మేఘాలకే షాకిచ్చి.. వానలు కురిపించి.. | UAE Temperatures Hit Near 50 Degrees Celsius In Dubai | Sakshi
Sakshi News home page

మేఘాలకే షాకిచ్చి.. వానలు కురిపించి..

Published Mon, Aug 2 2021 4:20 AM | Last Updated on Mon, Aug 2 2021 7:13 AM

UAE Temperatures Hit Near 50 Degrees Celsius In Dubai - Sakshi

ఇక్కడ మనకు వానాకాలం.. కానీ దుబాయ్‌లో ఇప్పుడు ఎండలు మండిపోయే వేసవికాలం. టెంపరేచర్లు విపరీతంగా పెరిగిపోవడంతో జనం హహాకారాలు చేస్తున్న పరిస్థితి. మరెలాగని ఆలోచించిన దుబాయ్‌ ప్రభుత్వం.. మేఘాలకు కరెంటు షాక్‌లు ఇచ్చి వాన కురిపించింది. మేఘాలకు కరెంట్‌ షాక్‌ ఇవ్వడమేంటి? దాంతో వాన కురిపించడమేంటి? అనే డౌట్లు వస్తున్నాయి కదా.. మరి ఆ సంగతులేమిటో తెలుసుకుందామా? 

ఎండల మంటలు.. 
దుబాయ్‌లో కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 50 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. పగటివేళ ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దుబాయ్‌ వాతావరణ శాఖ రంగంలోకి దిగి కసరత్తు చేసింది.‘క్లౌడ్‌ సీడింగ్‌ (మేఘ మథనం)’ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించగలిగితే.. వాతావరణాన్ని కాస్త చల్లబడేలా చేయవచ్చని నిర్ణయానికి వచ్చింది. ఈ దిశగా ప్రభుత్వంనుంచి అనుమతి పొందింది. 

డ్రోన్లతో షాకులిచ్చి.. 
మేఘ మథనంలో రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. మేఘాలపై కొన్ని రకాల రసాయనాలు, ఉప్పు వంటివి చల్లడం.. మేఘాలకు విద్యుత్‌ షాక్‌ ఇవ్వడం వంటివాటి ద్వారా వానలు పడే అవకాశం ఉంటుంది. ఇందులో దుబాయ్‌ అధికారులు కరెంటు షాక్‌ ఇచ్చే పద్ధతిని ఆచరించారు. పెద్దసైజు డ్రోన్ల సాయంతో మేఘాలకు విద్యుత్‌ షాక్‌ ఇచ్చారు. దానితో వర్షాలు కురిశాయి. 

నీటి కరువును ఎదుర్కొనేందుకు.. 
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో వానలు చాలా తక్కువగా పడతాయి. ఏడాది సగటు వర్షపాతం 10 సెంటీమీటర్లు మాత్రమే. ఇటీవల మరింతగా తగ్గిపోతోంది. దీంతో దుబాయ్‌ ప్రభుత్వం 2017లోనే మేఘ మథనంపై దృష్టి సారించింది. రూ.112 కోట్ల (1.5 కోట్ల డాలర్ల)తో తొమ్మిది వేర్వేరు ప్రాజెక్టులకు చేపట్టింది. మేఘాలపై రసాయనాలు చల్లడం కాకుండా షాక్‌ ఇచ్చే పద్ధతిపై దుబాయ్‌కు చెందిన రీడింగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంతకాలంగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా డ్రోన్లను మేఘాలపైకి పంపి కరెంటు షాక్‌ ఇచ్చే ప్రాజెక్టును అమలు చేశారు. 

షాక్‌తో వాన పడేదెట్లా?
మేఘాలు అంటే నీటి ఆవిరి దట్టంగా ఒకచోట కూడి ఉండటమే. వాటిలో నీటి ఆవిరి కణాలు దూరం దూరంగా ఉంటాయి. సాధారణంగా భారీగా మేఘాలు ఏర్పడినప్పుడు నీటి ఆవిరి ఎక్కువై బరువు పెరగడం, లేదా వాతావరణ పీడనంలో మార్పుల వల్ల మేఘాలపై ఒత్తిడి వల్ల వర్షం పడుతుంది. ఎండాకాలంలో ఈ పరిస్థితులు ఉండవు, మేఘాలు పెద్దగా ఏర్పడవు కాబట్టి వానలు కురవవు. ప్రస్తుతం దుబాయ్‌లో మేఘాలు వాటంతట అవే కురిసే పరిస్థితి లేక మేఘ మథనాన్ని ఆశ్రయించారు. 

డ్రోన్లతో మేఘాలకు విద్యుత్‌ షాక్‌లు ఇచ్చినప్పుడు నీటి ఆవిరి కణాల్లో స్వల్పంగా అయస్కాంత శక్తి పుడుతుంది. ఉదాహరణకు.. మనం వెంట్రుకలను దువ్వినప్పుడు దువ్వెనలో స్వల్పంగా పుట్టే విద్యుత్‌ కాగితం ముక్కలను ఆకర్షించినట్టుగా.. నీటి ఆవిరి కణాలు ఆకర్షించుకుని కలిసిపోతాయి. తుంపర్లుగా, నీటి బొట్లుగా మారి వర్షం కురుస్తుంది. దుబాయ్‌లో జరిగింది ఇదే. 

పెళ్లి రోజు వాన పడొద్దని..
వానలు పడటం కోసం ఉద్దేశించిన మేఘ మథనాన్ని మరో రకంగా కూడా ఉపయోగించుకున్న ఘటనలు ఉన్నాయి. 
బ్రిటిష్‌ రాణి కుమారుడు ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్‌టన్‌ల వివాహం వానాకాలంలో జరిగింది. పెళ్లి జరిగే రోజు వర్షంపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంతో ఆ రోజున వాన పడకుండా ఉండేందుకు.. ముందురోజే భారీస్థాయిలో మేఘమథనం చేసి మేఘాలన్నింటినీ ఖాళీ చేసేశారు. పెళ్లి జరిగిన రోజున చుక్క వాన పడలేదు. 

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ సమయంలోనూ చైనా ఇదే పనిచేసింది. ప్రారంభోత్సవం రోజున వాన పడకుండా ఉండేందుకు.. అంతకుముందు రోజే రసాయనాలు నిం పిన రాకెట్లను మేఘాలకన్నా పైకి పంపి పేల్చివేసింది. ఆ రసాయనాల కారణంగా మేఘాలు ఖాళీ అయిపోయాయి. ప్రారంభోత్సవం సాఫీగా జరిగిపోయింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement