సాక్షి, ఢిల్లీ: దక్షిణ భారతంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కర్నాటకలో ఎన్నికల నగారా మోగింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ఇటీవలే కర్నాటకలోని బీజేపీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాలు అధికార పార్టీకి ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అనేది చూడాల్సి ఉంది. ఇక, బీజేపీ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ ప్లాన్ చేస్తున్నాయి.
కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. ఇక, రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ 119, కాంగ్రెస్ 75, జేడీఎస్‌కి 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, కర్నాటక ఎన్నికల్లో లింగాయత్ సామాజిక వర్గం ఎన్నికల ఫలితాలపై కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ ఏదైనా పార్టీ అధికారంలోకి రావలంటే వీరి ఓట్లే కీలకం అవుతాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార బీజేపీ ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది.
ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు.ఇదే క్రమంలో లింగాయత్‌లకు గతంలో ఉన్న 5శాతం రిజర్వేషన్ 7శాతానికి పెంచారు. అలాగే, విద్య, ఉద్యోగాల్లో లింగాయత్ వర్గాలకు రిజర్వేషన్‌ను పెంచారు.
వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు
వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే.
► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు.
► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు.
► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు.
► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన.
► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు.
► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి.
► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి.
కర్నాటకలో ఓట్ షేర్..
- బీజేపీ 36 శాతం.
- కాంగ్రెస్ 38 శాతం.
- జేడీఎస్ 18 శాతంగా ఉంది.
ఇదిలా ఉండగా.. ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. కర్నాటకలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ భారీ ప్లాన్ రచించింది. రాష్ట్రంలో ఇప్పటికే 124 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. జేడీఎస్.. 93 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ మాత్రం ఏప్రిల్ మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కర్నాటకలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. 150 స్థానాల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ముఖ్య నేతలు కర్నాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏకైన పాన్ ఇండియా పార్టీ. దక్షిణాదిలోనూ బీజేపీ బలపడుతోంది. కర్నాటకలో బీజేపీ ఎప్పటినుంచో అతిపెద్ద పార్టీ. తెలంగాణ ప్రజలకు భరోసా బీజేపీ మాత్రమేనని అన్నారు.
ఇది కూడా చదవండి: కర్నాటకలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. పోలింగ్ ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment