ముగ్గురికి తీవ్ర గాయాలు ఉలిక్కి పడిన బళ్లారి
సమగ్ర తనిఖీకి రెండు పోలీసు బృందాలు-ఎస్‌పీ
బళ్లారి: బళ్లారి నగరంలోని హవంబావి ప్రాంతంలోని రామనగర్ హెచ్‌ఎల్‌సీ కాలువ వద్ద రెండు గ్రూపుల మధ్య చిన్నపాటి ఘర్షణకు పిస్తోల్‌తో కాల్పులు జరగడంతో బళ్లారి నగరానికి చెందిన రాజేష్, ఉపేంద్ర అనే యువకులకు తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి నగరంలో అందరూ నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో నగరంలో జరిగిన కాల్పుల శబ్ధం బళ్లారి వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఘర్షణలో కాల్పులు జరుపుకుని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయని తెలియగానే కాల్పుల బీభత్సం నగర వాసులను ఆందోళనకు గురి చేసింది. కాల్పులు జరిగింది నిజం, అయితే గన్ తమది కాదని ఘర్షణలో గాయపడిన వ్యక్తులు పేర్కొంటుండటంతో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారి నగరానికి చెందిన రాజేష్ అనే యువకుడు ద్విచక్ర వాహనంలో ఆదివారం రాత్రి నగరంలోని హవంబావి సమీపంలోని రామనగర్ వద్దకు వెళ్లగా హెచ్‌ఎల్‌సీ కాలువ పక్కనే ఉన్న ఒరిస్సాకు చెందిన తరుణ్‌కుమార్‌కు చెందిన వాటర్ ప్లాంటు ముందు ద్విచక్ర వాహనం కింద పడింది. వెంటనే వాటర్ ప్లాంటులో పని చేస్తున్న యువకులు బైక్‌ను పైకి లేపడానికి ప్రయత్నించారు.పడిపోయిన ద్విచక్రవాహనాన్ని పైకిలేపుతున్న సమయంలో వాటర్ ప్లాంటులో పని చేస్తున్న యువకులకు, రాజేష్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు.
వాటర్ ప్లాంటు యజమాని తరుణ్‌కుమార్ కూడా రాజేష్‌ను గాయపరిచారు. వెంటనే రాజేష్ తన స్నేహితుడు ఉపేంద్రకు ఫోన్ చేయగా, అతడు తన స్నేహితులతో కలిసి వచ్చి ఘర్షణకు దిగారు. వాటర్ ప్లాంటు యజమాని తరుణ్‌కుమార్‌కు కూడా బాగా దెబ్బలు తగిలాయి. ఇంతలోనే ఫైరింగ్ జరిగింది. ఈ ఫైరింగ్‌లో ఉపేంద్ర, రాజేష్‌లపైకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. బుల్లెట్ల శబ్దం రావడంతో అక్కడ ఉన్న వారంతా పరారయ్యారు. హవంబావి వద్ద కాల్పులు జరిగాయని తెలియగానే జిల్లా ఎస్‌పీ చేతన్, ఏఎస్‌పీ, డీఎస్‌పీ, సీఐలు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అప్పటికే అక్కడ రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు కనిపించింది. బుల్లెట్ దూసుకెళ్లడంతో రక్తం అక్కడ పెద్ద ఎత్తున ప్రవహించింది. ఈ ఘర్షణలో ఉపేంద్ర, రాజేష్‌లపై వాటర్ ప్లాంట్‌కు చెందిన వారు ఫైరింగ్ చేసినట్లు గాయపడిన వర్గం ఆరోపిస్తోంది. అయితే పిస్తోల్ తన వద్ద లేదని తరుణ్‌కు కుమార్ పోలీసుల వద్ద పేర్కొనడంతో మరి కాల్పులు ఎవరు జరిపారనే విషయం దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఘర్షణలో ఉపేంద్ర, రాజేష్‌లకు బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక విమ్స్ ఆస్పత్రికి తరలించారు.
రాజేష్, ఉపేంద్ర తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి ఘర్షణకు కాల్పులు జరిగాయని కంటతపడి పెట్టారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేపట్టాలని కోరారు. ఘర్షణలో కాల్పులు జరిపింది తరుణ్‌కుమార్ అయి ఉండవచ్చునని గాయపడిన వారి బంధువులు పేర్కొంటున్నారు. అయితే తన వద్ద పిస్తోల్ లేదని తరుణ్‌కుమార్ వాదిస్తున్నారు. అయితే ఈ గన్ ఎవరిది...కాల్పులు ఎవరు జరపారనే అంశంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌పీ చేతన్ తెలిపారు. బళ్లారి గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇరు వర్గాల ఘర్షణ... ఇద్దరిపై కాల్పులు
Published Tue, Aug 11 2015 2:19 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement