
ఇలాగైతే ఎలా?
- ‘తుంగభద్ర’కు పెరగని ఇన్‌ఫ్లో.. ఆందోళనలో మూడు రాష్ట్రాల ప్రజలు
- గత ఏడాదితో పోలిస్తే 46 టీఎంసీల నీరు తక్కువ
- గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 60 టీఎంసీల నీరు
సాక్షి, బళ్లారి : మూడు రాష్ట్రాల వరప్రసాదినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో రోజురోజుకూ నీరు అడుగంటుతోంది. తాగు, సాగునీటి అవరసరాలను తీరుస్తున్న ఈ జలాశయానికి ఇన్‌ఫ్లో పెరకపోవడంతో కర్ణాటకలోని బళ్లారి, కొప్పళ, రాయచూరు, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఆయకట్టు రైతులు నారుమళ్లు కూడా పోయలేని దుస్థితి నెలకొంది. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో 60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం కేవలం 14 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 46 టీఎంసీల మేర నీరు తక్కువగా ఉండడంతో వ్యవసాయ అవసరాలకు నీటిని ఎలా విడుదల చేయాలో అర్థం కాక బోర్డు అధికారులు తలలు పట్టుకున్నారు.
తాగునీటికి కటకటే..
గత ఏడాది జులై 20 నాటికి తుంగభద్ర డ్యాం నిండు కుండలా తొణికిసలాడింది. ప్రస్తుతం ఆ ఛాయలు కనిపించడం లేదు. దీంతో తాగునీటి కష్టాలు తీరడం కూడా ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే తుంగభద్ర జలాశయంపై ఆధారపడిన నగరాలు, పట్టణాలు, గ్రామాల ప్రజలు తాగునీటి కోసం హాహాకారాలు చేస్తున్నారు. బళ్లారిలో 15 రోజులకు ఒకసారి కూడా నీరు విడుదల చేయడం లేదంటూ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాలువలకు నీరు వదిలే వరకు బళ్లారి వాసులకు ఈ దుస్థితి తప్పదని అధికారులు తేల్చి చెబుతున్నారు.
నీటి విడుదలపై అనుమానాలు
గత ఏడాది జులై 7వ తేదీస హెచ్‌ఎల్సీ, ఎల్‌ఎల్సీకు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంకు ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీటి విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కాలువలకు నీరు వదలకపోవడంతో ఖరీఫ్ పంట సాగు అనుమానమేనని రైతులు పేర్కొంటున్నారు. మరో పది రోజుల్లో జలాశయంలోకి నీరు చేరకపోతే సాగునీటికే కాదు తాగునీటికి కూడా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు.