
వరి విత్తనాల కొరత
నిజామాబాద్ అగ్రికల్చర్: ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటామని, సకాలం లో విత్తనాలు, ఎరువుల సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. జిల్లాలో అధికశాతం రైతులు సాగుచేసే 1010 రకం వరి విత్తనాల కొరత తీవ్రంగా ఉంది. నాలుగురోజులుగా ఏపీసీడ్స్ ద్వారా ఈ విత్తనాలు అందడం లేదు. ఓ వైపు కాలం మించిపోతుండటం.. మరోవైపు విత్తన కొరత ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం విత్తనాలు అందుబాటులో ఉన్నాయంటూ.. వస్తాయంటూ రైతులను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ
జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు 1010 వరి రకంపై మొగ్గు చూపుతున్నారు. తక్కువ కాలంలోనే పంట చేతికి వస్తుండటం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఉండటంతో రైతులు ఈ వరి రకానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లకు సుమారుగా 120 నుంచి 150లారీల వరకు విత్తనాలు అమ్ముడు పోతాయి. రైతులు పండించిన ఈ రకం వరిధాన్యాన్ని రైస్‌మిల్లర్లు కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దిగుబడి కూడా ఆశించిన మేరకు ఉంటుందని రైతుల నమ్మకం. దీంతో జిల్లావ్యాప్తంగా ఈ విత్తనాలు విక్రయించేందుకు డీలర్లు, వ్యాపారులు ముందుకు వస్తున్నారు.
వీరికి జిల్లాకేంద్రం సమీపంలోని సారంగపూర్‌లో గల ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. రైతులు కూడా నేరుగా ఇక్కడి నుంచే విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. వ్యాపారుల వద్ద నాసిరకం విత్తనాలు కూడా ఉంటుండటంతో ఏపీసీడ్స్ నుంచే విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు సుముఖత చూపుతున్నారు. అయితే ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి అరకొర విత్తనాలు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు విత్తనాల కోసం ప్రతీరోజు సారంగపూర్‌కు వెళ్తున్నారు. అయితే అక్కడ వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది.
రబీకి మరింత కష్టం
రైతులకు 1010రకం వరి విత్తనాలను అందించేందుకు సంబంధిత శాఖాధికారులు జిల్లాలోని పలు ప్రాంతాలను విత్తన ఉత్పత్తి కోసం కేటాయిస్తారు. ఆయా ప్రాంతాల్లో కేవలం విత్తనోత్పత్తి కోసమే సాగు చేస్తారు. ఇలా సాగు చేసిన విత్తనాలను తిరిగి ఏపీసీడ్స్ వారు కొనుగోలు చేస్తారు. వాటినే సాగుకు అనుకూలంగా మలిచి రైతులందరికీ విక్రయిస్తారు. అయితే ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమైనా విత్తనాలు రైతులకు అందడం లేదు. రాబోయే రబీకి కావల్సిన విత్తనాల ఉత్పత్తి కోసం కూడా ఇంతవరకు విత్తనాలు ఇవ్వలేదని తెలిసింది. దీంతో వచ్చే రబీలో 1010 విత్తనాలు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విత్తనాల కొరతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో వరి విత్తనాలు అందించాలని రైతులు కోరుతున్నారు.