శ్రీరాములూ..శ్వేతపత్రం అంటే తెలుసా?
- మీరేం అభివృద్ధి పనులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి
- కాంగ్రెస్ వల్లే బళ్లారికి స్వేచ్ఛ
- బీజేపీ అబద్దాల పార్టీ
- దశలవారీగా హామీలు నెరవేరుస్తున్నాం
- కాంగ్రెస్‌ను గెలిపిస్తే బళ్లారి రూరల్ సమగ్రాభివృద్ధి
- ముఖ్యమంత్రి సిద్ధరాయమ్య
సాక్షి, బళ్లారి : బళ్లారి జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన బళ్లారి ఎంపీ శ్రీరాములు ముందు శ్వేతపత్రం అంటే ఏమిటో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సూచించారు.
బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా ఆదివారం ఆయన మోకా గ్రామంలో బహిరంగ సభలో మాట్లాడారు. ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా బళ్లారి గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన శ్రీరాములు వల్లే పదే పదే ఉప ఎన్నికలు వస్తున్నాయన్నారు.
అసెంబ్లీలో ఏ ఒక్క రోజూ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించని మీరు గతంలో బళ్లారి నియోజకవర్గానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదుల చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులోకూడా ఆయన నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. శ్రీరాములు నిలిపిన అభ్యర్థితో అభివృద్ధి జరగదని, తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తాను ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్ర వల్లే బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు నిలిచిపోయినట్లు తెలిపారు. తప్పులు చేసినందుకే గాలి జనార్దనరెడ్డి జైల్లో ఉన్నారని గుర్తుచేశారు.
క్విట్ బీజేపీ, క్విట్ రిపబ్లిక్ ఆఫ్ బళ్లారి అనే పిలుపుతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారని, ఎన్నిక హామీలను దశలవారిగా తీరుస్తున్నామన్నారు. బీజేపీ అపద్దాల పార్టీ అని, ఆపార్టీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. పదే పదే ఉప ఎన్నికలకు కారణమయ్యేవారికి బుద్ధి చెప్పాలన్నారు. తాము కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడటం లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థి ఎన్‌వై గోపాలకృష్ణ స్థానికేతరుడు కాదని, బళ్లారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ఆయనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారుస్తామని చెప్పారు.
కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర, మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం, మంత్రులు డీకే శివకుమార్, పరమేశ్వరనాయక్, శివరాజ్‌తంగిడిగి, మాజీ మంత్రులు అల్లం వీరభద్రప్ప, దివాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీ కేసీ కొండయ్య, నగర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, ఎమ్మెల్యే అనిల్‌లాడ్, నబీసాబ్, చేనేత వర్గాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డీ.లక్ష్మీనారాయణ, అబ్దుల్ వహాబ్, రాంప్రసాద్, ఉగ్రప్ప, వండ్రీ(వన్నూరప్ప), కాంగ్రెస్ అభ్యర్థిఎన్‌వై గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.