
తన రాజీనామా డిమాండ్లపై జెలెన్‌స్కీ
ఎన్నికలొచ్చినా తనదే గెలుపని వ్యాఖ్య
ఖనిజాల ఒప్పందానికి సిద్ధమని వెల్లడి
మాకు అమెరికా సాయం కొనసాగాలి
లేదంటే పుతిన్‌కే లాభమన్న అధ్యక్షుడు
లండన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో వాగ్యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా(Resignation) చేయాలన్న వైట్‌హౌస్ అధికారులు, రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలపై జెలెన్‌స్కీ(Zelensky) మండిపడ్డారు. అమెరికాతో ఉక్రెయిన్ మళ్లీ చర్చలు జరపాలంటే జెలెన్‌స్కీ వైదొలగాలని, కొత్త అధ్యక్షుడు చర్చలకు రావాలని సెనేటర్ లిండ్సే గ్రాహం, హౌస్ స్పీకర్ మైక్‌జాన్సన్ సూచించారు. వీటిపై జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం లండన్‌లో యూరప్ దేశాల నాయకులతో కీలక శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘ఉక్రెయిన్ నాయకున్ని నిర్ణయించుకునే హక్కు ఉక్రేనియన్లకు మాత్రమే ఉంది. మా దేశంలో నాయకత్వం స్థానం కావాలంటే గ్రాహం కూడా ఉక్రెయిన్ పౌరసత్వం తీసుకోవచ్చు. ఆయనకు నేను పౌరసత్వం ఇవ్వగలను. అప్పుడాయన మా దేశ పౌరుడు అవుతాడు. ఆయన వ్యాఖ్యలకు విలువా ఉంటుంది. అతడు ఉక్రెయిన్ పౌరునిగా చెప్పేది వింటాను’’అంటూ సూటి వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరిస్తే అధ్యక్ష పదవి వీడేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. అదే సమయంలో తనను మార్చడం అంత సులభం కాదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. తాను గెలవకుండా ఉండాలంటే ఎన్నికల్లో పాల్గొనకుండా తనను అడ్డుకోవడమే మార్గమని ధీమా వ్యక్తం చేశారు.
ఒప్పందానికి ఉక్రెయిన్ సిద్ధమే
అమెరికాతో ఖనిజాల ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. వాళ్లు సరేనంటే ఇప్పటికిప్పుడు ఒప్పందంపై సంతకాలు చేస్తానన్నారు. ‘‘గతంలో జరిగిన వాటిని కొనసాగించాలన్నది మా విధానం. మేం నిర్మాణాత్మకంగా ఉన్నాం. అదే సమయంలో కొన్ని విషయాలను విశ్లేషించాల్సిందే. ఉక్రెయిన్ వైఖరి వినాలి. అది మాకు చాలా ముఖ్యం. అమెరికాతో మా సంబంధాలు కొనసాగుతాయని అనుకుంటున్నా.
ఉక్రెయిన్ ప్రపంచంలో అతి పెద్ద దేశం కాకపోవచ్చు. కానీ తన స్వాతంత్య్రం కోసం అది చేస్తున్న పోరాటాన్ని అంతా చూస్తున్నారు. అమెరికా నుంచి ఏ అనుమానాలకూ తావు లేకుండా సాయం కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే మాకు సాయం నిలిపివేత అంతిమంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. అమెరికా, ఇతర ప్రపంచ ప్రతినిధులు పుతిన్‌కు అలాంటి సాయం చేయరని అనుకుంటున్నా’’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment