మానవుడు నిరంతరం ప్రకృతిని గాయపరుస్తూ కొత్త కష్టాలు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే ప్రకృతి ప్రకోపం ముందు పలుమార్లు ఓడిపోయాడు. అయినా లెక్కచేయకుండా ప్రకృతి సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. ఇంకా వందేళ్లకు ప్రకృతి పూర్తిగా సహనం కోల్పోయే అవకాశం ఉందట! 2100 నాటికి వాతావరణ మార్పుల కారణంగా మానవాళిపై ఒకేసారి పలు ప్రకృతి విపత్తులు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని మనోవాలోని హవాలీ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది. వడగాడ్పులు, కార్చిచ్చులు, వరదలు, ఉప్పెనలు తదితర విపత్తులు శతాబ్దాంతానికి విధ్వంసం సృష్టిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల రూపంలో వాతావరణంపై అంతకంతకు పెరిగిపోతున్న భారం జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టే విపత్కర పరిణామాలకు దారితీస్తోంది. ఇది ఉష్ణోగ్రతల పెరుగుదలతో మొదలై.. క్రమంగా కరువు కాటకాలు, వడగాడ్పులకు, కాలిఫోర్నియా తరహా ప్రాణాంతక కార్చిచ్చులకు కారణమవుతుంది. తడి వాతావరణం వున్న చోట.. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతాయి.
వింత పోకడలు సంభవిస్తాయి
గతేడాది ఫ్లోరిడా తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంది. ముందెన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వందకు పైగా కార్చిచ్చులు రాజుకున్నాయి. తీవ్రమైన తుపాను (హరికేన్ మైఖేల్) కూడా తన ప్రతాపం చూపింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలో కార్చిచ్చు రేగింది. గత వేసవిలో ఆ ప్రాంతం దీర్ఘ కరువు– తీవ్ర వడగాడ్పులతో అతలాకుతలమైంది. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ ఘోర ఉదంతాలను లక్ష్యపెట్టకుంటే.. భారీ వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
ప్రస్తుత మోతాదులోనే కర్బన ఉద్గారాలు వ్యాప్తి చేస్తే.. ఏకకాలంలో అనేక విపత్తులు ఎదుర్కొనక తప్పదని, అధిక ఉద్గారాల కారణంగా పెరిగిపోతున్న భూతాపం గతంలో మనం అనుకుంటున్న దాని కంటే భారీ ముప్పుకు కారణమవుతుందని, నత్తలు, పాములు సహా జంతువుల ప్రవర్తనలో మార్పులు రావడం లాంటి వింత పోకడలు సంభవిస్తాయని వారు వివరిస్తున్నారు.
కాగా, ప్రకృతి విపత్తుల నుంచి మానవ సమాజాన్ని పరిరక్షించుకునేందుకు 195 దేశాలు ‘పారిస్ ఒప్పందం’కుదుర్చుకున్నాయి. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చేయాలని నిర్ణయించుకున్నాయి. దీని అమలుపైనే మానవాళి భవిష్యత్తు ఆధారపడివుందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉష్ణ మండల తీర ప్రాంతాలకు మరింత ముప్పు..
భూతాపోన్నతి వల్ల సముద్రాలపై విధ్వంసకర తుపాన్లు వస్తాయి. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల దీని తీవ్రత మరింత పెరుగుతుంది. ఎండిపోయిన నేలలు వాతావరణంలో ఉహించలేనన్ని మార్పులకు కారణమవుతాయి. తక్కువ జీవులున్న దేశాల్లో 2100 నాటికి వాటి జనాభా పెరుగుతుంది. విపత్తుల తీవ్రత ధనిక దేశాలతో పాటు పేద దేశాలనూ ప్రభావితం చేస్తుంది. ఉష్ణమండల తీర ప్రాంతాల్లో నష్టం భారీగా వుంటుంది. ప్రపంచదేశాలు వేగంగా స్పందించి, కర్బన ఉద్గారాలను తగ్గించగలిగినట్టయితే భవిష్యత్తు నష్టాన్ని నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 2095 నాటికి సిడ్నీ, లాస్ ఏంజిలెస్ ఒకేసారి 3 ప్రకృతి విపత్తుల వలయంలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని, మెక్సికో నగరం 4 విపత్తులతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదముందని, బ్రెజిల్ అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతం 5 ఉపద్రవాల బారిన పడొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ విపత్తులు మానవుల ఆరోగ్యం, ఆహారం, నీరు, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, భద్రతపై చూపే ప్రభావం గురించి వారు విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment