- లోపించిన పారిశుద్ధ్యం
- పట్టించుకోని పాలకులు
సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా జ్వరాలు జనాన్ని వణికిస్తున్నాయి. నెల రోజుల నుంచి జ్వరాలు తగ్గుముఖం పట్టకపోవడంతో వైద్యులే తలలు పట్టుకుంటున్నారు. బళ్లారి నగరంలో ఏ ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించినా జ్వరపీడితులు పెద్ద సంఖ్యలో కనబడుతున్నారు. ముఖ్యంగా 0-10 సంవత్సరాల లోపు చిన్నారులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు.
నెల రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో గుంతలు, రోడ్లలో నీరు నిలిచి దోమలకు నిలయంగా మారుతున్నాయి. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తూ జ్వరాలు సోకేందుకు కారణమవుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి.
ఇప్పటి వరకు డెంగీతో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మంది మృతి చెందారని అధికారులే చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రక్తపరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు ఉదయం నుంచి రాత్రి వరకు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. బళ్లారిలో నర్సింగ్ హోంలు 50కి పైగా ఉండగా, చిన్న చిన్న క్లినిక్‌లు మరో 50కి పైగా ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా చిన్నారులే కనిపిస్తున్నారు.
ముఖ్యంగా విమ్స్ ఆస్పత్రిలో రోగులు కిటకిటలాడుతున్నారు. 1000 పడకల ఆస్పత్రిలో జ్వరపీడితుల కోసం ఏర్పాటు చేసిన వార్డులన్నీ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. బళ్లారి నగరంతోపాటు హొస్పేట, సిరుగుప్ప, కంప్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో జ్వరంతో బాధ పడే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరాలు అరికట్టేందుకు ఫాగింగ్ చేస్తామని పాలికే అధికారులు పేర్కొంటున్నారు కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని నగర వాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పారిశుధ్ద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అసవరం ఎంతైనా ఉంది.