
కూడ్లిగిలో అనుపమ !
రాజీనామా వెనక్కు తీసుకునే ప్రశ్నే లేదు
న్యాయపోరాటానికి సిద్ధం
ఫేస్‌బుక్‌లో నేను కామెంట్ చేయలేదు
పరమేశ్వర్ నాయక్ రాజీనామా చేయాలని కూడ్లిగిలో నిరసనలు
బళ్లారి : ఎట్టకేలకు కూడ్లిగి డీవైఎస్‌పీ అను పమ షణై కూడ్లిగి డీఎస్‌పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. రాజీనామా చేసిన అనంతరం ఐదు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనుపమ షణై ఎక్కడ ఉన్నారో ఆచూకీ కనుగొనేందుకు జిల్లా ఎస్‌పీ ఆర్.చేతన్ పోలీసు బృందాలను ఉడిపికి కూడా పంపిన సంగతి తెలిసిందే. ఆమె రాజీనామా చేయడంతో సీఎం సిద్దరామయ్య కూడా రంగంలో దిగి ఆమెతో ఎలాగైనా రాజీనామా ఉపసంహరించుకునేలా చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు తెలపడంతో డీజీపీ కూడా రంగంలోకి దిగి ఆమెను రాజీనామా ఉపసంహించుకునే దిశగా ఎస్‌పీ ఆర్.చేతన్‌కు సూచనలు ఇచ్చారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమశ్వర్ నాయక్ వ ర్సస్ అనుపమ షణై వార్ జరుగుతోంది. జిల్లా మంత్రిపై ఫేస్‌బుక్‌లో అనుపమ షణై వాగ్బాణాలు సంధించిన నేపథ్యంలో జిల్లా మంత్రిపై సంఘ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం అనుపమ షణై తన సోదరుడితో కలిసి ప్రైవేటు కారులో కూడ్లిగిలోకి అడుగు పెట్డడటంతో ఒక్కసారిగా భారీ జన సందోహం తరలి వచ్చారు. కూడ్లిగిలోని తన ప్రభుత్వ అధికార నివాసంలో ఆమె కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత డీవైఎస్‌పీ కార్యాలయానికి చేరుకుని తనకు సంబంధించిన రికార్డులను తీసుకున్నారు.
అనంతరం ఆమె మీడియా ప్రతినిధులు, విలేకరులతో మాట్లాడుతూ... తాను సమర్పించిన తన రాజీనామాను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. తాను పోలీసు ఉన్నతాధికారులెవరినీ కలిసే అవసరం లేదన్నారు. ఫేస్‌బుక్‌లో తన పేరు మీదుగా ఎవరో ట్వీట్ చేస్తున్నారని, తాను ఫేస్‌బుక్ అకౌంట్ కూడా ఓపెన్ చే యలేదన్నారు. ఫేస్‌బుక్‌లో అజ్ఞాత వ్యక్తులు ట్వీట్లు చేసిన అంశంపై కేసు పెడతారా? అని విలేకరులు ప్రశ్నించగా, కేసు పెడితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ఇక నుంచి తాను చట్టపరంగా పోరాటం చేస్తానని పేర్కొన్నారు. మొత్తం మీద అనుపమ షణై రాజీనామా అంశం ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో స్వయానా సీఎం సిద్దరామయ్య, హోం మంత్రి పరమేశ్వర్లు జోక్యం చేసుకున్న ఫలితం కనిపించలేదు. ఆమె రాజీనామా ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పడంతో పోలీసు ఉన్నతాధికారులకు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్‌లకు సవాల్‌గా మారింది. అనుపమ షణై రాజీనామా ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పడంతో కూడ్లిగిలో అమెకు మద్దతుగా భారీ ప్రదర్శనలు చేశారు.
కూడ్లిగిలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, తాలూకా పంచాయతీ మెంబర్లు తదితరుల నేతృత్వంలో డీవైఎస్‌పీ కార్యాలయం ముందు ఆమెకు మద్దతుగా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కూడ్లిగి జాతీయ రహదారిలో ధర్నా చేపట్టడంతో వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పెద్ద ఎత్తున నిరసన కారులలో రోడ్డుపై బైఠాయించి మంత్రి పరమేశ్వర నాయక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అనుపమ షణైకు మద్దతుగా నినాదాలు చేశారు. జాతీయ రహదారి-13ని దిగ్బంధనం చేయడంతో కిలోమీటర్ల పొడవున వాహనాలు ఆగిపోయాయి.