=ఐఏబీ సమావేశం ఎప్పటికో
=స్పష్టం చేయని ప్రభుత్వం
కృష్ణా డెల్టాలో రబీ సాగుపై సందిగ్ధం నేటికీ వీడలేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐఏబీ సమావేశం ఏర్పాటుకు పాలకులు ముందుకురాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. రబీ సీజన్‌లో మినుము సాగు చేసుకోవాలా, లేక వరిసాగు చేసుకోవాలా అనే సందిగ్ధంలో అన్నదాత కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వం నుంచి రబీకి నీరు విడుదల చేసే అంశంపై ప్రభుత్వం నుంచి నేటికీ స్పష్టమైన హామీ వెలువడలేదు. సాగునీటి ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుండటంతో రబీకి నీరు విడుదల చేస్తారనే ఆశతో రైతులు ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే వరి కోతలు ఊపందుకున్నాయి. నీరు విడుదల చేయబోమని చెబితే రెండో పంటగా మినుము, విడుదల చేస్తామని చెబితే నారుమడుల వరకు కోతకోసి నారుమడుల్లో విత్తనాలు చల్లుతారు.
రబీకి నీరు విడుదల చేసే విషయంపై నవంబరు మొదటి వారంలో సాగునీటిపారుదల సలహా మండలి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు (ఐఏబీ) సమావేశం నిర్వహించాల్సి ఉంది. త్వరితగతిన ఈ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదలశాఖ అధికారులు ఇటీవల కలెక్టర్‌కు లేఖ రాశారు. రబీ సీజన్‌లో వరిసాగుకు, తాగునీటి అవసరాలకు ఎన్ని టీఎంసీల నీరు అవసరమవుతుందనే అంశంపై ఐఏబీ సమావేశంలో చర్చించాల్సి ఉంది. అనంతరం సాగునీటిని విడుదల చేయాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందాలి.
ముందుకు రాని పాలకులు...
వచ్చిన చిక్కంతా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతోనే. ఐఏబీ సమావేశం ఏర్పాటుకు జిల్లాకు చెందిన మంత్రితో పాటు ఎమ్మెల్యేలు సుముఖంగా లేరనే వాదన రైతుల నుంచి వినపడుతోంది. ఓవైపు రబీలో ఏ పంటలు సాగు చేసుకోవాలో తెలియక సతమతమవుతుంటే కీలకమైన ఐఏబీ సమావేశం నిర్వహించడానికి పాలకులు ముందుకురావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఐఏబీ సమావేశం నిర్వహించి రబీకి నీరు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపారని, పక్క జిల్లాలకు చెందిన పాలకులను అనుసరించేందుకు కూడా మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కనీస చొరవచూపడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడని సందిగ్ధం
Published Thu, Nov 14 2013 12:58 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement