
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ ఎండాకాలంలా మారిపోయింది. ఈసారి వానాకాలం మొదట్లో చినుకు జాడ లేక, తర్వాత భారీ వర్షాలు కురిసి.. ఆగస్టులో అయితే నెలంతా వానలు పడక చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల మొదట్లో మంచి వర్షాలే పడినా.. మళ్లీ వాతావరణం భిన్నంగా మారిపోయింది.
సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు ఉక్కపోతతోనూ ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా ఈ పరిస్థితి ఉండగా.. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.
మబ్బులు మాయమై..
సాధారణంగా వానాకాలం చివరిలో తేలికపాటి వర్షాలే కురిసే పరిస్థితి ఉన్నా.. ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంటుంది. రుతుపవనాల కదలిక ఎక్కువగా ఉంటే భారీ వర్షాలు కూడా పడుతుంటాయి. కానీ ఇప్పుడు వాతావరణం ఇందుకు భిన్నంగా ఉంది. ఆకాశంలో మబ్బులు కానరావడం లేదు.
ఎక్కువై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణంలో తేమశాతం ఎక్కువై ఉక్కపోత పెరిగిందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ నెల 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని, ఆ తర్వాత వానలు పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
గణనీయంగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఎండాకాలంలో నమోదయ్యే స్థాయిలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండలో 36.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సెపె్టంబర్ మూడో వారంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల మేర.. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల మేర ఉండాలని..కానీ ఇప్పుడు 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. రెండు మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరవచ్చని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment