
సాక్షి, ఢిల్లీ: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కర్నాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే, ఈ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోం(ఇంటి వద్ద నుంచే ఓటు) సదుపాయం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మహిళ, పురుష ఓటర్లు దాదాపు సమానం. 80ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. వీరి సంఖ్య 12.15 లక్షలుగా ఉన్నట్టు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించామన్నారు. గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 41,312 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కర్నాటకలో 224 స్థానాలకు గానూ 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్ స్థానాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. కర్నాటకలో 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు స్పష్టం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ఇదే..
► ఏప్రిల్ 13న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్
► అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 20 చివరి తేదీ.
► ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన.
► ఏప్రిల్ 24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ.
► మే 10న పోలింగ్ జరుగనుంది.
► 13న ఓట్లు లెక్కింపు.