మంత్రి పరమేశ్వర నాయక్ రాజీనామా చేయాలి
బళ్లారి : బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్‌పీ అనుపమ షణై రాజీనామాను పోలీసు ఉన్నతాధికారులు ఆమోదించడంతో బళ్లారి జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 4వ తేదీన కూడ్లిగి డీఎస్‌పీ అనుపమ షణై రాజీనామా చేసి నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి గురువారం కూడ్లిగిలోని తన నివాస గృహానికి చేరుకుని ఆమె రాజీనామా ఉపసంహరించేది లేదని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం రాత్రి కల్లా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు అనుపమ రాజీనామాను అమోదించారు. ఈ నేపథ్యంలో బళ్లారి జిల్లాలో సండూరు పట్టణంలో జన సంగ్రామ పరిషత్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. అనుపమ షణై రాజీనామా వెనుక ప్రధాన కారణమైన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కూడ్లిగి డీఎస్‌పీగా పని చేసిన అనుపమ షణై ఎంతో నిజాయితీ పరురాలని పేర్కొన్నారు. మద్యం వ్యాపారులు, మంత్రి వల్ల ఎంతో మనస్థాపం చెందిన అనుపమ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఆమె రాజీనామాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సండూరులో జన సంగ్రామ సమితి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ స్థానిక ఏపీఎంసీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ధర్నాలో మహిళలు, వృద్దులు కూడా పాల్గొని ఆమెకు మద్దతుగా నిలిచారు. అనుపమ విధుల్లో చేరే విధంగా పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయాలని వారు డిమాండ్ చేశారు.