న్యూఢిల్లీ: ఏడాదికి 5 మిలియన్ టన్నుల సామర్థ్యంగల స్టీల్ ప్లాంట్‌ను కర్ణాటకలోని బళ్లారిలో ఏర్పాటు చేయాలని వేదాంతా గ్రూప్ భావిస్తోంది. ఇందుకు రూ. 30,000 కోట్లను ఇన్వెస్ట్‌చేసే ప్రణాళికలు వేసింది. ఈ దిశలో ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదిక(ఫీజిబిలిటీ స్టడీ) కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భాగస్వామ్యం ద్వారా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి.
అయితే భాగస్వామి కోసం చర్చలింకా మొదలుపెట్టలేదని తెలిపాయి. దేశ ఇనుము, ఉక్కు రంగంలో విస్తరించేందుకు వీలుగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని వేదాంతా భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. బళ్లారి స్టీల్ ప్లాంట్‌పై కంపెనీ అత్యంత ఆసక్తిని చూపుతున్నదని, ఇక్కడ 700 ఎకరాలను కలిగి ఉన్నదని వివరించాయి. ఆగస్ట్ 1న లండన్‌లో నిర్వహించనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ప్లాంట్ విషయమై ఒక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలిపాయి. 2011లో రూ. 220 కోట్లు వెచ్చించడం ద్వారా బళ్లారి స్టీల్ అండ్ అల్లాయ్స్(బీఎస్‌ఏఎల్) ఆస్తులను వేదాంతా సొంతం చేసుకుంది. 5 లక్షల టన్నుల సామర్థ్యంతో సమీకృత స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని బీఎస్‌ఏఎల్ ప్రణాళికలు వేసినప్పటికీ, రుణ భారం కారణంగా విఫలమైంది.
బళ్లారిలో వేదాంతా స్టీల్ ప్లాంట్
Published Tue, Jul 8 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement