాని గారూ మీరు భవిష్యత్తు గురించి చెబితే.. దేశం వినాలనుకుంటోంది’ అని అన్నారు. -
మంత్రి అభిమానికి చేదు అనుభవం.. వైరల్
సాక్షి, బెంగళూరు: అభిమానం అంటూ తమకు నచ్చిన వ్యక్తులతో కష్టమైనా సరే ఓ సెల్ఫీ దిగుతామని ఫ్యాన్స్ యత్నిస్తుంటారు. కొన్ని పర్యాయాలు ఆ ప్రయత్నాలు వికటించడం జరగక మానదు. బెళ్లారిలో ఓ అభిమానికి ఇలాంటి చేదు అనుభవవమే ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం బెళ్లారికి వచ్చారు. ఆయనతో సెల్ఫీ దిగాలని ఓ అభిమాని ఆయనను చేరుకున్నాడు. చుట్టుపక్కలున్న పార్టీ నేతలు, కార్యకర్తలను దాటుకుంటూ మంత్రి శివకుమార్‌ను సమీపించాడు. వెంటనే తన మొబైల్ తీసి మంత్రితో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. ఇక అంతే ఒక్కసారిగా ఆవేశానికి లోనైన మంత్రి ఆ అభిమాని ఫోన్‌ను విసిరికొట్టేశారు. ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతయింది. మరో అభిమాని చేయి ముందుకు చాపగా షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు. మంత్రిగారు సెల్ఫీ దిగరు.. షేక్ హ్యాండ్ మాత్రమే ఇస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
మంత్రితో సెల్ఫీ దిగేందుకు వస్తే ఫోన్ విసిరికొట్టేశారు
-
విమాన ప్రయాణంలో ఎందుకీ వివక్ష?
సాక్షి, బళ్లారి: విమాన ప్రయాణాలు చేసేటప్పుడు తన పేరు యూటి ఖాదర్ అని చెబితే సిబ్బంది మరింతగా తనిఖీలు చేస్తున్నారని, ఈ వివక్ష ఎప్పుడు తొలగిపోతుందోనని కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి యూటి ఖాదర్ అన్నారు. ధార్వాడలో ఆదివారం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విమాన ప్రయాణ సమయాల్లో తన పేరు చెప్పేందుకు భయపడాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అర్థం కావడం లేదన్నారు. దీన్ని నుంచి బయటపడటం అంత సులభం కాదన్నారు. ముస్లిం ఉద్యోగులు కూడా తాము పనిచేసే సంస్థలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అయినా ఓపికతో ఎదుర్కొని మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లింలు తమ పిల్లలను విద్యావంతులను చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి పేదకూ బీపీఎల్ కార్డులు అందజేసేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. 8.5 లక్షల నకిలీ రేషన్‌కార్డులను గుర్తించి తొలగించామన్నారు. -
కొండముచ్చులతోనే ఆటాపాటా!
సాక్షి, బళ్లారి: సాధారణంగా కోతులు, కొండ ముచ్చులంటే అందరూ భయపడతారు.. అవి చేసే చేష్టలే అందుకు కారణం. అయితే, ఎలాంటి జంకుగొంకూ లేకుండా రోజూ కొండముచ్చులతో గంటల తరబడి ఆడుకుంటున్న ఓ బుడతడు ఇప్పుడు కర్ణాటకలోని ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకా అల్లాపురం గ్రామంలో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆ చిన్నారి వయస్సు కేవలం రెండున్నర ఏళ్లు మాత్రమే. పేరుకు తగ్గట్టే ఆ వానర మూకతో ‘సమర్థ’0గా బంధం ఏర్పర్చుకున్నాడు. వాటితో ఇట్టే కలిసిపోతాడు. అవికూడా అంతే. తన మేనమామ ఇంట్లో పెరుగుతున్న సమర్థకు ఇప్పుడు ఆ కొండముచ్చులంటే పంచ ప్రాణాలు. రోజూ రెండు గంటలపాటు వాటితోనే గడుపుతాడు. కొండముచ్చులు కూడా అందరూ ఆశ్చర్యపడే రీతిలో ఈ చిన్నారితో అలుపెరగకుండా కాలక్షేపం చేస్తాయి. రోజూ అతని ఇంటికి వచ్చి కాసేపు ఆడుకుని వెళ్తాయి. ఇలా సుమారు 20కి పైగా కొండముచ్చుల గుంపు.. సమర్థ మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఆర్నెల్ల క్రితం బంధానికి పునాది ఆరు నెలల క్రితం సమర్థ ఇంటిబయట నిలబడి రొట్టె తింటుండగా, అటుగా వచ్చిన కొండముచ్చుల గుంపు రొట్టెని లాక్కొని తుర్రుమన్నాయి. దీంతో ఆ బుడతడు ఇంట్లోకి పరుగుతీశాడు. కొద్దిసేపటికి ఇంకొక రొట్టె తీసుకువచ్చి వాటికి వేశాడు. అంతే, అప్పటి నుంచి వాటికి.. సమర్థకు మధ్య స్నేహం కుదిరింది. రోజూ వానర గుంపు ఉదయాన్నే రావడం.. అదే సమయానికి బాలుడు వాటి కోసం ఎదురుచూడటం మామూలైపోయింది. వాటిని చుట్టూ కూర్చొబెట్టుకుని ఆటలాడుతూ రొట్టెలు, ఇతరత్రా తినుబండారాలు పంచుతాడు. వాటితో కలసి డ్యాన్స్ చేయడం, ఆటలాడటం నిత్యకృత్యమైంది. బాలుడు తప్ప వేరెవరైనా దగ్గరకు వస్తే కొండముచ్చులు గుర్రుమంటాయి. ఒక్కోసారి సమర్థ బయటకు రాకపోతే కోతులే చొరవగా ఇంట్లోకి వెళ్లిపోతాయి. నీ దగ్గరకే మేం వచ్చాం స్నేహితుడా అనే సందేశం అందజేస్తాయి. ఇలా బాలుడు–కోతుల సఖ్యతను గ్రామస్తులు రోజూ ఆసక్తిగా తిలకిస్తుంటారు. కోతులంటే పంచ ప్రాణాలు సమర్థకు కోతులంటే పంచ ప్రాణాలు. తోటి స్నేహితులతో కూడా ఇంత హుషారుగా ఆడడు. కోతులే వాడికి స్నేహితులయ్యాయి. ఏదో జన్మలో వాటితో వాడికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది లేదా మరేదైనా మహిమ కావచ్చు. – మల్లికార్జునరెడ్డి, సమర్థ మేనమామ -
ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, బళ్లారి: జీవితాంతం కలిసి జీవించాలని పరస్పరం ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ ఫలించక పోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా మాకనడుకు గ్రామానికి చెందిన రేణుక(21), సండూరు తాలూకా మలెతుంబరగుద్ది గ్రామానికి చెందిన హులుగేష్(23)లు ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావించిన తరుణంలో యువతికి కుటుంబ సభ్యులు వేరొకరితో పెళ్లి నిశ్చితార్థం చేశారు. దీంతో మనస్థాపం చెందిన ఇద్దరు ప్రేమికులు చిక్కజోగిహళ్లిలోని చర్చి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయటంతో వెంటనే దావణగెరె జిల్లా జగళూరు ఆస్పత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. గత కొన్నేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో పాటు బంధువులు కూడా కావడం గమనార్హం. ప్రేమించుకున్న విషయం ఇంట్లో తెలపకపోవడం వల్ల అమ్మాయి తల్లిదండ్రులు వేరొకరితో వివాహ నిశ్చితార్థంచేసినట్లు బంధువులు పేర్కొన్నారు. ఈఘటనపై కూడ్లిగి తాలూకా కానాహొసళ్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
సంతాన లక్ష్మి
బళ్లారి రూరల్ (కర్ణాటక): q దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ అరుదైన ఘటనకు కర్ణాటకలోని బళ్లారిలోని ప్రభుత్వ విమ్స్ ఆసుపత్రి వేదికైంది. బళ్లారి జిల్లా కంప్లి సమీపంలోని ఎమ్మిగనూరుకు చెందిన బసవరాజు, హులిగమ్మ దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. హులిగమ్మకు మొదటి కాన్పులో మగశిశువు జన్మించాడు. మూడేళ్ల తరువాత హులిగమ్మ గర్భం దాల్చింది. గురువారం మధ్యాహ్నాం ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు విమ్స్‌లో చేర్పించారు. గైనకాలజిస్టులు డాక్టర్ రామరాజు, డాక్టర్ వారీజా, డాక్టర్ అనిరుద్ధ్, డాక్టర్ శ్వేతలు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ కాన్పు కష్టతరం కావడంతో అదేరోజు సాయంత్రం శస్త్రచికిత్స(సిజేరియన్) చేసి నలుగురు పిల్లలను వెలికి తీశారు. వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా హులిగమ్మ అత్త(భర్త తల్లి)కు 8 మంది సంతానం కాగా వారిలో ఇద్దరు కవలలు. వీరిలో ఒకరు మగ, ఒకరు ఆడ సంతానం. అలాగే బసవరాజు తాతకు కూడా ఇద్దరు కవలలు పుట్టారు. ప్రస్తుతం ఆ ఇంటి కోడలికి ఒకే కాన్పులో నలుగురు కవలలు జన్మించడం విశేషం. -
సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి..
- వెంకటరామిరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు –తన భార్యను వేధిస్తున్నాడని హతమార్చిన దుండగుడు –నిందితుడు రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ –ఆధారాలు బయటపడకుండా మరొకరి హత్య బళ్లారి : బళ్లారి నగరంలోని హవంబావిలో నివాసం ఉంటున్న ఏపీకి చెందిన పుల్లారెడ్డి తనయుడు వెంకటరామిరెడ్డి(42) హత్య కేసును బళ్లారి గ్రామీణ పోలీసులు ఛేదించారు. గత నెల 29న రాత్రి వెంకటరామిరెడ్డిని హత్యచేసి బైక్‌తో సహా తగలబెట్టిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసు మిస్టరీ వారం రోజుల వ్యవధిలోనే బళ్లారి పోలీసులు ఛేదించారు. ఆదివారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఆర్.చేతన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ‘బళ్లారి నగరంలో నివాసముంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిజర్వు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, మరొక వ్యక్తి జయరాం అలియాస్ అబ్రాలు కలసి వెంకటరామిరెడ్డిని హత్య చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డి వెంకటరామిరెడ్డికి సమీప బంధువు. బళ్లారిలో వివాహం చేసుకొని అనంతపురంలో రిజర్వ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారని తెలిపాడు. శ్రీనివాసరెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో సెక్యూరిటీ బెటాలియన్ పోలీసుగా బదిలీ కావడంతో బళ్లారిలో కాపురం పెట్టి విధి నిర్వహణకు హైదరాబాద్ వెళ్లి వచ్చేవాడు. శ్రీనివాసరెడ్డి భార్యను వెంకటరామిరెడ్డి తరచూ ఫోన్ చేసి వేధించేవాడు. దీంతో పథకం ప్రకారం వెంకటరామిరెడ్డిని శ్రీనివాసరెడ్డి జయరాంతో కలిసి హత్య చేశాడు.’ అని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి మరోవ్యక్తి హత్య ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పుట్లూరు చెందిన జయరాంకు, అదే గ్రామానికి చెందిన శేఖర్‌కు మంచి స్నేహం ఉండేది. వెంకటరామిరెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించిన శ్రీనివాసరెడ్డి కొత్త సిమ్ కార్డు తీసుకుని రావాలని జయరాంకు సూచించాడు. దీంతో శేఖర్‌కు చెందిన సిమ్‌కార్డు తీసుకుని జయరాం బళ్లారికి వచ్చి శ్రీనివాసరెడ్డికి ఇచ్చాడు. గత నెల 29వ తేదీన ఆ సిమ్‌కార్డుతో వెంకటరామిరెడ్డికి ఫోన్ చేసి పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచి, పీకలదాకా మద్యం తాగించి మాటా మాటా పెంచుకుని బీర్ బాటిల్‌తో దాడి చేసి హత్య చేశారు. ఆపై అతని బైక్‌పైనే శవాన్ని ఉంచి తగలబెట్టి పరారయ్యారు. శేఖర్ పేరిట నమోదైన సిమ్ కార్డు నుంచి వెంకటరామిరెడ్డికి ఫోన్ వెళ్లడంతో పోలీసుల విచారణలో నిజాలు వెల్లడవుతాయనే భయంతో సిమ్ ఇచ్చిన పాపానికి శేఖర్‌ను కూడా హత్య చేసి సాక్ష్యాలు దొరకకుండా శవాన్ని కాల్చి వేశారు. నిందితుల అరెస్ట్‌తో ఈ రెండు హత్య కేసుల మిస్టరీ వీడింది. -
తవ్వేకొద్దీ నాణేలే
► కొట్టూరులో 90 కేజీలకు చేరిన పురాతన నాణేలు ► జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వైనం బళ్లారి: ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో హంపీలో అమూల్యమైన మణులు-వజ్ర వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతోంది. హంపీకి దగ్గరలోనే ఉన్న కొట్టూరు పట్టణంలో పాతకాలం నాణేలు కుప్పలు కుప్పలుగా బయటపడుతుండడం అంతటా ఆసక్తికరంగా మారింది. ఈ నెల 24న శ్రీకొట్టూరేశ్వరస్వామి మఠం సమీపంలోని గిరిజమ్మ అనే మహిళకు చెందిన పురాతన ఇంటిని పడగొట్టి కొత్త ఇంటి కోసం పునాదులు తవ్వుతుండగా సుమారు 25 కేజీల పురాతన నాణేలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే శని, ఆదివారాలు కూడా పాత ఇంటిని కూల్చుతుండగా పెద్ద సంఖ్యలో పురాతన నాణేల నిధి వెలుగుచూసింది. ప్రస్తుతం 90 కేజీల వరకు పురాతన నాణేలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్, సీఐ తనిఖీ తహసీల్దార్ కృష్ణమూర్తి, కొట్టూరు సీఐ రాజానాయక్ ఘటనాస్థలంలో పురాతన నాణేలను పరిశీలిస్తున్నారు. నాణేలను తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. 1915–20వ సంవత్సరానికి చెందిన కాలంలో బ్రిటిషప్రభుత్వం ముద్రించినవిగా అధికారులు తెలిపారు. నాణేలపైన కింగ్ జార్జ్- ఫోర్త్ అనే అక్షరాలతో పాటు బ్రిటన్ రాజు చిత్రం ఉంది. వాటిపై అణా పైసలు, దమ్మిడీలు అనే పదాలు కన్పిస్తున్నాయి. ఆ ఇంటి పూర్వీకులే గోడలు, పునాదుల్లో దాచి ఉంటారని భావిస్తున్నారు. తవ్వకాలు జరిగేకొద్దీ మరిన్ని నాణేలు బయటపడవచ్చని చెబుతుననారు. -
బళ్లారి జిల్లా వాసి ఆత్మహత్య
మంత్రాలయం రూరల్: బళ్లారి జిల్లా కుడితిని గ్రామానికి చెందిన కమ్మరి గోవిందప్ప కుమారుడు కమ్మరి సురేష్ మారుతీ లాడ్జ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాల మేరకు..సురేష్ రెండ్రోజులు క్రితం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చాడు. మారుతి లాడ్జ్‌లో దిగి రూం నెంబరు 15లో బస చేశాడు. శనివారం ఉదయం అద్దె డబ్బుల కోసం వెళ్లిన రూంబాయ్ గదిలోనుంచి దుర్వాసన వస్తుండడంతో తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే కమ్మరి సురేష్(27) మరణించి ఉన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
గ్రామాల అభివృద్ధితోనే దేశ పురోగతి
బళ్లారి అర్బన్ : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) వైస్ చాన్సిలర్ ఎంఎస్ సుభాష్ పేర్కొన్నారు. మంగళవా రం ఆయన బళ్లారి తాలూకాలోని హందిహాళ్ గ్రామంలో శివప్ప తాత మఠంలో వీఎస్కేయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వర్సిటీ నుంచి ప్రభుత్వానికి లేఖ రాసి హందిహాళ్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చే స్తామని పేర్కొన్నారు. గ్రామంలోని లోటు పాట్లను సర్వే చేసి ప్రభుత్వ సహకారంతో యూనివర్శిటీ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. పీఆర్ఏ, పీఎంఏ నేతృత్వంలో విసృ్తతంగా సమాచారాన్ని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో హందీహాళ్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం జిల్లా పంచాయతీ సీఈఓ డాక్టర్ రాజేంద్ర కేవీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యూనివర్శిటీ వారు గ్రామాన్ని దత్తత తీసుకోవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వీఎస్కేయూ ప్రొఫెసర్ టీఎం భాస్కర్, ప్రొఫెసర్ ఎస్ఏ పాటిల్, పీడబ్ల్యూడీ రిటైర్డ్ అధికారి వైఎల్ కృష్ణారెడ్డి, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శాంతమ్మ, డాక్టర్ గౌరీ, టీపీ ఉపాధ్యక్షుడు మల్లికార్జున, ఉపాధ్యక్షురాలు ప్రభావతి, మంజునాధ స్వామి, వెంకటేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సెక్యూరిటీ గార్డు దారుణహత్య
బళ్లారి అర్బన్ : స్థానిక బ్రూస్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సెక్యూరిటీ గార్డ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం 5 గంటల మధ్యలో గుర్తు తెలియని దుండగులు సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి హతమార్చినట్లు బ్రూస్‌పేట్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ దొడ్డి తెలిపారు. స్థానిక ఇందిరానగర్‌లో నివాసముంటున్న వెంకటేశ్(54) రాఘవేంద్ర థియేటర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బ్రూస్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
కుమార్తె వివాహానికి ’గాలి’ ఆహ్వానం
బళ్లారి : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి బళ్లారి లో ప్రముఖుల ఇంటింటికీ వెళ్లి తన కుమార్తె బ్రహ్మణీ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఐదేళ్ల అనంతరం ఆయన ఈనెల 1న బళ్లారికి విచ్చేశారు. కుమార్తె వివాహానికి 21 రోజుల పాటు ప్రస్తుతం బళ్లారిలో ఉండేందుకు గాలి జనార్దనరెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. రెండు రోజుల నుంచి ఆయన బళ్లారి నగరంలో పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పెళ్లికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈనెల 16న బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో వివాహం జరుగుతుంది. నగరంలోని పలువురు ప్రముఖ డాక్టర్లతో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగనగౌడ, బీజేపీ నాయకులు తిమ్మారెడ్డి, ప్రముఖులకు ఇళ్లకు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. పెళ్లికి సంబంధించి వినూత్న తరహాలో పత్రిక ఉండటంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
అపూర్వ స్వాగతం
ఐదేళ్ల అనంతరం బళ్లారికి గాలి జనార్దనరెడ్డి దారి పొడవునా కిక్కిరిసిన జనం బళ్లారి : రాష్ర్ట మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి బళ్లారి జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. ఐదేళ్ల తర్వాత ఆయన మంగళవారం బళ్లారికి విచ్చేయడంతో జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా వచ్చిన ఆయనకు హగరి వద్ద వేలాదిగా తరలివచ్చిన జనం భారీ పూలమాలలు వేస్తూ స్వాగతం పలికారు. హగరి నుంచి అమరాపురం, కక్కబేవినహళ్లి, బేవినహళ్లి, బిసిలహళ్లి మీదుగా బళ్లారి వరకు దారి పొడవునా ప్రజలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుతూ తమ అభిమాన నాయకుడికి కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో హగరి-బళ్లారి మధ్య ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టాప్ లేని వాహనంపై జనార్దన్‌రెడ్డి నిలబడి దాడి పొడవునా అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. నగరంలోని శ్రీకనకదుర్గమ్మ దేవాలయంలో గాలి పూజలు నిర్వహించిన అనంతరం వాల్మీకి, భువనేశ్వరి దేవి విగ్రహాలకు పూజలు నిర్వహించిన అనంతరం హవంబావిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ... తన ఊపిరి ఉన్నంత వరకు బళ్లారి జిల్లా ప్రజల సేవకే అం కితమవుతాయని అన్నారు. ఎంపీ బీ.శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, బళ్లారి మాజీ ఎంపీ శాంత, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ ఇబ్రహీం బాబు, మాజీ ఉప మేయర్ శశికళ, పలువురు కార్పొరేటర్లు, జిల్లా పంచాయతీ మెంబర్లు, బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగనగౌడ, బళ్లారి జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు. -
‘గాలి’ బళ్లారి వెళ్లేందుకు అనుమతి
సాక్షి, బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి నవంబర్ 1 నుంచి 21 వరకు బళ్లారికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. గనుల కేసులో జైలుకు వెళ్లిన గాలి జనార్దనరెడ్డికి 2015 జూన్ 20న బెయిల్ లభించడం తెలిసిందే. అయితే.. ఆయన బళ్లారి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలకు వెళ్లేందుకు మాత్రం ఆంక్షలు విధించింది. దీంతోఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. కాగా.. ఆయన కుమార్తె బ్రహ్మణి వివాహం హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్తతో నవంబర్ 16న జరగనుంది. కుమార్తె పెళ్లి ఏర్పాట్లు చూసుకునేందుకు బళ్లారికి వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు ఏకే సిక్రీ, ఎన్వీ రమణ నవంబర్ 1 నుంచి 21వ తేదీ వరకు గాలి జనార్దనరెడ్డి బళ్లారిలో ఉండొచ్చని తీర్పు ఇచ్చారు. -
అనుపమ రాజీనామా రద్దు చేయాలి
మంత్రి పరమేశ్వర నాయక్ రాజీనామా చేయాలి బళ్లారి : బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామాను పోలీసు ఉన్నతాధికారులు ఆమోదించడంతో బళ్లారి జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 4వ తేదీన కూడ్లిగి డీఎస్పీ అనుపమ షణై రాజీనామా చేసి నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి గురువారం కూడ్లిగిలోని తన నివాస గృహానికి చేరుకుని ఆమె రాజీనామా ఉపసంహరించేది లేదని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం రాత్రి కల్లా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు అనుపమ రాజీనామాను అమోదించారు. ఈ నేపథ్యంలో బళ్లారి జిల్లాలో సండూరు పట్టణంలో జన సంగ్రామ పరిషత్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. అనుపమ షణై రాజీనామా వెనుక ప్రధాన కారణమైన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కూడ్లిగి డీఎస్పీగా పని చేసిన అనుపమ షణై ఎంతో నిజాయితీ పరురాలని పేర్కొన్నారు. మద్యం వ్యాపారులు, మంత్రి వల్ల ఎంతో మనస్థాపం చెందిన అనుపమ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఆమె రాజీనామాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సండూరులో జన సంగ్రామ సమితి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ స్థానిక ఏపీఎంసీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ధర్నాలో మహిళలు, వృద్దులు కూడా పాల్గొని ఆమెకు మద్దతుగా నిలిచారు. అనుపమ విధుల్లో చేరే విధంగా పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయాలని వారు డిమాండ్ చేశారు. -
బళ్లారిలో పర్యటించిన స్వాజీలాండ్ ప్రధాని
భారత దేశ పర్యటనలో భాగంగా ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశం స్వాజీలాండ్‌కు చెందిన ప్రధానమంత్రి బర్నబాస్ సిబూసిసోద్లామిని బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పర్యటించారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన 10 గంటలకు బళ్లారి జిల్లా తోరణగల్లు జిందాల్ విమానాశ్రయం చేరుకున్నారు. జిందాల్ సీఈఓ డాక్టర్ వినోద్ నావెల్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలందించి ఘనంగా స్వాగతం పలికారు. ఆ దేశ ఆర్థిక, ప్రణాళికాభివృద్ధి శాఖ మంత్రి ప్రిన్స్ లాంగ్ సెంపీ గ్లామిని, వ్యవసాయశాఖ మంత్రి మోసస్ మాలిండేన్ మిలాకటి, సెనేటర్ జెబులిలా మషోమా తదితర మంత్రులు ఆయన వెంట ఉన్నారు. అనంతరం బర్నబాస్ సిబూసిసోద్లామిని జిందాల్ ఆవరణంలోని కళాధామం సందర్శించారు. హంపికి సంబంధించిన చిత్రాలను, వాటి అందాలను వీడియో క్యాసెట్లను తిలకించారు. -
పట్టపగలే చైన్ స్నాచింగ్‌లు
13 తులాల బంగారు గొలుసులు అపహరణ పోలీసులమని నమ్మించి బంగారు గొలుసులు లాక్కొన్న వైనం భయాందోళనలో మహిళలు బళ్లారి : బళ్లారి నగరంలో పట్టపగలే, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో మహిళల మెడలో బంగారు ఆభరణాలను లాక్కెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో నగరంలోని పార్వతీనగర్, నెహ్రు కాలనీల్లో ఏకకాలంలో ఇద్దరు మహిళల మెడలలోని గొలుసులను చాకచక్యంగా దోచుకెళ్లారు. నగరంలోని ప్రగతి కృష్ణా గ్రామీణ బ్యాంకు ఎదురుగా నెహ్రుకాలనీలో పార్వతమ్మ అనే మహిళ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆగి తాము పోలీసులమని నమ్మించి, నగరంలో చోరీలు జరుగుతున్నాయని, బంగారు ఆభరణాలను ఎందుకు వేసుకుని తిరుగుతారని హెచ్చరిస్తూనే ఆమె మెడలోని బంగారు ఆభరణాలను చాకచక్యంగా లాక్కొని పరారయ్యారు. ఆమె గట్టిగా ఆరిచేలోపు దొంగలు ద్విచక్ర వాహనంలో పరారయ్యారు. అదే సమయంలో నగరంలో పార్వతీనగర్‌లోని టీవీఎస్ షోరూం సమీపంలో సిద్దమ్మ అనే మహిళపై ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యారు. ఈ విషయం తెలిసిన జిల్లా ఎస్పీ ఆర్.చేతన్, ఏఎస్పీ, డీఎస్పీ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుల వద్ద వివరాలు సేకరించారు. ఈ ఘటనలపై గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగర మహిళల్లో ఆందోళన : బళ్లారి నగరంలో పట్టపగలే మహిళల మెడలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లుతుండటంతో మహిళలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. నగరంలో ఇటీవల మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దోచుకెళుతున్న సంఘటనలు పదే పదే చోటు చేసుకుంటుండటంతో నగర ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పోలీసులకు కూడా దొంగలు సవాల్ విసురుతూ తమ పని తాము చేసుకుని వెళుతున్నారు. అసలే భగభగ మండుతున్న ఎండలకు రాత్రిళ్లు ఇళ్ల లోపల పడుకునేందుకు చేతకాకపోవడంతో ఇంటి బయట, మిద్దెలపైన కొందరు నిద్రిస్తున్నారు. దీంతో ఇప్పటికే బళ్లారి నగరంలోని ఏదో ఒక కాలనీలో ప్రతి రోజు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో దొంగతనాలను ఆరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రేమికుల బలవన్మరణం
బళ్లారి (తోరణగల్లు) : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని పురుగుల మందు తాగి ప్రేమికులు బలవన్మరణం పొందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పీడీహళ్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని దేవీనగర్‌కు చెందిన ప్రవీణ్(21)డిప్లమో పూర్తి చేసి సీసీ కెమేరాలు అమర్చే షాపులో పని చేస్తున్నాడు. వీవీ సంఘం కళాశాలలో డిప్లమో ఫ్యాషన్ డిజైనింగ్ బ్రాంచ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన ప్రియాంక(18)ను ప్రేమించాడు. గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని చేళ్లగుర్కి వద్ద గల రూపనగుడి రోడ్డులోకి చేరుకుని సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగారు. పురుగుల మందు ప్రభావంతో ప్రవీణ్ వెంటనే మృతిచెందాడు. ప్రియాంక అస్వస్థతకు గురైంది. స్థానికులు గమనించి విమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ ప్రియాంక కూడా సోమవారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటనపై పీడీ హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రియుడుతో గొడవ... ప్రియురాలి బలవన్మరణం బెంగళూరు(బనశంకరి) : ప్రియుడితో గొడవపడిన ఇంజనీరింగ్ విద్యార్థిని నాలుగు అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహదేవపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ... బి.నారాయణపుర కు చెందిన నేహా (22) ఇక్కడి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతోంది. ఇటీవల ఈమె తల్లి మృతి చెందడంతో ఇంటిలో ఉంటోంది. నేహా స్నేహితుడు విఘ్నేష్‌ను ప్రేమిస్తోంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో నేహా సోమవారం రాత్రి విఘ్నేష్ నివాసముంటున్న డీఆర్డీఓ క్వార్టర్‌కు వెళ్లి అతనితో గొడవపడి పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహదేవపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.18 లక్షల నగదు పట్టివేత
నగదు సీజ్ చేసిన పోలీసులు బళ్లారి : బళ్లారి తాలూకా ఎత్తినబూదిహాల్ చెక్‌పోస్టు వద్ద మోటార్ బైక్ మీద ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.18 లక్షలు తీసుకుని వస్తుండటంతో పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కణేకల్లు నుంచి బళ్లారికి ద్విచక్ర వాహనంలో భారీ ఎత్తున నగదు తెస్తున్న రెహమాన్, యాకూబ్ అనే ఇద్దరు వ్యక్తులను ఎత్తినబూదిహాల్ చెక్‌పోస్టు వద్ద గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. బళ్లారి రూరల్ ఎస్ఐ చందన్ నేతృత్వంలో చెక్‌పోస్టు వద్ద పహారా కాస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తుండగా తనిఖీ చేశారు. అందులో నగదు బయటపడినట్లు రూరల్ డీఎస్పీ సురేష్ తెలిపారు. బళ్లారి జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికల సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకుని రావడం నేరమని, దీంతో రూ.18 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. డబ్బులు సీజ్ చేసి నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా జైలు సూపరింటెండెంట్ భీం శేఖర్, ఆయన భార్య రేఖ(35) ఇద్దరు పిల్లలతోపాటు కానిస్టేబుల్ పురుషోత్తం బళ్లారి వైపు కారులో వెళ్తున్నారు. వారి వాహనాన్ని డి.హీరేహళ్ వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో రేఖ, పురుషోత్తం అక్కడికక్కడే చనిపోగా, భీంశేఖర్ ఆయన ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బళ్లారిలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ.500 నోటును ఐదు రోజులు కాపాడుకుంటున్నారు!
బెంగళూరు : ఒకప్పుడు వెయ్యి రూపాయల నోటును ఓ గంటలో ఖర్చు చేసిన నగర వాసులకు నేడు రూ.500లు ఖర్చు చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.500ల నోటును ఐదు రోజులు కాపాడుకుంటున్నారు. గత మూడు నాలుగేళ్ల క్రితం బళ్లారిలో ఐదేళ్ల పాటు మైనింగ్ ప్రభావం ఓ మెరుపు మెరిసింది. దీంతో కర్ణాటక బళ్లారి జిల్లా వాసులు రోజూ వేలాది రూపాయలు నీళ్లలా ఖర్చు చేశారు. ఒకప్పుడు ఐశ్వర్యవంతులుగా జీవించిన వారంతా పైకం కరువుతో కంగు తింటున్నారు. ఈరోజు ఎలాగో గడిచింది, రేపటి పరిస్థితి ఏమిటని ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మైనింగ్ ప్రభావంతో చిన్నా చితక వ్యాపారాలతో పారిశ్రామిక వేత్తలకు కూడా వ్యాపారాలు బాగానే ఊపందుకున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, గృహోపకరణాలు పెద్ద పెద్ద గార్మెంట్ కంపెనీల దుకాణాలు వచ్చిపడ్డాయి. అయితే ఈ వ్యాపారాలు బళ్లారిలో స్థిరంగా ఉంటాయని భావించి తమ తమ దుకాణాలను ఎంతో అందచందాలతో తీర్చిదిద్దారు. కానీ నేడు వారికి జరుగుతున్న వ్యాపారాలు అద్దెకు కూడా సరిపోవటం లేదు. స్థానిక ఇన్ఫ్యాంట్రీ రోడ్డులో దుర్గమ్మ దేవాలయం నుంచి సుధాక్రాస్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా ఇలాంటి దుకాణాలు ఎన్నో నెలకొన్నాయి. ప్రస్తుతం దుకాణాలను నడపాలా లేక బంద్ చేసుకోవాలా అనే సందిగ్ధంలో పలు కంపెనీల వ్యాపారులు ఉన్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగం కార్యకలాపాలు కూడా పూర్తిగా స్తంభించి పోయాయి. కానీ బార్లు, పలు రెస్టారెంట్లు మాత్రం గుడ్డి కన్నా మెల్ల మేలన్నట్టుగా నడుస్తున్నాయి. ఇటీవల బార్లు, రెస్టారెంట్లలో ఖరీదు ఎక్కువ కావడంతో మద్యం ప్రియులు ఫుట్‌పాత్ తినుబండారాలు తీసుకుని, బీడు పడిన లేఔట్లు, ఖాళీగా ఉన్న రోడ్ల పక్కన, భవనాలను ఆశ్రయిస్తూ ఉన్నదాంట్లో సర్దుకుపోతున్నారు. ఏది ఏమైనా ఒకనాడు విలాస జీవనాలు సాగించిన బళ్లారి నగర వాసులకు నేడు మళ్లీ ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లయింది. -
'బళ్లారి వెళ్తా, అనుమతి ఇవ్వండి'
న్యూఢిల్లీ: బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడి ఉన్న ఆయనకు జనవరిలో షరతులతో కూడిన బెయిల్ లభించింది. పాస్‌పోర్టును సీబీఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, అనంతపురం, కడప, బళ్లారికి వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడం కానీ సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఐదు షరతులు విధించారు. మూడేళ్ల నాలుగు నెలల పాటు జైళ్లో గడిపిన తర్వాత ఆయన విడుదలయ్యారు. -
బళ్లారిలో కుండపోత
బళ్లారి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి కుండపోతలా భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అరటి తోటలు చెరువులను తలపించాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పదుల సంఖ్యలో మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. పొలాల వద్ద చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం ద్వారా రక్షించారు. సిరుగుప్ప తాలుకాలో ఆర్టీసీ బస్సు వంతెన దాటుతుండగా అదుపు తప్పి వాగులోకి ఒరిగిపోయింది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. జిల్లా వ్యాప్తంగా 78.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -సాక్షి, బళ్లారి -
ఇరు వర్గాల ఘర్షణ... ఇద్దరిపై కాల్పులు
ముగ్గురికి తీవ్ర గాయాలు ఉలిక్కి పడిన బళ్లారి సమగ్ర తనిఖీకి రెండు పోలీసు బృందాలు-ఎస్పీ బళ్లారి: బళ్లారి నగరంలోని హవంబావి ప్రాంతంలోని రామనగర్ హెచ్ఎల్సీ కాలువ వద్ద రెండు గ్రూపుల మధ్య చిన్నపాటి ఘర్షణకు పిస్తోల్‌తో కాల్పులు జరగడంతో బళ్లారి నగరానికి చెందిన రాజేష్, ఉపేంద్ర అనే యువకులకు తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి నగరంలో అందరూ నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో నగరంలో జరిగిన కాల్పుల శబ్ధం బళ్లారి వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఘర్షణలో కాల్పులు జరుపుకుని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయని తెలియగానే కాల్పుల బీభత్సం నగర వాసులను ఆందోళనకు గురి చేసింది. కాల్పులు జరిగింది నిజం, అయితే గన్ తమది కాదని ఘర్షణలో గాయపడిన వ్యక్తులు పేర్కొంటుండటంతో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారి నగరానికి చెందిన రాజేష్ అనే యువకుడు ద్విచక్ర వాహనంలో ఆదివారం రాత్రి నగరంలోని హవంబావి సమీపంలోని రామనగర్ వద్దకు వెళ్లగా హెచ్ఎల్సీ కాలువ పక్కనే ఉన్న ఒరిస్సాకు చెందిన తరుణ్‌కుమార్‌కు చెందిన వాటర్ ప్లాంటు ముందు ద్విచక్ర వాహనం కింద పడింది. వెంటనే వాటర్ ప్లాంటులో పని చేస్తున్న యువకులు బైక్‌ను పైకి లేపడానికి ప్రయత్నించారు.పడిపోయిన ద్విచక్రవాహనాన్ని పైకిలేపుతున్న సమయంలో వాటర్ ప్లాంటులో పని చేస్తున్న యువకులకు, రాజేష్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. వాటర్ ప్లాంటు యజమాని తరుణ్‌కుమార్ కూడా రాజేష్‌ను గాయపరిచారు. వెంటనే రాజేష్ తన స్నేహితుడు ఉపేంద్రకు ఫోన్ చేయగా, అతడు తన స్నేహితులతో కలిసి వచ్చి ఘర్షణకు దిగారు. వాటర్ ప్లాంటు యజమాని తరుణ్‌కుమార్‌కు కూడా బాగా దెబ్బలు తగిలాయి. ఇంతలోనే ఫైరింగ్ జరిగింది. ఈ ఫైరింగ్‌లో ఉపేంద్ర, రాజేష్లపైకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. బుల్లెట్ల శబ్దం రావడంతో అక్కడ ఉన్న వారంతా పరారయ్యారు. హవంబావి వద్ద కాల్పులు జరిగాయని తెలియగానే జిల్లా ఎస్పీ చేతన్, ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అప్పటికే అక్కడ రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు కనిపించింది. బుల్లెట్ దూసుకెళ్లడంతో రక్తం అక్కడ పెద్ద ఎత్తున ప్రవహించింది. ఈ ఘర్షణలో ఉపేంద్ర, రాజేష్‌లపై వాటర్ ప్లాంట్‌కు చెందిన వారు ఫైరింగ్ చేసినట్లు గాయపడిన వర్గం ఆరోపిస్తోంది. అయితే పిస్తోల్ తన వద్ద లేదని తరుణ్‌కు కుమార్ పోలీసుల వద్ద పేర్కొనడంతో మరి కాల్పులు ఎవరు జరిపారనే విషయం దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఘర్షణలో ఉపేంద్ర, రాజేష్‌లకు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక విమ్స్ ఆస్పత్రికి తరలించారు. రాజేష్, ఉపేంద్ర తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి ఘర్షణకు కాల్పులు జరిగాయని కంటతపడి పెట్టారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేపట్టాలని కోరారు. ఘర్షణలో కాల్పులు జరిపింది తరుణ్‌కుమార్ అయి ఉండవచ్చునని గాయపడిన వారి బంధువులు పేర్కొంటున్నారు. అయితే తన వద్ద పిస్తోల్ లేదని తరుణ్‌కుమార్ వాదిస్తున్నారు. అయితే ఈ గన్ ఎవరిది...కాల్పులు ఎవరు జరపారనే అంశంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చేతన్ తెలిపారు. బళ్లారి గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకాష్ నాయక్ హత్య కేసులో మరోనలుగురి అరెస్ట్
బళ్లారి టౌన్ : బళ్లారి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 2వ తేదీన బెళగల్లు తండాకు చెందిన ఆకాష్ నాయక్ హత్య కేసులో మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఆర్.చేతన్ తెలిపారు. ఆయన సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులలో ఇప్పటికే ఆరుగురిని ఈనెల 15న అరెస్ట్ చేయగా, సోమవారం మిగతా నిందితులు రమేశ్‌నాయక్, మంజునాథ్, గోపాలనాయక్, సందీప్‌లను అరెస్ట్ చేశామన్నారు. ఈకేసు మిస్టరీని చేధించగా బెళగల్లు తాండాకు చెందిన మాజీ జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షురాలు సవితాబాయి భర్త హీరా నాయక్‌ను అప్పు ఇవ్వలేదనే కారణంగా 2012లో రమేశ్ నాయక్, మంజు నాయక్ ఇతరులు కలిసి హత్య చేశారని, ఈ కేసులో రమేశ్ నాయక్ ఇంతవరకు తప్పించుకుని తిరిగాడన్నారు. అనంతరం ఇదే ద్వేషంతో హీరానాయక్ వర్గం వారు ఆకాష్ నాయక్, అజయ్, ఉమేశ్, ఏసు, బండిహట్టి నాగ తదితరులు కలిసి 2014 మార్చి 14 రమేశ్ నాయక్ తమ్ముడు రవినాయక్ అలియాస్ రవిని హత్య చేశారన్నారు. దీనిపై 2014లో నిందితులను బంధించి కోర్టు కస్టడీకి అప్పగించామన్నారు. అనంతరం సీడీ రవి హత్యకేసులో నిందితులు జామీనుపై బయటకు వచ్చారన్నారు. పాత కక్షల కారణంగా ఈనెల 2న ఆకాష్ నాయక్‌ని హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విజయ్ రాంబాబు, డీఎస్పీ టీవీ.సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల వలయంలో విమ్స్
బళ్లారి, కొప్పళ ఆస్పత్రులకు ఒక్కరే డెరైక్టర్ ఇన్చార్జిలతో కాలం నెట్టుకొస్తున్న పాలకులు అవస్థలు పడుతున్న రోగులు బళ్లారి: బళ్లారి జిల్లాతోపాటు కొప్పళ, రాయచూరు, చిత్రదుర్గం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించే విమ్స్ ఆస్పత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జనానికి జబ్బు చేస్తే ఆస్పత్రికి వె ళ్లి చికిత్సలు చేయించుకుని బాగు చేయించుకుంటారు. అయితే జనానికి వైద్యం చేసే ప్రధాన ఆస్పత్రి అయిన విమ్స్‌కు జబ్బు చేయడం రోగులకు శాపంగా మారింది. బళ్లారి నగరంలోని 1000 పడకల అతిపెద్ద ఆస్పత్రిలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. విమ్స్ డెరైక్టర్ రెండు ప్రధాన ఆస్పత్రులకు డెరైక్టర్‌గా వ్యవహరిస్తుండడంతో సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. కొప్పళలో ప్రభుత్వ ఆస్పత్రిలో డెరైక్టర్‌గా పని చేసే శ్రీనివాస్‌ను ఆరు నెలల క్రితం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి డెరైక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే కొప్పళకు కొత్త డెరైక్టర్‌ను నియమించకుండా, అక్కడి బాధ్యతలను కూడా శ్రీనివాస్‌కు అప్పగించింది. ఆరు నెలలు దాటినా కొప్పళకు డెరైక్టర్‌గా ఎవరినీ నియమించలేదు. రెండు ఆస్పత్రులకు శ్రీనివాస్ డెరైక్టర్‌గా పని చేస్తున్నారు. దీంతో రెండింటికి న్యాయం చేయలేకపోతున్నారు. బళ్లారి విమ్స్ ఆస్పత్రిలో సర్జరీ, మెడిసన్, ఓబీజీ, ఆర్థో, ఈఎన్టీ, స్కిన్, రేడియాలజీ, చిల్డ్రన్స్, యూరాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే 20కి పైగా వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అం దులో ఒ క్కొక్క డిపార్ట్మెంటు కు ఒక్కొక్కరు ఇన్ చార్జిలుగా వైద్యులు ఉంటారు. వారి నేతృత్వంలో ఒక్కొక్క డిపార్ట్మెంటులో మరో 10 మందికి పైగా వైద్యులు పని చేస్తుంటారు. ఇలా వందలాది మంది వైద్యులు పని చే సే ప్రధాన ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. ఇంత పెద్దాస్పత్రిని పర్యవేక్షించే డెరైక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకు పోతున్నట్లు వైద్యులు ఆరోపిస్తున్నారు. రెండు ప్రధాన ఆస్పత్రుల్లో సంతకాలు పెట్టడానికే ఆయనకు సమయం సరిపోతుండడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రిలో సమస్యలు రోజురోజుకూ జఠిలమవుతున్నాయి. సంబంధిత వైద్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులు విమ్స్ ఆస్పత్రిలో సమస్యల గురించి పట్టించుకునే కనీస ఆలోచన చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమ్స్ ఆస్పత్రిలో మంచినీటి సమస్యతోపాటు పారిశుధ్య సమ స్య పట్టిపీడిస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వార్డును సక్రమంగా శుభ్రం చేయడం లేదని రోగులు పేర్కొన్నారు. మరోవైపు మందుల కొరత వేధిస్తోంది. వీటితో పా టు ఆస్పత్రిలో పని చేసే వైద్యులకు కూడా సక్రమంగా జీతాలు అందించడం లేదు. వీటితో పాటు ప్రిన్సిపాల్, సీఈఓ వంటి ప్రధాన పోస్టులకు సంబంధించిన వైద్యులు కూడా ఇన్ చార్జిలే పని చేస్తున్నారు. పూర్తిస్థాయి బాధ్య తలు అప్పగించక పోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లా ఇన్ చార్జి మంత్రికి ఆస్పత్రి లో సమస్యలు పరిష్కరించడానికి కాదు కదా కనీసం ఆస్పత్రిని విజిట్ చేయడానికి కూడా తీరిక లేదేమో అని పలువురు విమర్శిస్తున్నా రు. విమ్స్ ఆస్పత్రి పరిధిలోకి వచ్చే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, దంత ఆస్పత్రి పనులు పూర్తి కాలేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి, దంత ఆస్పత్రికి నిధుల కొరత వేధిస్తుండడంతో మూ డు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెన క్కి వెళుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వి మ్స్ ఆస్పత్రిలో అడుగడుగునా సమస్యలు రా జ్యమేలుతున్నాయి. ఇకనైనా సంబంధిత మం త్రి ప్రత్యేక దృష్టి పెట్టి ఆస్పత్రిలో సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బళ్లారిలో బసవ జయంతి
-
ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు
బళ్లారి నగరంలోని మహావీర జయంతిని పురష్కరించుకుని ఆయా జైనుల ఆలయాలలో మహావీర్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం తేరువీధిలోని జైనుల ఆలయంలో జైనులు, మార్వాడీలు మహావీర్ విగ్రహానికి వివిధ ధార్మిక పూజలు నిర్వహించారు. అలాగే కౌల్‌బజార్‌లోని జైనుల ఆలయం, సత్యానారాయణపేట్ జైనుల ఆలయం, మోతీ సర్కిల్ జైనుల మార్కెట్లో తదితర జైనుల ఆలయాలలో మహావీర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సంఘం సంస్థల నేతలు కూడా జైనుల చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించి మహావీరుని తత్వాలు, సిద్ధాంతాలు, శాంతి సందేశాలను వివరించి మహావీర్ విగ్రహాన్ని నగర పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. బళ్లారి అర్బన్: -
నేడు బళ్లారి మేయర్, ఉపమేయర్ ఎన్నిక
బళ్లారి : బళ్లారి మహానగర పాలికె మేయర్, ఉపమేయర్ ఎన్నిక శనివారం జరగనుంది. రెండవ అవధి కింద మేయర్ పదవిని ఎస్టీ వర్గానికి రిజర్వు చేయడంతో ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు కుమార స్వామి, నాగమ్మ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు మెజారిటీ సభ్యులున్నప్పటికీ రెండు వర్గాలుగా విడిపోయి సూచనలు ఉన్నాయి. దీంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తమయ్యారు. మేయర్ పదవి కోసం కుమారస్వామి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకు కొందరు కార్పొరేటర్లు ముమ్మర కృషి చేస్తున్నారు. దీంతో మాజీ మంత్రులు దివాకర్ బాబు, అల్లం వీరభద్రప్ప, మాజీ ఎంపీ కె.సి.కొండయ్య మేయర్ ఏకగ్రీవ ఎన్నికకు కార్పొరేటర్లను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు కార్పొరేటర్లు కుమారస్వామికి, మరికొందరు నాగమ్మకు మద్దతు ఇవ్వాలని బయటపడుతుండడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో విపక్ష వర్గానికి చెందిన ఎంపీ శ్రీరాములు శిబిరంలో ఆరుగురు కార్పొరేటర్లు ఉండడంతో వారిపై ఓ వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి స్వగృహంలో శ్రీరాములు నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన నేపథ్యంలో తాము ఏ వర్గానికి మద్దతు ఇవ్వరాదని శ్రీరాములు వర్గానికి చెందిన కార్పొరేటర్లు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఎవరిని మేయర్‌గా ఎన్నుకున్నా తమకు అభ్యంతరం లేదని, ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చొబెట్టిన నేపథ్యంలో ప్రజల అభీష్టం మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఇది ఇలా ఉండగా బళ్లారి నగర మేయర్ స్థానంపై కాంగ్రెస్ గ్రూపుల మధ్య విభేదాలు వేడెక్కాయి. -
ఉత్సాహంగా బాలల పండుగ
బళ్లారి టౌన్: నగరంలోని జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో బుధవారం ధార్వాడ కర్ణాటక బాలవికాస అకాడమీ, బళ్లారి జిల్లా పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మక్కళ హబ్బ(బాలల పం డుగ) కార్యక్రమం ఆకట్టుకుంది. జిల్లాలోని తాలూకాకు రెండు బృందాల చొప్పున ఏడు తాలూకాల్లో ఆయా పాఠశాలల వి ద్యార్థులు జానపద కళలకు నృత్యం చేశారు. బాలికలు, బా లుర డోలు నృత్యం, చెవిటి మూగ విద్యార్థుల నృత్యం, లం బాడీ నృత్యం, జానపద నృత్యాలు అలరించాయి. అంతకు ముందు ఈ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షురాలు మమత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కలాదగి, తూర్పు బ్లాక్ బీఈఓ వృషభేంద్రయ్య మాట్లాడారు. ఈ రాష్ట్రం జానపద సంస్కృతి, గ్రామీణ క్రీడలకు నిలయమని తెలిపారు. వీటిని ఉత్తేజపరిచి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాలల పండుగ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. విద్యార్థులకు వారి వారి తల్లిదండ్రులు ఈ కళలను నేర్పించి, ప్రోత్సహించాలన్నారు. విదేశీ సంస్కృతిపై మోజుతో మనదేశ సంస్కృతిని మరిచి పోకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మహ్మద్ సలా ఉద్దీన్, జెడ్పీ సామాజిక న్యాయ సమితి అధ్యక్షుడు అన్నదానరెడ్డి, నగర డీఎస్పీ మురుగణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
కో-ఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల్లో రమేష్ గోపాల్ గ్రూప్ విజయం
మళ్లీ అధ్యక్ష పదవి రమేష్ గోపాల్‌కే దక్కే అవకాశం బళ్లారి: బళ్లారి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు డెరైక్టర్ల ఎన్నికల్లో డాక్టర్ రమేష్ గోపాల్, ముండ్లూరు అనూప్ గ్రూప్ ఘన విజయం సాధించింది. ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి జరిగే అర్బన్ కో-ఆపరేటివ్ సహకార బ్యాంకు ఎన్నికల్లో మాజీ మంత్రి, పలువురు కార్పొరేటర్ల వర్గీయులు గెలుపొందేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో 1328 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఓట్ల లెక్కింపు కార్యక్రమం ముగించగా ఇందులో రమేష్ గోపాల్ 855 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే ముండ్లూరు అనూప్ కుమార్ ఘన విజయం సాధించారు. డెరైక్టర్ల స్థానాలకు తొలిసారి ఎన్నికలు జరగగా, మళ్లీ రమేష్‌గోపాల్ ప్యానల్ ఘన విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న రమేష్ గోపాల్‌కే మళ్లీ అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉందని గెలుపొందిన డెరైక్టర్లు పేర్కొంటున్నారు. మంచికి మారు పేరుగా, బ్యాంకు అభివృద్ధికి తీవ్రంగా కృషి చేయడంతో రమేష్ గోపాల్ ప్యానల్ ఘన విజయం సాధించిందని ఓటర్లు పేర్కొంటున్నారు. ముండ్లూరు అనూప్ కుమార్ అందరికంటే ఎక్కువగా 888 ఓట్లు, రమేష్ గోపాల్ 855, మహంతేష్ 851, వెంకటేష్ 803, రాజశేఖర్ 748, వరలక్ష్మి 726, మల్లికార్జునగౌడ 791, కవిత 747, షేక్‌సాబ్ 700, సత్యనారాయణ 681 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో రమేష్ గోపాల్ ప్యానల్ సంబరాలు చేసుకున్నారు. -
బీటీపీఎస్ రెడీ
700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు రంగం సిద్ధం పూర్తి కావస్తున్న మూడవ స్టేజ్ పనులు జూన్ నుంచి విద్యుత్ ఉత్పాదన 1200 మందికి పైగా ఉద్యోగావకాశాలు బళ్లారి : స్టీల్ సిటీ బళ్లారిలో మరో 700 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదనకు రంగం సిద్ధమవుతోంది. కుడితిని వద్ద ఉన్న బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్) విద్యుత్ ప్లాంట్‌లో 2010లో అప్పటి బీజేపీ ప్రభుత్వ హయాంలో బీటీపీఎస్‌లో రూ.3750 కోట్ల వ్యయంతో మరో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు భూమిపూజ చేసింది. ఆ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. జూన్‌లోగా మూడో స్టేజీ విద్యుత్ ఉత్పాదన పనులు పూర్తి కానుండడంతో బళ్లారి జిల్లాకే కాకుండా కర్ణాటక రాష్ట్రానికి విద్యుత్ కొరత తీరేందుకు దోహదం చేస్తుందని అధికారులు చెబున్నారు. ఈ పనులు పూర్తి అయితే మొత్తం 1700 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అవుతుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ ఉత్పాదన పనుల్లో చిమ్నీ, కూలింగ్ టవర్, బాయిలర్ పనులు జరుగుతున్నాయి. మూడో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయితే బీటీపీఎస్‌లో దాదాపు 1200 మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. కాగా, 2008లో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ప్రారంభించిన బీటీపీఎస్ 2012లో మరో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు రెండవ స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మొత్తం 1000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
సాక్షి, బళ్లారి(దావణగెరె): పెళ్లి బృందంతో వెళ్తున్న బోలెరో టెంపో వాహనం బోల్తా పడి ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం తాలూకాలోని హుణసెకట్టె సమీపంలో జాతీయ రహదారి-4పై చోటు చేసుకుంది. వివరాలు.. బళ్లారికి చెందిన రామాంజనేయతో హరిహర తాలూకా నిట్టూరుకు చెందిన రామకృష్ణ కుమార్తె మేరీ వివాహం నిశ్చయమైంది. ఆదివారం రాత్రి వీరికి బళ్లారిలో రిసెప్షన్, సోమవారం వివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో హరిహర తాలూకా నిట్టూరు క్యాంప్ నుంచి రామకృష్ణ కుటుంబం, బంధువులు దాదాపు 20 మంది వధువుతోతో కలిసి బోలెరో టెంపోలో దావణగెరె-చిత్రదుర్గ మీదుగా బయల్దేరారు. హుణసెకట్టె సమీపంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో వధువు తండ్రి రామకృష్ణ(48), వధువు పెద్దమ్మ లక్ష్మమ్మ(55), బంధువులు రాజన్న(50), ఆదిలక్ష్మమ్మ(48), టెంపో డ్రైవర్ అషఫ్(్ర40)మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దావణగెరె, చిత్రదుర్గంలలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండకు చెందిన అనంతలక్ష్మి, మంగళమ్మ, నిట్టూరుకు చెందిన సిద్దేష్, గంగమ్మ, రత్నకుమారి, వినుత, చంద్రప్ప, రుతు, వధువు మేరీ ఉన్నారు. వీరిలో వినుత మినహా తక్కిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాద తీవ్రతకు బోలెరో టెంపో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటన స్థలాన్ని రూరల్ డీఎస్పీ నేమేగౌడ, సీఐ పంపాపతి, ఎస్ఐ సిద్దేశ్‌లు తమ సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై దావణగెరె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు
సీ కేటగిరీ గనుల వేలంపై స్పందించిన సీఎం తుంగభద్ర పూడికతీత అసాధ్యం ప్రత్యామ్నాయలపై దృష్టి మంత్రి జారకిహోళికి శాఖ మార్పు మార్చిలో బడ్జెట్ సమావేశాలు బళ్లారి : రాష్ట్రంలో చిత్రదుర్గం, బళ్లారి, తుమకూరు జిల్లాల పరిధిలోని 51 సీ కేటగిరి గనుల వేలానికి సంబంధించి సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన శనివారం బెంగళూరు నుంచి బాగల్‌కోటకు వెళుతూ జిందాల్ విమానాశ్రయంలో కాసేపు బస చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే ఆ గనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించారని, ఆయనతో చర్చించిన అనంతరం సుప్రీంకోర్టు, సీఈసీ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పలు జిల్లాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర డ్యాంలో పూడికతీత సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ చేస్తున్నామన్నారు. తుంగభద్రలోని పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి సతీష్ జారకిహోళి శాఖ మార్పు, ఆయనకు ఏ శాఖ కేటాయించాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల అనంతరం జారకిహోళికి సముచిత శాఖ కల్పిస్తామన్నారు. 2014-15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నారు. ఈసారి రాష్ట్ర ప్రజలు మెచ్చే విధంగా బడ్జెట్ ఉంటుందన్నారు. వచ్చే వారం బడ్జెట్‌కు సంబంధించి నిపుణులతో చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. -
కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకువద్దాం
రాష్ట్రంలో 75 లక్షలు, బళ్లారి జిల్లాలో 5 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యం బళ్లారి ఎంపీ శ్రీరాములు బళ్లారి : కర్ణాటకలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు తెలిపారు. ఆయన బుధవారం స్థానిక బసవేశ్వర నగర్‌లోని సంగమేశ్వర ఆలయంలో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదును పెంచి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది, కర్ణాటకలో 75 లక్షల మంది, బళ్లారి జిల్లాలో 5 లక్షల మందిని పార్టీ సభ్యులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఉత్తర కర్ణాటకలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తాను స్వయంగా పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి యువత పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపారు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ గాలికి కాంగ్రెస్ కొట్టుకుపోయిందని, ఇక వచ్చే ప్రతి ఎన్నికలోనూ మోడీ గాలికి కాంగ్రెస్ నిలవదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగ, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, బుడా మాజీ అధ్యక్షుడు గురులింగనగౌడ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నందీష్, రాష్ట్ర స్లం మోర్చా ఉపాధ్యక్షుడు సంజయ్, బీజేపీ నేతలు అశోక్ గస్తీ, బీజేపీ నేతలు విరుపాక్షిగౌడ, రామలింగప్ప తదితరులు పాల్గొన్నారు. -
దోచుకున్న వారికి దోచుకున్నంత..!
- ఇసుక మాఫియాకు కాసుల వర్షం - బళ్లారిలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు - అనుమతులు రద్దయినా యథేచ్ఛగా తరలింపు - ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి - మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు - చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం సాక్షి, బళ్లారి : తాలూకాలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా సాగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. బళ్లారి తాలూకా పరిధిలోని మోకా, రూపనగుడి, హగరి తదితర నది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతాల పరిధిలో మూడు కంపెనీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఏడాదికి ఒకసారి ఇసుక కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేయడమో లేక కొత్త వారికి అనుమతులు ఇవ్వడమో చేసి ఇసుక తవ్వకాలు చేపట్టాలనే నిబంధనలు ఉన్నాయి. నెల రోజుల క్రితం బళ్లారి తాలూకాలో ఉన్న ఇసుక కాంట్రాక్టర్ల టెండర్ల గడువు ముగిసింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకాలకు రూ.670లు చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలి. క్యూబిక్ మీటర్‌కు రూ.670లు ప్రకారం నెలకు మూడు వేల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోవచ్చు. తద్వారా ప్రభుత్వానికి నెలకు దాదాపు రూ.21 లక్షలు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం టెండర్ల గడువు ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. పాత కాంట్రాక్టర్లు గడువు ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, ఇసుక తవ్వకాలను యథేచ్ఛగా అధికార పార్టీ నేతలు కొనసాగిస్తున్నారు. ఇసుక తవ్వకాలు రద్దు చేశారని అధికారికంగా పేర్కొంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రభుత్వ భనన నిర్మాణాలకు ఇసుక కొరత సృష్టిస్తూ, బళ్లారిలో అక్రమంగా ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. బళ్లారితో పాటు బెంగళూరుకు కూడా ఇక్కడ నుంచి ఇసుకను భారీగా తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండదండలతో ఇసుక తవ్వకం దారులు పెట్రేగిపోతున్నారు. భారీగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల హగరి నది పరివాహక ప్రాంతాలైన చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీనిపై రైతులు ఆందోళనలు చేపట్టినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అటవీశాఖ అధికారులు, జిల్లా యంత్రాంగంలోని ప్రముఖ అధికారులకు, పోలీసులకు మామూళ్లు సమర్పిస్తూ ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి జిల్లా పంచాయతీ సమావేశంలోను ఈ అక్రమాలపై సంబంధిత ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీ మెంబర్లు నిలదీసినా ప్రయోజనం శూన్యం. ఈ సమస్య పరిష్కారంపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పరమేశ్వర నాయక్ చొరవ చూపకపోవడం శోచనీయం. -
విమ్స్ డెరైక్టర్ పదవి ముళ్లపాన్పు
సాక్షి, బళ్లారి : బళ్లారి విమ్స్ డెరైక్టర్ పదవి ముళ్లపాన్పు కానుంది. డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టినవారు నాలుగేళ్లు పదవిలో కొనసాగాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగేళ్లలో ఏడు మంది డెరైక్టర్లు మారడం చర్చనీయాంశమైంది. కేవలం ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఇలా జరుగుతోందన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవల విమ్స్ డెరైక్టర్ డాక్టర్ శంకర్ ఉన్నఫళంగా రాజీనామా చేశారు. వారం రోజుల క్రితం విమ్స్ డెరైక్టర్‌గా నియమితులైన ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా లేఖను ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపినట్లు పేర్కొన్నప్పటికి రాజీనామా వెనుక బలమైన కారణాలున్నాయని తెలుస్తోంది. విమ్స్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డిని ఉన్నఫళంగా తొలగించి డాక్టర్ శంకర్‌ను నియమించిన సంగతి తెలిసిందే.రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణుప్రకాష్ పాటిల్,సెక్రటరీలు విమ్స్ ఆస్పత్రిని సందర్శించి,హెచ్ఓడీలు,వైద్యులతో సమస్యలు తెలుసుకుని బెంగళూరుకు వెళ్లారు. మరుసటి రోజు విమ్స్ డెరైక్టర్‌గా శంకర్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. డెరైక్టర్ ఎల్ఎన్రెడ్డికి, మంత్రికి సరిపోకపోవడంతోనే ఆయన స్థానంలో శంకర్‌ను ఏర్పాటు చేసినట్లు వదంతులు వచ్చాయి అయితే శంకర్ ఎందుకు రాజీనామా చేశారన్నది వైద్య వర్గాల్లోనే కాకుండా నగరంలోహాట్టాపిక్ మారింది. సౌమ్యుడు,మంచి వైద్యుడుగా పేరున్న శంకర్ రాజీనామా లేఖను పంపారని తెలియగానే విమ్స్‌కు కొత్త బాస్ ఎవరుని నియమిస్తారనే చర్చసాగుతోంది. -
బంగారం కొనుగోళ్లు ఢమాల్
సాక్షి, బళ్లారి : బంగారం ధర తగ్గినా కొనుగోళ్లు భారీగా పడిపోతున్నాయి. బంగారం ధర భారీగా తగ్గుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం పెరగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా బంగారం ధరలు స్థిరంగా లేకపోవడంతో రోజు రోజుకీ తగ్గుముఖం పట్టడం లేదా కొంత పెరగడం తరుచూ జరుగుతుండటం వల్ల బంగారం వైపు జనానికి మోజు తగ్గుతోందని వ్యాపారులు భావిస్తున్నారు. బళ్లారి నగరంలోని బెంగళూరు రోడ్డులో బంగారు అంగళ్లు ఎక్కువగా ఉన్నాయి. వీటికి తోడు మోతీ సర్కిల్ వద్ద టాటా గోల్డ్ ప్లస్ కంపెనీ వారు అతి పెద్ద జువెలరీ షాపును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బంగారం తగ్గుముఖం పట్టడం వల్ల సగానికి సగం బంగారం కొనుగోళ్లు పడిపోయినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. బంగారం పెరిగే సమయంలో కొనుగోళ్లు బాగా జరిగేవని, ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పడుతుండటం వల్ల ఇంకా తగ్గుతుందనే ఆశ వినియోగదారుల్లో ఉండటం వల్ల కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో నిత్యం వ్యాపారులతో కళ కళలాడే బంగారు అంగళ్లు వెలవెలబోతున్నాయి. బంగారం దుకాణాలు ఉండే బెంగళూరు రోడ్డు నిత్యం జనంతో కిటకిటలాడేది. ప్రస్తుతం ఆ రోడ్డులో కూడా జనం తక్కువగా కనిపిస్తున్నారు. నిత్యం రూ.లక్షల వ్యాపారం అయ్యే షాపులు వెలవెలబోతున్నాయి. బంగారం ధర తగ్గుముఖం పట్టడంతోపాటు పెళ్లిళ్ల సీజన్లు లేకపోవడం కూడా కొనుగోళ్లు పడిపోవడానికి కారణమని వ్యాపారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు పేర్కొంటున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,000 ఉన్న సమయంలో వ్యాపారం జరిగేదని, ప్రస్తుతం రూ.27,000 ధర ఉన్నప్పటికీ బంగారం జోలికి జనం వెళ్లడం లేదు. ఈ సందర్భంగా బెంగళూరు రోడ్డులోని రాజ్‌మహాల్ బంగారు దుకాణం యజమాని ఎస్.సురేష్ మాట్లాడుతూ బంగారం ధరలు తగ్గుతుండటం వల్ల వ్యాపారాలు పెరుగుతాయని అనుకున్నామని, అయితే తగ్గుముఖం పట్టినప్పటి నుంచి వ్యాపారం మరింత పడిపోయిందన్నారు. -
కేబుల్ టీవీ ఆపరేటర్ ఆత్మహత్య
బళ్లారి (తోరణగల్లు) : నగరంలోని నేతాజీనగర్‌లో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవీన్ (40) గురువారం ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నేతాజీనగర్‌కు చెందిన గుత్తి నవీన్ (40) కువెంపునగర్లో కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు స్థోమతకు మించి అప్పులు చేయడంతో రుణదాతలు అప్పులు తీర్చాలని ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది గురువారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని విమ్స్‌కు తరలించారు. కాగా మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
ఎంత కష్టమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం
సీఎం సిద్దరామయ్య బళ్లారి టౌన్ : ఎంత కష్టమనిపించినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ గ్రౌండ్లో కార్మిక శాఖ ఏర్పాటు చేసిన జాతీయ స్వాస్థ బీమా పథకం, వివిధ శాఖల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన 95 హామీలలో 65 హామీలను నెరవేర్చామన్నారు. అన్నభాగ్య, క్షీరభా గ్య, రుణాల మాఫీ, మైత్రి, విద్యాశ్రీ, తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు వంటి పథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కల్పించేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉందన్నారు. గత ఉప ఎన్నికల్లో బళ్లారి జిల్లాలో ఇచ్చిన ఎ న్నికల హామీ ప్రకారం మూడేళ్లలో రూ.850 కోట్లతో వివిధ పథకాలకు నివేదిక తయారు చేశామన్నారు. ఇందులో పీడబ్ల్యూడీ రోడ్లు, గ్రామీణ రోడ్లు, తాగునీ రు, మరుగుదొడ్లు, విద్యుత్, డ్రెయినేజీ వంటి వివిధ పథకాలు ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.304 కోట్లతో ఈ పనులను అభివృద్ధి చేస్తామన్నారు. బీజేపీ మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందన్నారు. 1.15 కోట్ల మంది జాతీయ స్వాస్థ బీమా పథకంలో స్మార్ట్‌కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ పథకాన్ని గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని దాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.30 వేలు ఆస్పత్రి ఖర్చులను బీమా కంపెనీలు భరిస్తాయన్నారు. ఈ పథకానికి రూ.131 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని గుర్తు చేశారు. అంతకుముందు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ నాయక్ మాట్లాడుతూ మంగళ గ్రహం అంతరిక్షంలోకి పంపాలనే పథకాన్ని ప్రారంభించింది మాజీ ప్రధాని మన్మోహన్‌సింగేనని, దాన్ని ఇప్పుడు బీజేపీ తమ ఘనతగా చెప్పుకుంటోందన్నారు. ఇంధన శాఖ మంత్రి డీకే.శివకుమార్ మాట్లాడుతూ చరిత్రలోనే పవిత్రమైన రోజు ఈ రోజని, ఇంతపెద్ద స్థాయిలో మంత్రులు వచ్చి వరాలు గుప్పించడం శ్లాఘనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ పరమేశ్వరనాయక్, వివిధ శాఖల మంత్రులు హెచ్‌కే.పాటిల్, కమరుల్ ఇస్లాం, శివరాజ్ తంగడగి, రోషన్‌బేగ్, ఉమాశ్రీ, అంబరేష్, ఎమ్మెల్యేలు చంద్రణ్ణ, అనిల్‌లాడ్, ఎంపీ రవీంద్ర, ఎన్వై గోపాలకృష్ణ, నాడగౌడ అప్పాజీ, తుకారాం, వీరణ్ణ మత్తికట్టి, వెంకటేశ్, బోసురాజ్, స్థానిక నేతలు కేసీ కొండయ్య, అల్లం వీరభద్రప్ప, సూర్యనారాయణరెడ్డి, మేయర్ రమేష్ పాల్గొన్నారు. -
బళ్లారిని వణికిస్తున్న జ్వరాలు
లోపించిన పారిశుద్ధ్యం పట్టించుకోని పాలకులు సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా జ్వరాలు జనాన్ని వణికిస్తున్నాయి. నెల రోజుల నుంచి జ్వరాలు తగ్గుముఖం పట్టకపోవడంతో వైద్యులే తలలు పట్టుకుంటున్నారు. బళ్లారి నగరంలో ఏ ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించినా జ్వరపీడితులు పెద్ద సంఖ్యలో కనబడుతున్నారు. ముఖ్యంగా 0-10 సంవత్సరాల లోపు చిన్నారులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. నెల రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో గుంతలు, రోడ్లలో నీరు నిలిచి దోమలకు నిలయంగా మారుతున్నాయి. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తూ జ్వరాలు సోకేందుకు కారణమవుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటి వరకు డెంగీతో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మంది మృతి చెందారని అధికారులే చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రక్తపరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు ఉదయం నుంచి రాత్రి వరకు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. బళ్లారిలో నర్సింగ్ హోంలు 50కి పైగా ఉండగా, చిన్న చిన్న క్లినిక్‌లు మరో 50కి పైగా ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా విమ్స్ ఆస్పత్రిలో రోగులు కిటకిటలాడుతున్నారు. 1000 పడకల ఆస్పత్రిలో జ్వరపీడితుల కోసం ఏర్పాటు చేసిన వార్డులన్నీ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. బళ్లారి నగరంతోపాటు హొస్పేట, సిరుగుప్ప, కంప్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో జ్వరంతో బాధ పడే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరాలు అరికట్టేందుకు ఫాగింగ్ చేస్తామని పాలికే అధికారులు పేర్కొంటున్నారు కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని నగర వాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పారిశుధ్ద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అసవరం ఎంతైనా ఉంది. -
హంపిలో కట్టడాలకు ముప్పు?
మూడు రోజులుగా నీటిలోనే స్మారకాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పర్యాటకుల వినతి సాక్షి, బళ్లారి : ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపిలోని ఆలయాల ఆవరణంలోకి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నీరు చేరడంతో కట్టడాల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి హంపి చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు సమీపంలోనే తుంగభద్ర డ్యాం నిండుగా తొణికిసలాడుతున్న సంగతి తెలిసిందే. హంపిలో కురుస్తున్న భారీ వర్షాలకు హంపి పూర్తిగా జలమయమైంది. తుంగభద్ర డ్యాం 35 గేట్లు పూర్తిగా ఎత్తివేసినప్పుడు కూడా హంపిలోకి నీరు ప్రవహించలేదు. అయితే మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హంపి జలదిగ్బంధమైంది. ఈ నేపథ్యంలో పురాతన కట్టడాలైన విరుపాక్షేశ్వర ఆలయం, విజయవిఠల ఆలయం, లోటస్ మహల్ తదితర పురాతన కట్టడాలు నీటిలోనే ఉండటంతో కట్టడాలకు హాని కలిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దాదాపు 600 సంవత్సరాల క్రితం హంపిలోని స్మారకాల నిర్మాణాలు చేపట్టారు. దీంతో పునాదులు, ఇతరత్రా కట్టడాల భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు వెంటనే హంపిని సందర్శించి భద్రతపై సమగ్రంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పర్యాటకులు భావిస్తున్నారు. హంపిలోని పర్యాటక ప్రాంతాలు జలమయమవడంతో పర్యాటకుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఘనంగా వైఎస్ఆర్కు నివాళులు
సాక్షి, బళ్లారి : మహానేత దివంగత డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ఐదవ వర్ధంతి సందర్భంగా బళ్లారిలో ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ జగన్ అభిమానుల నేతృత్వంలో బళ్లారి నగరంలోని విద్యానగర్‌లో నవజీవన బుద్ధిమాంధ్య పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు కృష్ణారెడ్డి, శేషారెడ్డి, ఉమాకాంతరెడ్డి నేతృత్వంలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. అలాగే బళ్లారి ఆర్కే ఆస్పత్రిలో వైఎస్ఆర్ వర్ధంతిని జరుపుకున్నారు. ఆస్పత్రిలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయిప్రసాద్‌రెడ్డి, వంశీకృష్ణ, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్తో చిన్ననాటి స్నేహం ఉన్న గోన్జాల్వేస్ కుటుంబ సభ్యుల నేతృత్వంలో ఈ ఏడాది కూడా బళ్లారిలో అన్నదానం నిర్వహించారు. మేరిమాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం అన్నదానం చేశారు. వైఎస్ఆర్ ఆత్మకు శాంతి కలగాలని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
బ్లాక్ మార్కెట్లో ‘క్షీరభాగ్య’
తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న గ్రామస్తులు సాక్షి, బళ్లారి : నగర శివార్లలోని గుగ్గరహట్టి ప్రభుత్వ పాఠశాల నుంచి క్షీరభాగ్య పాల ప్యాకెట్లును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యక్తిని గ్రామస్తులు బుధవారం పట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం క్షీర భాగ్య పథకం కింద పాలు పొడి ప్యాకెట్లను సరఫరా చేస్తోంది. అయితే వాటిని కొందరు హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గుగ్గరహట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇదే తంతు జరుగుతోంది. ఆ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలి భర్త బుధవారం 50 కిలోల పాలపొడిని బైక్‌లో తీసుకొని వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పాఠశాల హెడ్మాస్టర్ ఈ సంచిని తీసుకెళ్లి వేరే చోట పెట్టాలని ఆదేశించడంతో తాను తీసుకెళ్తున్నానని, అందులో ఏముందో తనకు తెలీదని పోలీసులకు ఆయన తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ నుంచి జారుకున్నారు. నిజానిజాలు తేల్చడానికి బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా పాల పొడిని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక నవ నిర్మాణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. -
బళ్లారిలో కాంగ్రెస్ ఘన విజయం
ఫలించిన డీకేశి ఎత్తులు సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై. గోపాలకృష్ణ 33,104 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 50,795 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై గోపాలకృష్ణకు 83,899 ఓట్లు లభించడంతో భారీ మెజార్టీతో గెలుపొందినట్లయింది. ఈ నెల 21న జరిగిన బళ్లారి ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపును సోమవారం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా, అందులో ఇరు పార్టీలకు సమానంగా వచ్చాయి. తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లోను కాంగ్రెస్ అభ్యర్థి ఎన్వై. గోపాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఓబుళేసుపై మెజార్టీ ప్రదర్శిస్తూ వచ్చారు. మొత్తం 15 రౌండ్లు ఓట్లు లెక్కించగా అందులో ప్రతి రౌండ్లోను బీజేపీపై కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శించింది. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ గెలుపొందాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయినా మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి శ్రీరాములు హ్యాట్రిక్ సాధించారు. అయితే ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీరాములు కోటలో కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారని తెలియడంతో కౌంటింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బళ్లారి జిల్లా ఓటర్లు రెండు సార్లు ఎన్వై హనుమంతప్పను తిరస్కరించారు. మూడోసారి అయినా తమను బళ్లారి ప్రజలు ఆశీర్వదిస్తారనే ఆశతో ఆయన సోదరుడు గోపాలకృష్ణ ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. బళ్లారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ ఇన్ఛార్జిగా పని చేశారు. డీకే శివకుమార్ వ్యూహాత్మంగా ఎన్నికల్లో తనదైన శైలిలో పని చేశారు. బీజేపీ, జేడీఎస్ నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడంతోపాటు అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో ఘన విజయం కారణమైందని చెప్పవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించడంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, డీసీసీ అధ్యక్షుడు జేఎస్. ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ కే.ఎస్. ఎల్స్వామి, స్థానిక కాంగ్రెస్ నేతలు రాంప్రసాద్, అసుండి వన్నూరప్ప తదితరులు కౌంటింగ్ సెంటర్‌కు చేరుకుని ఎన్వై. గోపాలకృష్ణను అభినందించారు. అనంతరం టాప్ లేని వాహనంపై నగర వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు.