బళ్లారిలో ఆగడు
‘‘లైఫ్‌లో ఎంతమందితో పెట్టుకున్నా ఫర్లేదు. బట్... ఒక్కడుంటాడు. వాడితో పెట్టుకున్నప్పుడు మాత్రం.. అసలు తల్లి కడుపు నుంచి ఎందుకు బయటకొచ్చామా... అనిపిస్తుంది.
‘‘లైఫ్‌లో ఎంతమందితో పెట్టుకున్నా ఫర్లేదు. బట్... ఒక్కడుంటాడు. వాడితో పెట్టుకున్నప్పుడు మాత్రం.. అసలు తల్లి కడుపు నుంచి ఎందుకు బయటకొచ్చామా... అనిపిస్తుంది. ఆ ఒక్కడేరా నేను...’’ మహేశ్ ఈ డైలాగ్ చెప్పడం ఆలస్యం... థియేటర్లన్నీ విజిల్స్‌తో నిండిపోయాయి. మరి మహేశా మజాకా! కొన్నాళ్ల పాటు యువతరం కాలర్‌ట్యూన్స్ అంటే ‘దూకుడు’ డైలాగులే. ఆ డైలాగులు ఎలా ఉంటాయో... అందులోని మహేశ్ పాత్ర చిత్రణ కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. ప్రస్తుతం ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆగడు’. ‘దూకుడు’ని మరిపించే స్థాయిలో ‘ఆగడు’ ఉంటాడని ఫిలింనగర్ టాక్. ఇందులో కూడా మహేశ్‌ని పోలీస్‌గానే చూపించబోతున్నారు దర్శకుడు శ్రీను వైట్ల.
ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్‌ని జనవరి 18 నుంచి నెల రోజుల పాటు హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ఈ నెల 24(నేడు) నుంచి బళ్లారిలో మరో షెడ్యూల్ మొదలైంది. మొదట మహేశ్ ఇంట్రడక్షన్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను, ఓ ఫైట్ కూడా తెరకెక్కించనున్నట్లు సమాచారం. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. తర్వాత గుజరాత్‌లో భారీ షెడ్యూల్ ఉంటుంది. ‘దూకుడు’లో బ్రహ్మానందం ‘రియాలిటీ’ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెలిసిందే. ఈ సినిమాలో కూడా వెరైటీ కాన్సెప్ట్‌తో బ్రహ్మానందంపై కామెడీ ట్రాక్‌ని శ్రీను వైట్ల డిజైన్ చేశారట.
వాణిజ్య అంశాలతో పాటు మనసుల్ని తాకే భావోద్వేగపూరిత అంశాలు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. మే 31న సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్రం పాటల్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. జూలైలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. డా. రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నెపోలియన్, నదియా ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, సంగీతం: తమన్, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్.