
హంపిలో కట్టడాలకు ముప్పు?
- మూడు రోజులుగా నీటిలోనే స్మారకాలు
- ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పర్యాటకుల వినతి
సాక్షి, బళ్లారి : ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపిలోని ఆలయాల ఆవరణంలోకి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నీరు చేరడంతో కట్టడాల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి హంపి చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు సమీపంలోనే తుంగభద్ర డ్యాం నిండుగా తొణికిసలాడుతున్న సంగతి తెలిసిందే. హంపిలో కురుస్తున్న భారీ వర్షాలకు హంపి పూర్తిగా జలమయమైంది.
తుంగభద్ర డ్యాం 35 గేట్లు పూర్తిగా ఎత్తివేసినప్పుడు కూడా హంపిలోకి నీరు ప్రవహించలేదు. అయితే మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హంపి జలదిగ్బంధమైంది. ఈ నేపథ్యంలో పురాతన కట్టడాలైన విరుపాక్షేశ్వర ఆలయం, విజయవిఠల ఆలయం, లోటస్ మహల్ తదితర పురాతన కట్టడాలు నీటిలోనే ఉండటంతో కట్టడాలకు హాని కలిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దాదాపు 600 సంవత్సరాల క్రితం హంపిలోని స్మారకాల నిర్మాణాలు చేపట్టారు.
దీంతో పునాదులు, ఇతరత్రా కట్టడాల భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు వెంటనే హంపిని సందర్శించి భద్రతపై సమగ్రంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పర్యాటకులు భావిస్తున్నారు. హంపిలోని పర్యాటక ప్రాంతాలు జలమయమవడంతో పర్యాటకుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.