- ప్రగతి కృష్ణ గ్రామీణ బ్యాంకుకు చెందిన రూ.30 లక్షలు లూటీ
- దుండగుల కోసం పోలీసుల నాకాబందీ
సాక్షి, బళ్లారి : బళ్లారిలో సోమవారం రెప్పపాటులో రూ.30 లక్షల చోరీ జరిగింది. బళ్లారి తాలూకా కొర్లగుంది ప్రగతి కృష్ణా గ్రామీణ బ్యాంకుకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది గాదిలింగ, అరుణ బళ్లారి గాంధీనగర్‌లోని ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.30 లక్షల నగదు తీసుకుని కేఏ-34 ఎన్-6890 నంబరుగల కారులో పెట్టుకుని బయలు దేరారు.
కొంతదూరం వెళ్లగానే కారు టైర్ పంక్చర్ అయింది. దీంతో మాజీ ఎంపీ ఎన్‌వై హనుమంతప్ప ఇంటి సమీపంలో ఓ షాపులో కారు టైరుకు పంక్చర్ వేయించడానికి ఆగారు. పం క్చర్ వేస్తుండగా బ్యాంకు సిబ్బంది కారు డోరు వేసి కిందకు దిగారు. బ్యాంకు నుంచి వచ్చిన కారును గమనించిన ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంలో వచ్చి కారు వద్ద ఆపి అందులోని రూ.30 లక్షల నగదును క్షణాల్లో ఎత్తుకెళ్లారు.
ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది దొంగ.. దొంగ అంటూ అరిచేలోపు మాయమయ్యారు. వెంటనే స్థానిక గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్‌పీ మురుగణ్ణ నేతృత్వంలో నగరంలో నాకాబందీ నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.