
ఆయన మంచోడే కానీ...
బెంగళూరు: లిక్కర్ మాఫియాకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించి, తన ఉద్యోగానికి రాజీనామా చేసిన అనుపమా శ్ణైమరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ‘మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్ అంత చెడ్డ వ్యక్తేమీ కాదు, నా వల్లనే ఆయనకు అన్యాయం జరిగింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం సృష్టించాయి. ‘నేను రాజీనామా చేశాను, మరి మీరెప్పుడు మీ పదవికి రాజీనామా చేస్తారు?’ అంటూ తన ఫేస్‌బుక్ పేజ్‌లో ప్రశ్నించిన అనుపమా శ్ణై పరమేశ్వర్ నాయక్ మంత్రి పదవి నుంచి తప్పుకోగానే ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఉడుపిలోని తన స్వగ్రామమైన ఉచ్చిలలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనుపమా శ్ణైమాట్లాడారు. ‘నన్ను బదిలీ చేయడంలో కొంతమంది పెద్దల హస్తం ఉంది. పరమేశ్వర్ నాయక్ నిమిత్తమాత్రుడు. డీజీపీ ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి నన్ను బదిలీ చేశారు.
ఈ విషయంలో పరమేశ్వర్ నాయక్ ఒత్తిడి తీసుకువచ్చేందుకు అవకాశాలు తక్కువ. నా బదిలీ విషయంలో ఇంకా పెద్దల హస్తం ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. డీజీపీ, మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్‌లు ఆ వ్యక్తుల పేర్లను బయటపెట్టాలని అనుపమా శ్ణైడిమాండ్ చేశారు. తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణపై ఇప్పటికే మహిళా కమిషన్ అధ్యక్షురాలు మంజుల మానసకు లేఖ రాశానని తెలిపారు. ఇదే సందర్భంలో ఆమె ప్రభుత్వంపై సైతం తన విమర్శల పరంపరను కొనసాగించారు. ‘ఓ మాజీ అధికారిని ఎదుర్కొనే ధైర్యం మీకు లేదా? మీరు పోరాడదలచుకుంటే నాతో నేరుగా పోరాడండి, అంతేకానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి’ అని అనుపమా శ్ణైపేర్కొన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోనని, లెక్చరర్ అవుతానని, లేదంటే ఏదైనా ఎన్‌జీఓలో చేరి సమాజ సేవ చేస్తానని అనుపమా శ్ణైవిలేకరుల ప్రశ్నకు బదులిచ్చారు.