కాంగ్రెస్, బీజేపీ కూటమి హోరాహోరీ
14 లోక్‌సభ స్థానాలకు నేడే పోలింగ్
వీటిలో 11 బీజేపీ సిట్టింగ్ స్థానాలే
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నాటకలో 14 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయగా ఈసారి బీజేపీ–జేడీ(ఎస్) కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతోంది. జేడీ(ఎస్) పోటీ చేస్తున్న హసన్, మండ్య, కోలార్ స్థానాలకు రెండో విడతలోనే పోలింగ్ ముగియనుంది. ఆ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టడం విశేషం! ఈసారి పలు స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది...
బెంగళూరు నార్త్
బీజేపీ నేత సదానంద గౌడ 2014 నుంచీ ఇక్కడ గెలుస్తున్నారు. ఈసారి మాత్రం కేంద్ర సహాయ మంత్రి శోభ కరంద్లాజె పోటీ చేస్తున్నారు. ప్రముఖ విద్యావేత్త, కాంగ్రెస్ నేత ఎంవీ రాజీవ్‌గౌడను ఆమె ఢీకొడుతున్నారు. గౌడ బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్. ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సభ్యుడు. ఈ స్థానం 1999 దాకా కాంగ్రెస్ కంచుకోట. 2004 నుంచీ బీజేపీ జైత్రయాత్రే సాగుతోంది. దీనికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.
బెంగళూరు సౌత్
1996 నుంచి ఈ స్థానం బీజేపీకి కంచుకోట. బీజేపీ దివంగత నేత అనంతకుమార్ ఇక్కడినుంచి ఏకంగా 28 ఏళ్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు! 2019 ఎన్నికల్లో యువ నేత తేజస్వి సూర్య బీజేపీ తరఫున 3.31 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారీ ఆయనకే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారీ విజయం తనదేనని తేజస్వి ధీమాగా ఉన్నా పోరు హోరాహోరీగా సాగవచ్చంటున్నారు.
హసన్
మాజీ ప్రధాని దేవెగౌడ ఐదుసార్లు నెగ్గిన స్థానమిది. 2019లో మనవడు ప్రజ్వల్ రేవణ్ణను బరిలో దింపారు. బీజేపీ నేత ఎ.మంజుపై ఆయన 1.41 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఈసారి కూడా జేడీ(ఎస్) నుంచి ప్రజ్వలే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన నేతగా పేరున్న జి.పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయస్ పటేల్ పోటీలో ఉన్నారు. ఒకప్పుడు దేవెగౌడ, పుట్టస్వామి పోటీకి వేదికైన హసన్ వారి మనవళ్ల పోరుకు కేంద్రంగా మారింది!
కోలార్
ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన పట్టున్న కోలార్‌లో ఈసారి గట్టి పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచి్చన హామీలు ఇక్కడ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత ఎస్.మునిస్వామి 2.1 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ నేత కె.హెచ్.మునియప్పపై నెగ్గారు. ఈసారి పొత్తులో భాగంగా జేడీ(ఎస్) అభ్యర్థి ఎం.మల్లేశ్‌బాబు పోటీ చేస్తున్నారు. అంతర్గత విభేదాలు కూడా ఇక్కడ కాంగ్రెస్‌కు చేటు చేసేలా ఉన్నాయి. ఇక్కడ ఆరుసార్లు గెలిచిన మునియప్ప ఇటీవలి అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. లోక్‌సభ టికెట్‌ను తన అల్లుడికి ఇప్పించుకునేందుకు ప్రయతి్నంచగా సొంత పార్టీ నేతలే మోకాలడ్డారు.
సామాజిక వర్గాల ప్రభావం..
రెండో దశలో భాగంగా ఎన్నికలు నిర్వహించే 14 స్థానాలకు గాను మెజారిటీ చోట్ల వొక్కళిగ సామాజిక వర్గం ఓటర్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తుంటారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనా బీజేపీ దృష్టి సారించింది. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఓటర్లను ఆకర్షించడంపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది.
కరవు కోరలు
కర్ణాటకలోని అధిక ప్రాంతాలు ప్రస్తుతం చరిత్రలోనే అతి తీవ్రమైన కరువును చూస్తున్నాయి. దాదాపు అధిక శాతం పట్టణాలను కరువు ప్రాంతాలుగా ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కరువు కోరల్లోనే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఐదు గ్యారంటీలతో నెగ్గుకొచి్చన కాంగ్రెస్‌కు.. లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆ గ్యారంటీల ప్రభావం ఇప్పుడు అంతగా పనిచేయకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మండ్య
వొక్కళిగ ఆధిపత్యమున్న స్థానమిది. గత ఎన్నికల్లో నటి సుమలత బీజేపీ మద్దతుతో 1.26 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. ఈ స్థానం పొత్తులో భాగంగా ఈసారి జేడీ(ఎస్)కు వెళ్లింది. కుమారస్వామే బరిలో ఉన్నారు. సుమలత బీజేపీలో చేరడం ఆయనకు మరింత కలిసి రానుంది. కాంగ్రెస్ నుంచి వెంకటరమణ గౌడ (స్టార్ చంద్రు) బరిలో ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి జేడీ(ఎస్) విజయం సాధించడం కూడా కుమారస్వామికి కలిసొచ్చే అంశాల్లో ఒకటి.
బెంగళూరు రూరల్
2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానమిది. ఈసారి కూడా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు, సిట్టింగ్ ఎంపీ డీకే సురేశ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2009లో జేడీ(ఎస్) నేత కుమారస్వామి గెలిచారు. కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉండటంతో దేవెగౌడ అల్లుడు, ప్రముఖ వైద్యుడు సి.ఎన్.మంజునాథను బీజేపీ బరిలో దింపింది. ఇద్దరూ బలమైన అభ్యర్థులు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. చారిత్రకంగా ఇక్కడ హస్తానిదే ఆధిపత్యం. ఆ పార్టీ ఏకంగా 13 సార్లు నెగ్గగా మూడుసార్లు జేడీ(ఎస్) గెలిచింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment