సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య చాముండేశ్వరీ స్థానాన్ని వదులుకుంటున్నారా? వేరే చోట నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సిద్ద రామయ్య ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆయనకు ఎదురు గాలి బలంగా వీస్తోంది. ఈ దఫా ఇక్కడ నుంచి బరిలోకి దిగితే ఓటమి తథ్యమన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. దీంతో సిద్దరామయ్య 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పాల్, బాదామి లేదా భాగల్‌కోట్ నుంచి బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గెలవడం కష్టమే
చాముండేశ్వరీలో ఈ దఫా సిద్దరామయ్య విజయం సాధించడం కష్టమేనని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ముఖ్యమంత్రికి స్పష్టం చేశాయి. స్థానికంగా బీజేపీ బలపడడం, హిందుత్వ వాదులు చాలావరకు బీజేపీకి బాసటగా ఉండడంతో ఇటువంటి పరస్థితులు తలెత్తాయి. అదే సమయంలో జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవేగౌడ కూడా బలంగా ఉన్నారు. ఈ ముక్కోణపు పోటీలో సిద్దరామయ్యకు అవమానకర ఫలితం ఎదురవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.
సీటు మార్పు.. ప్రతికూల ఫలితం
కర్ణాటకలో ముఖ్యమంత్రి తన స్థానాన్ని మార్చుకున్న ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిన దాఖలాలులేవు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గాన్ని మార్చుకోవడం ప్రజల్లోకి వ్యతిరేక భావనలు పంపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్‌ఎం కృష్ణ కూడా తమ నియోజకవర్గాలను మార్చుకున్నారు. ఆ ప్రభావం ఎన్నికలపై స్పష్టంగా కనిపించిందని విమర్శకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment