సాక్షి, బళ్లారి : బంగారం ధర తగ్గినా కొనుగోళ్లు భారీగా పడిపోతున్నాయి. బంగారం ధర భారీగా తగ్గుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం పెరగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా బంగారం ధరలు స్థిరంగా లేకపోవడంతో రోజు రోజుకీ తగ్గుముఖం పట్టడం లేదా కొంత పెరగడం తరుచూ జరుగుతుండటం వల్ల బంగారం వైపు జనానికి మోజు తగ్గుతోందని వ్యాపారులు భావిస్తున్నారు.
బళ్లారి నగరంలోని బెంగళూరు రోడ్డులో బంగారు అంగళ్లు ఎక్కువగా ఉన్నాయి. వీటికి తోడు మోతీ సర్కిల్ వద్ద టాటా గోల్డ్ ప్లస్ కంపెనీ వారు అతి పెద్ద జువెలరీ షాపును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బంగారం తగ్గుముఖం పట్టడం వల్ల సగానికి సగం బంగారం కొనుగోళ్లు పడిపోయినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. బంగారం పెరిగే సమయంలో కొనుగోళ్లు బాగా జరిగేవని, ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పడుతుండటం వల్ల ఇంకా తగ్గుతుందనే ఆశ వినియోగదారుల్లో ఉండటం వల్ల కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపడం లేదు.
దీంతో నిత్యం వ్యాపారులతో కళ కళలాడే బంగారు అంగళ్లు వెలవెలబోతున్నాయి. బంగారం దుకాణాలు ఉండే బెంగళూరు రోడ్డు నిత్యం జనంతో కిటకిటలాడేది. ప్రస్తుతం ఆ రోడ్డులో కూడా జనం తక్కువగా కనిపిస్తున్నారు. నిత్యం రూ.లక్షల వ్యాపారం అయ్యే షాపులు వెలవెలబోతున్నాయి. బంగారం ధర తగ్గుముఖం పట్టడంతోపాటు పెళ్లిళ్ల సీజన్లు లేకపోవడం కూడా కొనుగోళ్లు పడిపోవడానికి కారణమని వ్యాపారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు పేర్కొంటున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,000 ఉన్న సమయంలో వ్యాపారం జరిగేదని, ప్రస్తుతం రూ.27,000 ధర ఉన్నప్పటికీ బంగారం జోలికి జనం వెళ్లడం లేదు. ఈ సందర్భంగా బెంగళూరు రోడ్డులోని రాజ్‌మహాల్ బంగారు దుకాణం యజమాని ఎస్.సురేష్ మాట్లాడుతూ బంగారం ధరలు తగ్గుతుండటం వల్ల వ్యాపారాలు పెరుగుతాయని అనుకున్నామని, అయితే తగ్గుముఖం పట్టినప్పటి నుంచి వ్యాపారం మరింత పడిపోయిందన్నారు.
బంగారం కొనుగోళ్లు ఢమాల్
Published Sat, Oct 11 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM
Advertisement