సాక్షి, బళ్లారి : బిసల బళ్లారిలో మళ్లీ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. 45 డీగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోవడంతో ఎండల వేడికి నగర ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడమి తట్టుకోలేక ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయల నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఎండలు బలంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల వద్ద జనం కిటకిటలాడుతున్నారు. బళ్లారితోపాటు జిల్లా వ్యాప్తంగా కంప్లి, హొస్పేట, సిరుగుప్ప, హడగలి, హగరిబొమ్మనహళ్లి తదితర నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల జనం ఉక్కపోత భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో ఉదయం నుంచి 24 గంటలు ఫ్యాన్లు, ఏసీలు పెట్టుకున్నా చల్లబటం లేదని నగర వాసులు అంటున్నారు.