సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వేసవి ఎండలతో సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. యూపీ, బిహార్ ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీకి కర్ణాటక ఎన్నికల్లో పాగా వేయడం తక్షణ అవసరం. అలాగే, మోదీకి వ్యతిరేకంగా భావసారూప్యత ఉన్నా లేకున్నా శత్రువు శత్రువులను కూడగట్టుకుని బీజేపీని దెబ్బ కొట్టి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవటం రాహుల్‌కు కీలకం.
అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవటానికి రెండు పార్టీలూ సిద్ధంగా లేవు. రాహుల్ గాంధీ, అమిత్‌షా సర్వశక్తులూ ధారపోసి సత్తా చాటాలని యత్నిస్తున్నారు. పంజాబ్ తర్వాత హస్తం చేతుల్లో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక మాత్రమే. బీజేపీకి కర్ణాటకలో షాక్ ఇచ్చి 2019 ఎన్నికలకు సిద్ధం కావాలనేది కాంగ్రెస్ వ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టాలనేది బీజేపీ ప్రతివ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ ఖాతాలోకి వెళ్తుంది. తద్వారా జాతీయ రాజకీయ శక్తుల పునరేకీకరణలో కాంగ్రెస్ తన మాటను చెల్లించుకునే అవకాశం దక్కుతుంది.
ఓడిపోతే.. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’.. షా, మోదీల నినాదానికి ప్రజల మద్దతు దొరికినట్లవుతుంది. 1985 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. దళితులు, వెనుకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ ఆధారపడుతూ వస్తోంది. లింగాయత్‌లు, బ్రాహ్మణులు బీజేపీకి అండగా ఉండగా మరో బలమైన పార్టీ జేడీఎస్ వక్కళిగర్ ఓటు బ్యాంకును నమ్ముకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే బీజేపీ 132 అసెంబ్లీ సీట్లలో, కాంగ్రెస్ 77, జేడీఎస్ 15 స్థానాల్లో మెజారిటీ సాధించాయి.
ఆకర్షణ పనిచేసేనా?
బీజేపీ సీఎం అభ్యర్థిగా యడ్యూరప్ప ఇప్పటికే 75 రోజులపాటు రాష్ట్రమంతటా పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విమర్శల దాడి ప్రారంభించారు. ఫిబ్రవరి 4వ తేదీన బెంగళూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ సిద్దరామయ్య ప్రభుత్వ అవినీతిని ఉద్దేశించి ‘పది శాతం కమిషన్ ప్రభుత్వం’గా అభివర్ణించారు. అదే సమయంలో గౌరీ లంకేశ్ హత్యపై ఆయన మౌనంగా ఉండటం ఇబ్బంది కలిగించే అంశమే. మరోవైపు, ఉత్తరప్రదేశ్, బిహార్ ఎన్నికల్లో చావుదెబ్బతినటంతో బీజేపీ వ్యూహాలను మార్చుకోవాల్సి వచ్చింది.
యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్న ఎత్తుగడ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. బీజేపీ హయాం (2008–13)లో ముగ్గురు సీఎంలు మారారు. అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు, మత ఉద్రిక్తతలు ఆ పార్టీని దెబ్బతీశాయి. 2013 ఎన్నికల్లో అధికారం కోల్పోయి 40 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం, బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించి, పార్టీ చీఫ్ అమిత్ షా చాణక్యం, ప్రధాని మోదీ ఆకర్షణతో గట్టెక్కాలని ఆరాటపడుతోంది.
‘లింగాయత్’ కలిసొచ్చేనా?
ఈ ఐదేళ్లలో సీఎం సిద్దరామయ్య బలమైన నేతగా ఎదిగారు. సిద్దరామయ్య చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కన్నడిగుల ఆత్మగౌరవ నినాదంతో తలపెట్టిన ‘ప్రత్యేక జెండా’ ఉద్యమం, వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింల మద్దతు కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశాలు. అయితే, శాంతి భద్రతలు, అవినీతి ఆరోపణలు, రైతు ఆత్మహత్యలు సిద్దరామయ్యకు ఇబ్బంది కలిగించే అంశాలు. బీజేపీ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకుంటోంది. కర్ణాటకలో లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూల ఫలితాలు తీసుకొస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 17శాతం లింగాయత్‌లు ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్నారు.
తండ్రీకొడుకుల పార్టీ
మూడో ప్రధాన పార్టీ జేడీఎస్ తండ్రీకొడుకుల పార్టీ ముద్ర నుంచి బయటపడలేకపోయింది. అసంఘటిత రంగ కార్మికుల్లో కుమారస్వామికి మంచిపేరే ఉంది. బీఎస్పీ, వామపక్ష పార్టీలతో పొత్తు కొంతవరకు కలిసి వచ్చే అంశం.
Comments
Please login to add a commentAdd a comment