‘నిఖిల్ కుమారస్వామి కంటే ఆమె 10 రెట్లు బెటర్’ | Aisshwarya DKS Hegde earns praise for confident response | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య అదిరే ఆన్సర్‌.. సూపర్‌ అంటున్న నెటిజన్లు

Published Mon, Mar 24 2025 2:40 PM | Last Updated on Mon, Mar 24 2025 7:37 PM

Aisshwarya DKS Hegde earns praise for confident response

నిఖిల్ కుమారస్వామి కంటే ఆమె 10 రెట్లు బెటర్ అంటున్నారు కన్నడిగులు. అంతేకాదు కర్ణాటకలో చాలా మంది రాజకీయ నాయకుల వారసుల కంటే ఆమె మెరుగ్గా ఉన్నారని కూడా ప్రశంసిస్తున్నారు. నెటిజనుల నుంచి కితాబు అందుకున్న ఆమె ఎవరు కాదో.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కర్ణాటక  డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తనయ ఐశ్వర్య డీకేఎస్‌హెగ్డె. ఆమెను ఎందుకు పొగుడుతున్నారంటే..?

బెంగళూరులో గ్లోబల్‌ అకాడమి ఆఫ్‌ టెక్నాలజీ వేదికగా జరుగుతున్న వీటీయూ యూత్ ఫెస్ట్ 2025లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐశ్వర్య డీకేఎస్‌ హెగ్డె (Aisshwarya DKS Hegde) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఆమెపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆమెక మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఊహిస్తున్నారు.

ఇంతకీ జరలిస్ట్‌ అడిగిన ప్రశ్న ఏంటి?
వీటీయూ యూత్ ఫెస్ట్ 2025కు (VTU Youth Fest 2025) సంబంధించిన పోస్టర్లను ఇంగ్లీషులో ప్రింట్‌ చేశారు. వీటిలో ఎక్క‌డా కన్నడ భాష‌ కనిపించలేదు. ఇదే విషయాన్ని సదరు జర్నలిస్టు.. ఐశ్వర్య దృష్టికి తీసుకొచ్చాడు. ఈవెంట్ సైన్ బోర్డులపై కన్నడ లేకపోవడం గురించి ప్రశ్నించాడు. దీనికి ఆమె ఏమాత్రం తడుముకోకుండా, కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇచ్చింది. ‘మా తప్పులను ఎత్తి చూపడానికే కదా మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు మా తప్పులను కనిపెడితేనే కదా మేము దిద్దుకోగలం. తప్పులు చేయడం మానవ సహజం. మేమూ మనుషులమే కదా’ అని ఐశ్వర్య జవాబిచ్చింది.

ఈ వీడియో వైరల్‌ (Video Viral)  కావడంలో నెటిజనులు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి, విమర్శలను స్వీకరించే తీరుకు నెటిజనులు ఫిదా అయ్యారు. ఐశ్వర్యకు సహజంగానే నాయకత్వ లక్షణాలు వచ్చాయని చాలా మంది కామెంట్‌ చేశారు. అంతేకాదు చాలా రాజకీయ నాయకుల వారసులతో పోలిస్తే ఆమె మెరుగ్గా ఉందని కితాబిచ్చారు కూడా.

‘ఆమె రాజ‌కీయాల్లో రారు’ 
‘ఈ అమ్మాయి భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకురాలు కానుంది. ఆమెకు ఒక నియోజకవర్గం అవసరం. నిఖిల్ లేదా చాలా మంది బీజేపీ రాజకీయ నాయకుల పిల్లల కంటే 10 రెట్లు మెరుగ్గా ఉంది. కన్నడ బాగా మాట్లాడుతుంది, అత్యంత ఆత్మవిశ్వాసం కలిగి ఉంది. విమర్శలను ఎలా ఎదుర్కోవాలో తెలుసు’ అంటూ ఒక నెటిజన్‌ ప్రశంసించారు. అయితే ఆమె పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టకపోవచ్చని ఒక యూజర్‌ ఊహించారు. ‘ఆమె ఆత్మవిశ్వాసం సాటిలేనిది, కానీ ఆమె రాజకీయాల్లో చేరదు. దీన్ని బుక్‌మార్క్ చేసుకోండి’ అని పేర్కొన్నారు. బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన ఐశ్వర్య తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తుందా, లేదా అనేది వేచి చూడాలి.

ప్రదీప్ ఈశ్వర్ ‘ఫీమేల్‌ వెర్షన్‌’
వ్యవహార శైలిలో చిక్కబల్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్, ఐశ్వర్య మధ్య సరూప్యం ఉందని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఐశ్వర్యను ప్రదీప్ ఈశ్వర్.. ‘ఫీమేల్‌ వెర్షన్‌’గా వర్ణించాడు. ‘ఒకే స్వరం, అదే శృతి - ఆమె అతని స్త్రీ రూపం!’ అని వ్యాఖ్యానించాడు. ఈ పోలిక ఆమె కమాండింగ్‌గా మాట్లాడే విధానాన్ని సూచించింది. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులకు మాత్రమే ఇది సాధ్యమని చాలా మంది నమ్ముతారు. అయితే త‌న‌కు విద్యావేత్త‌గా ఉండ‌ట‌మే ఇష్ట‌మ‌ని గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూలో ఐశ్వ‌ర్య చెప్పారు. కాబ‌ట్టి ఆమె రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌చ్చ‌ని కొంద‌రు అంటున్నారు. కాగా, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను (Amartya Hegde) 2020లో ఆమె వివాహం చేసుకున్నారు. 

చ‌ద‌వండి: ద‌క్షిణాదిపై వివ‌క్ష మ‌రింత పెరిగింది

నిఖిల్‌కు క‌లిసిరాని అదృష్టం
కాగా, నిఖిల్‌ కుమారస్వామి (Nikhil Kumaraswamy) జేడీఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తనయుడు. అతడు మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే హీరోగా రాణించకపోవడంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో  మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సుమలత చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యాడు. 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రామనగర నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2024 నవంబర్‌లో చన్నపట్న ఉప ఎన్నికల్లో పోటీ చేసినా ఆయ‌న‌కు విజ‌యం ద‌క్క‌లేదు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement