- మాజీ ఎంపీ తేజస్విణి ఆరోపణ
- కక్షసాధింపుతోనే ‘గాలి’ని జైలుకు పంపారు
- కాంగ్రెస్ రహిత రాష్ట్రంగా కర్ణాటకను తీర్చిదిద్దుతాం
సాక్షి, బళ్లారి : ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరుఫున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన మంత్రి డి.కె.శివకుమార్, బళ్లారిలోని అపారమైన ఖనిజసంపదపై కన్నేశాడని మాజీ ఎంపీ తేజస్విణి ఆరోపించారు. మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. బళ్లారి గ్రామీణ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.
డబ్బు, మద్యానికి ఓటు వేసే కాలం కాదని, అభివృద్ధి చేసిన వారికే బళ్లారి వాసులు పట్టం కడతారని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బీజేపీ వల్ల ఎలాంటి పదవీ గండం లేదని, ఒక్క డీకేశితోనే ఆయనకు ఇబ్బందులు ఎదురుకాగలవని అన్నారు. గాలి జనార్దనరెడ్డి ఎలాంటి తప్పు చేయకపోయినా కక్షతోనే జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ గనుల వల్ల ఎక్కువగా లాభపడింది డీకేశి మాత్రమేనని అన్నారు.
కనకపుర నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై డీకేశికి వ్యతిరేకంగా త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ చేపడితే బళ్లారి నుంచి 10 జనపథ్ వరకు కాంగ్రెస్ నేతలు 95 శాతం జైలులోనే ఉంటారన్నారు. కాంగ్రెస్ రహిత కర్ణాటకగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో మాజీ ఎంపీ శాంత, ఎమ్మెల్సీ వృత్యుంజయ జినగ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, నాయకులు సుధీర్, చెంచు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.