
సాక్షి, బెంగళూరు: అభిమానం అంటూ తమకు నచ్చిన వ్యక్తులతో కష్టమైనా సరే ఓ సెల్ఫీ దిగుతామని ఫ్యాన్స్ యత్నిస్తుంటారు. కొన్ని పర్యాయాలు ఆ ప్రయత్నాలు వికటించడం జరగక మానదు. బెళ్లారిలో ఓ అభిమానికి ఇలాంటి చేదు అనుభవవమే ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం బెళ్లారికి వచ్చారు. ఆయనతో సెల్ఫీ దిగాలని ఓ అభిమాని ఆయనను చేరుకున్నాడు. చుట్టుపక్కలున్న పార్టీ నేతలు, కార్యకర్తలను దాటుకుంటూ మంత్రి శివకుమార్‌ను సమీపించాడు. వెంటనే తన మొబైల్ తీసి మంత్రితో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. ఇక అంతే ఒక్కసారిగా ఆవేశానికి లోనైన మంత్రి ఆ అభిమాని ఫోన్‌ను విసిరికొట్టేశారు. ఆశ్చర్యపోవడం అక్కడున్న వారి వంతయింది. మరో అభిమాని చేయి ముందుకు చాపగా షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు. మంత్రిగారు సెల్ఫీ దిగరు.. షేక్ హ్యాండ్ మాత్రమే ఇస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.