సంతాన లక్ష్మి
బళ్లారి రూరల్ (కర్ణాటక): q దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ అరుదైన ఘటనకు కర్ణాటకలోని బళ్లారిలోని ప్రభుత్వ విమ్స్ ఆసుపత్రి వేదికైంది. బళ్లారి జిల్లా కంప్లి సమీపంలోని ఎమ్మిగనూరుకు చెందిన బసవరాజు, హులిగమ్మ దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. హులిగమ్మకు మొదటి కాన్పులో మగశిశువు జన్మించాడు. మూడేళ్ల తరువాత హులిగమ్మ గర్భం దాల్చింది. గురువారం మధ్యాహ్నాం ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు విమ్స్‌లో చేర్పించారు.
గైనకాలజిస్టులు డాక్టర్ రామరాజు, డాక్టర్ వారీజా, డాక్టర్ అనిరుద్ధ్, డాక్టర్ శ్వేతలు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ కాన్పు కష్టతరం కావడంతో అదేరోజు సాయంత్రం శస్త్రచికిత్స(సిజేరియన్) చేసి నలుగురు పిల్లలను వెలికి తీశారు. వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా హులిగమ్మ అత్త(భర్త తల్లి)కు 8 మంది సంతానం కాగా వారిలో ఇద్దరు కవలలు. వీరిలో ఒకరు మగ, ఒకరు ఆడ సంతానం. అలాగే బసవరాజు తాతకు కూడా ఇద్దరు కవలలు పుట్టారు. ప్రస్తుతం ఆ ఇంటి కోడలికి ఒకే కాన్పులో నలుగురు కవలలు జన్మించడం విశేషం.