జిల్లా నుంచి పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలు!
ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న కరువుపై సర్కారు చేతులెత్తేసిందా? గతేడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రిక్తహస్తం చూపనుందా?.. ఈ ప్రశ్నలకు వ్యవసాయశాఖ అధికారులు అవుననే సమాధానమిస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే 30శాతం లోటు నమోదైనప్పటికీ.. సాగు విస్తీర్ణం బాగుందంటూ జిల్లా వ్యవసాయ శాఖ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని విశ్లేషించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కరువు సాయాన్ని తిరస్కరించినట్లు సమాచారం. దీంతో 2014 సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు నష్టపరిహారం దక్కే అవకాశాలు కనిపించడం లేదు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : 2014 ఖరీఫ్ సీజన్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యే చూపనుంది. గతేడాది ఖరీఫ్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ఆధారంగా జిల్లాలోని 37 మండలాలను కరువు మండలాలుగా జిల్లా వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.
ఈ ప్రతిపాదనలు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. వర్షపాతం లోటులో ఉన్నప్పటికీ.. సాగు విస్తీర్ణం ఆశాజనకంగా ఉందంటూ విశ్లేషించింది. దీంతో కరువు సాయానికి ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో గతేడాది ఖరీఫ్ నష్టాలనుంచి జిల్లా రైతాంగానికి ఉపశమనం లభించే అవకాశంలేదని తెలుస్తోంది.
30శాతం లోటులో ఉన్నా..
జిల్లాలో గతేడాది ఖరీఫ్ సీజన్‌లో వర్షపాతం 68.5 సెంటీమీటర్ల మేర కురవాల్సి ఉంది. అయితే వరుణుడి కరుణ లేకపోవడంతో వర్షాలు ఆశాజనకంగా పడలేదు. సీజన్ ముగిసేనాటికి 48.4సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో జిల్లాలోని 37 మండలాల్లో వర్షపాతం లోటు నమోదు కావడమే కాకుండా వర్షాల మధ్య అంతరం (డ్రైస్పెల్స్)సైతం భారీగా ఉందంటూ జిల్లా వ్యవసాయశాఖ కరువు మండలాల ప్రతిపాదనలు తయారు చేసింది.
అంతేకాకుండా విత్తనాలు వేసిన విస్తీర్ణాన్ని సైతం పేర్కొంటూ తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1,84,778 హెక్టార్లకుగాను 1,62,793 హెక్టార్లలో పంటు సాగైయ్యాయని.. మొత్తంగా 88శాతం సాగులోకి వచ్చినందున పరిహారం ఇవ్వడం కష్టమని రాష్ట్ర కార్యాలయ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
‘మొక్క’వోయిన కర్షకుడు..
జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే మొక్కజొన్న రైతుకు గత ఖరీఫ్ భారీ నష్టాల్నే మిగిల్చింది. సీజన్ ప్రారంభంలో వర్షాలు ఊరించడంతో 35,279 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 38,159 హెక్టార్లలో మొక్కజొన్న విత్తనాలు వేశారు. సీజన్ మధ్యలో వర్షాల జాడలేకపోవడం.. డ్రైస్పెల్స్ ఎక్కువగా నమోదు కావడంతో 90శాతం పంట దెబ్బతింది. దీంతో జిల్లాలోని మొక్కజొన్న రైతులు భారీ నష్టాల్నే చవిచూశారు. మరోవైపు కీలకమైన పత్తి పంటకు సైతం కరువుసెగ తగిలింది.
పత్తి పంటకు సంబంధించి జిల్లాలో 44,084 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 49,335 హెక్టార్లలో పంట వేసినట్లు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. ఈ పంటకు వరుణుడి దెబ్బ తగలడంతో దిగుబడి భారీగా పతనమైంది. అయితే విత్తనాలు వేసిన విస్తీర్ణాన్ని పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం.. పంట దిగుబడిని పెడచెవిన పెట్టింది. ఈ అంశంపై జిల్లా వ్యవసాయ శాఖ సైతం స్పష్టత ఇవ్వకపోవడంతో జిల్లా రైతులకు అన్యాయమే జరిగిందని ఓ అధికారి ‘సాక్షి’తో వాపోయారు.
కరువు సాయం కంచికి!
Published Thu, May 7 2015 11:45 PM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement